24 వేల సంవత్సరాల తర్వాత మళ్లీ కనపడింది!
close

తాజా వార్తలు

Published : 11/06/2021 01:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

 24 వేల సంవత్సరాల తర్వాత మళ్లీ కనపడింది!

మాస్కో: గతంలో భూమిపై సంచరించిన డెల్లాయిడ్‌ రాటిఫర్‌ అనే సూక్ష్మ బహుకణ జీవి 24 వేల సంవత్సరాల తర్వాత మళ్లీ కనిపించింది.అలాజెయా నదీతీరంలో రష్యన్‌ శాస్త్రవేత్తలు దీనిని గుర్తించారు. దానిచుట్టూ పేరుకుపోయిన మంచు కరిగిన కొద్ది సేపటికి అది తిరిగి ఊపిరి పీల్చినట్లు గుర్తించారు. ఈ జీవికి ఓ ప్రత్యేకత ఉంది. కేవలం ఆడజీవులు మాత్రమే ఉంటాయి. అలైంగిక సంపర్కం ద్వారా పునరుత్పత్తి జరుపుతాయని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇది సాధారణంగా మంచి నీటిలో, సరస్సుల్లో తిరుగుతుంది. కేవలం మైక్రోస్కోప్‌ ద్వారా మాత్రమే కనిపిస్తుంది. ఈ జీవి ఘనీభవన స్థితిలో కేవలం 10 ఏళ్లు మాత్రమే జీవించి ఉండగలవని గత పరిశోధనల్లో తేలింది.

కానీ, యాకుటియా ప్రాంతంలో శాస్త్రవేత్తలు తవ్వకాలు జరుపుతూ.. దాదాపు 3.5 మీటర్ల లోతులో మట్టిని సేకరించారు. అందులో డెల్లాయిడ్‌ రాటిఫర్‌ను గుర్తించారు. కార్బన్‌డేటింగ్‌ ద్వారా మట్టిని పరీక్షిస్తే అది దాదాపు 23,960 నుంచి 24,485 ఏళ్ల మధ్యనాటిదిగా తేలింది.  దీనిని బట్టి డెల్లాయిడ్‌ రోటిఫయర్‌ వయస్సు కూడా దాదాపు అంతే ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ జీవులు ఎలాంటి విపరీత వాతావరణ పరిస్థితులనైనా తట్టుకుని మనుగడ సాగించగలవు. తక్కువ ఆక్సిజన్ ఉన్నా సంవత్సరాల తరబడి డీహైడ్రేషన్ ఉన్నా కూడా అవి జీవించగలవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.అయితే, ఈ జీవి ఇన్నాళ్లు ఎలా బతికి ఉందో తెలుసుకునేందుకు మరింత పరిశోధన చేయాల్సి ఉందని అంటున్నారు. గతంలో ఉత్తర సైబీరియాలోని రెండు ప్రాంతాల్లో 30 వేల సంవత్సరాలకు పైబడిన నిమటోడా జీవులను శాస్త్రవేత్తలు గుర్తించిన విషయం తెలిసిందే.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని