ఖైదీల ‘మిస్సింగ్’.. కరోనానే కారణం!

తాజా వార్తలు

Published : 15/04/2021 22:38 IST

ఖైదీల ‘మిస్సింగ్’.. కరోనానే కారణం!

దిల్లీ: గతేడాది కొవిడ్ సమయంలో ఖైదీలు వైరస్ బారిన పడకుండా చూసేందుకు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు జైలు అధికారులకు తలనొప్పి తెచ్చిపెట్టింది. 6,740 మంది ఖైదీలను పెరోల్‌పై విడుదల చేస్తే.. అందులో 3,468 మంది జాడ కనిపించట్లేదు. వారు ఎక్కడున్నారో కనుక్కునేందుకు జైలు అధికారులు దిల్లీ పోలీసులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఎదురైంది. ఇంతకీ విషయం ఏంటంటే..

2020లో కొవిడ్ ఉద్ధృతి సందర్భంగా జైల్లో కిక్కిరిసి ఉన్న ఖైదీలు కరోనా బారిన పడకుండా, న్యాయస్థానం సూచన మేరకు.. తిహార్, మాండోలి, రోహిణి జైళ్లలోని 1,184 దోషులను ఎమర్జెన్సీ పెరోల్‌పై అధికారులు విడుదల చేశారు. మొదట వారిని ఎనిమిది వారాల కోసం బయటకు పంపించగా..తరవాత ఆ సమయాన్ని పెంచుకుంటూపోయారు. ‘వారు ఈ ఏడాది ఫిబ్రవరి 7 నుంచి మార్చి 6 మధ్యలో తిరిగి సరెండర్ కావాల్సి ఉంది. కానీ అందులో 112 మంది వెనక్కి తిరిగిరాలేదు. కుటుంబ సభ్యులను ఆరా తీసినా ప్రయోజనం లేకపోయింది’ అని జైలు అధికారులు వెల్లడించారు. అలాగే విచారణ దశలో ఉన్న 5,556 మంది నిందితులను విడుదల చేయగా.. సుమారు 2,200 మంది మాత్రమే చెప్పిన సమయానికి వెనక్కి వచ్చారని తిహార్‌ జైలు అధికారి వెల్లడించారు. విచారణ దశలో ఉన్న కొందరు నిందితులు బెయిల్‌ పొందారని, ఇంకా కొందరు జైళ్లకు ఆలస్యంగా వస్తున్నారని తెలిపారు. గతేడాది మార్చిలో సుప్రీం కోర్టు ఇచ్చిన సూచన మేరకు..ఖైదీల విడుదలకు రాష్ట్రాలు ప్రమాణాలను నిర్దేశించుకున్నాయి. ఆ ప్రకారంగానే పెరోల్‌పై వారిని విడుదల చేశాయి. కాగా, దక్షిణాసియాలోనే వైశాల్యపరంగా పెద్దదైన తిహార్‌ జైల్లో 10 వేల మంది ఖైదీలను బంధించే వీలుంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని