స్వేచ్ఛనిచ్చాం.. కానీ చట్టాలను పాటించాల్సిందే

తాజా వార్తలు

Updated : 11/02/2021 12:17 IST

స్వేచ్ఛనిచ్చాం.. కానీ చట్టాలను పాటించాల్సిందే

తప్పుడు సమాచార వ్యాప్తికి పాల్పడితే చర్యలు తప్పవ్: కేంద్రం

దిల్లీ: సాగు చట్టాలను రద్దు చేయాలంటూ ఆందోళనలో పాల్గొన్న రైతులను రెచ్చగొట్టే విధంగా తప్పుడు సమాచార వ్యాప్తికి పాల్పడే ఖాతాలను తొలగించే అంశంలో.. ట్విటర్ వ్యవహరిస్తోన్న తీరుపై కేంద్రం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తోంది. నకిలీ వార్తలు, హింసను ప్రోత్సహించే విధంగా సామాజిక మాధ్యమాలను దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తప్పవంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ గురువారం రాజ్యసభలో మాట్లాడుతూ.. ఈ వ్యాఖ్యలు చేశారు. 
‘మీకు భారత్‌లో కోట్ల మంది యూజర్లు ఉన్నారు. మీరు వ్యాపారం చేసుకోవడానికి, ఆదాయం పొందడానికి తగినంత స్వేచ్ఛ ఉంది. కానీ మీరు తప్పకుండా భారత రాజ్యాంగాన్ని అనుసరించాలి. మేం సామాజిక మాధ్యమాలను చాలా గౌరవిస్తాం. ఇవి సామాన్య ప్రజానీకాన్ని శక్తివంతం చేశాయి. డిజిటల్ ఇండియా కార్యక్రమంలో సోషల్ మీడియా కీలక పాత్ర పోషిస్తోంది. అయితే నకిలీ వార్తలు, హింసను ప్రేరేపించే విధంగా సామాజిక మాధ్యమాలను దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తప్పవ్‌’ అని పార్లమెంట్‌ వేదికగా ట్విటర్‌ను గట్టిగా హెచ్చరించారు. ఈ క్రమంలో ఆయన ఫేస్‌బుక్, యూట్యూబ్‌, లింక్డిన్‌ వంటి సంస్థల పేర్లను కూడా ప్రస్తావించారు. 

యూఎస్‌లో ఒకలా..భారత్‌లో మరోలా..

బుధవారం ట్విటర్ బ్లాగ్‌ పోస్టు అనంతరం కూడా కేంద్రం నుంచి ఈ తరహా స్పందనే వచ్చింది. భారత్‌లో పనిచేస్తోన్న ఒక వ్యాపార సంస్థగా అది భారత చట్టాలను గౌరవించాలని స్పష్టం చేసింది. సొంత నియమాలు, మార్గదర్శకాలతో సంబంధం లేకుండా వాటిని పాటించాలని తేల్చిచెప్పింది. ‘చట్టబద్ధంగా ఆమోదించిన ఆదేశాలను భారత్‌లో పనిచేస్తోన్న ఏ వ్యాపార సంస్థ అయినా తక్షణమే పాటించాలి. ఆలస్యం చేస్తే.. వాటికి అర్థం లేకుండా పోతుంది’ అని కేంద్రం అసహనం వ్యక్తం చేసింది. అలాగే అమెరికా క్యాపిటల్‌ హిల్ భవనంపై దాడి జరిగినప్పుడు సామాజిక మాధ్యమ సంస్థ తీరుకు.. ప్రస్తుతం వ్యవహరిస్తోన్న తీరు పూర్తి భిన్నంగా ఉందని, ఇది తీవ్ర నిరాశకు గురిచేస్తోందని వ్యాఖ్యానించింది. అంతేగాక, ప్రభుత్వ ఆదేశాలు పాటించకపోతే.. ట్విటర్‌ ఉన్నతాధికారులు అరెస్టును ఎదుర్కొవాల్సి వస్తుందని హెచ్చరించినట్లు ఓ జాతీయ మీడియా కథనం పేర్కొంది. 

భారత ప్రభుత్వంx ట్విటర్: యూఎస్ స్పందన
భారత ప్రభుత్వం, ట్విటర్ మధ్య నెలకొన్న ప్రతిష్టంభన నేపథ్యంలో.. అగ్రదేశం అమెరికా స్పందించింది. ప్రజాస్వామ్య విలువలు మరీ ముఖ్యంగా భావ ప్రకటన స్వేచ్ఛకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని స్పష్టం చేసింది. ప్రస్తుత పరిణామాలపై విదేశాంగ ప్రతినిధి నెడ్‌ ప్రైస్ మీడియాతో మాట్లాడుతూ.. ‘ప్రపంచవ్యాప్తంగా మేం భావప్రకటన స్వేచ్ఛతో సహా ప్రజాస్వామ్య విలువలకు కట్టబడి ఉన్నాం’ అని వ్యాఖ్యానించారు. 

కేంద్రం తీసుకువచ్చిన సాగు చట్టాలపై పంజాబ్‌, హరియాణా, తదితర రాష్ట్రాలకు చెందిన రైతులు రెండు నెలలకుపైగా దిల్లీ శివారుల్లో ఆందోళన చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ట్రాక్టర్ల ర్యాలీ ఉద్రిక్తంగా మారడం, చారిత్రక ఎర్రకోట వద్ద మతపరమైన జెండాను ఎగరవేయడం వంటి ఘటనలు కేంద్రాన్ని ఆగ్రహానికి గురిచేశాయి. ఆ సమయంలో జరిగిన ఘర్షణలు అంతర్జాతీయ దృష్టిలో పడటంతో పాటు, ప్రముఖుల నుంచి రైతులకు మద్దతు కూడా లభించింది. పర్యావరణ కార్యకర్త గ్రెటా థన్‌బర్గ్ షేర్ చేసిన ‘టూల్‌కిట్’ను భారత ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. రైతుల ఆందోళనపై తప్పుదోవ పట్టించే, వర్గాల మధ్య చిచ్చుపెట్టే సమాచారానికి సంబంధించి ఖాతాలను వెంటనే బ్లాక్‌ చేయాలని కేంద్రం ట్విటర్‌ను ఆదేశించింది. అయితే ట్విటర్ భావప్రకటన స్వేచ్ఛ పేరుతో 1,178 ఖాతాల్లో..500 ఖాతాలపైనే చర్య తీసుకుంది. ఇది రెండింటి మధ్య విభేదాలను తీవ్రం చేసింది.  

ఇవీ చదవండి:

భావస్వేచ్ఛకే కట్టుబడి ఉన్నాం


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని