Trojan Shield: మాఫియాపై ఆపరేషన్‌ ట్రోజన్‌ షీల్డ్‌..!
close

తాజా వార్తలు

Updated : 09/06/2021 12:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Trojan Shield: మాఫియాపై ఆపరేషన్‌ ట్రోజన్‌ షీల్డ్‌..!

ఇంటర్న్టెట్‌డెస్క్‌ ప్రత్యేకం : ఆపరేషన్‌ ట్రోజన్‌ షీల్డ్‌ పేరుతో 16 దేశాల్లో ఏకకాలంలో నిర్వహించిన భారీ ఆపరేషన్‌ వ్యవస్థీకృత నేరగాళ్లకు చుక్కలు చూపించింది. వివిధ దేశాల నిఘా సంస్థలు, భద్రతా బృందాలు కలిసి ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి. ఫలితంగా  ప్రపంచ వ్యాప్తంగా 800 మంది నేరగాళ్లను అరెస్టు చేశారు. దాదాపు 150 హత్యలు జరగకుండా ముందే అడ్డుకొన్నారు. 250 మారుణాయుధాలు, 48 మిలియన్‌ డాలర్ల నగదును స్వాధీనం చేసుకొన్నారు. 8 టన్నుల కొకైన్‌, 2 టన్నుల గంజాయి, 6 టన్నుల సింథటిక్‌ డ్రగ్స్‌, 55 లగ్జరీ కార్లు సీజ్‌ చేశారు. వీటిల్లో కరుడుగట్టిన మాఫియా గ్రూపులు, మోటార్స్ సైకిల్‌ గ్యాంగ్‌లు, ఆసియాకు చెందిన క్రిమినల్‌ సిండికేట్లు, ఇతర క్రిమినల్‌ నెట్‌వర్క్‌లు ఉన్నాయి. ఈ విషయంపై నిన్న అమెరికాకు చెందిన ఎఫ్‌బీఐ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ కెల్విన్‌ షివర్స్ ఐరోపా సమాఖ్య పోలీస్‌ ప్రధాన కేంద్రమైన నెదర్లాండ్స్‌లో మాట్లాడారు.

నేర ప్రపంచంలోకి నిఘాఫోన్లను చొప్పించిన ఎఫ్‌బీఐ

ప్రపంచ వ్యాప్తంగా 300 నేర సిండికేట్ల చేతికి ఏఎన్‌ఓఎం యాప్‌ ఉన్న 12,000  ఫోన్లను చేరేట్లు భద్రతా దళాలు వ్యూహరచన చేశాయి. ఈ నేర సామ్రాజ్యాలు దాదాపు 100 దేశాల్లో విస్తరించి ఉన్నాయి. దీనిని ఎఫ్‌బీఐ, ఆస్ట్రేలియా ఫెడరల్‌ పోలీసులు డిజైన్‌ చేశారు. వ్యవస్థీకృత నేరగాళ్లు వినియోగించడానికి అవసరమైన హంగులు దానికి సమకూర్చారు. అప్పటికే చాలా నేర ముఠాలు ఎన్‌క్రిప్టెడ్‌ కమ్యూనికేషన్‌ ప్లాట్‌ఫామ్‌ కోసం ఎదురు చూస్తున్నాయి. దీంతో వీరికి ఫోన్లు చేరేలా చేయడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం రాలేదు. దీంతో నేరగాళ్లలో ఏఎన్‌ఓఎం మంచి ప్రాచుర్యం పొందింది. ఈ ఫోన్లు అందుకొన్న వాటిల్లో ఇటాలియన్‌ మాఫియా, మోటార్‌ సైకిల్‌ గ్యాంగ్‌లు ఉన్నాయి. భద్రతా ఏజెన్సీలు అత్యంత జాగ్రత్తగా ఆ మెసేజ్‌లను చదివి వారి ప్రణాళికలను తెలుసుకున్నారు. 2.7కోట్ల సందేశాలను భద్రపర్చారు.

అప్పటికే ఉన్నవాటిని మూసివేయడంతో
 
గతేడాది  వరకు వీరు స్కైఈసీసీ అనే ఎన్‌క్రిప్టెడ్‌ ప్లాట్‌ఫామ్‌ వాడారు. కానీ, ఐరోపా పోలీసులు దాని ఎన్‌క్రిప్షన్‌ను క్రాక్‌ చేసి 17 టన్నుల కొకైన్‌ స్వాధీనం చేసుకొని పలువురిని అరెస్టు చేశారు. నేరగాళ్లు వాడే ఫాంటమ్‌ సోర్స్‌, ఎన్‌క్రోఛాట్‌, స్కైఈసీసీని మూసివేశారు. 2018లో ఫాంటమ్‌ సోర్స్‌ తయారీ దారుల్లో ఒకరిని ఎఫ్‌బీఐ పట్టుకొని కొత్త యాప్‌ తయారు చేయించింది. ఇది మిలటరీ గ్రేడ్‌ ఎన్‌క్రిప్షన్‌తో సందేశాలను పంపిస్తుంది. వీటిల్లో కిల్‌ స్విచ్‌ కూడా ఉంటుందని టెక్నికల్‌ ఎక్స్‌ప్లోర్‌ వెబ్‌సైట్‌ పేర్కొంది. దీని ద్వారా డేటా, కాంటాక్టులను తొలగించవచ్చని పేర్కొంది. 

తొలుత ఆస్ట్రేలియాలో నేరగాళ్ల నెట్‌వర్క్‌లోకి 50 ఫోన్లను ప్రయోగాత్మకంగా చొప్పించారు. ఆ తర్వాత కేవలం మౌత్‌ పబ్లిసిటీతోనే ఈ యాప్‌ ఉన్న ఫోన్‌ వారు వాడటం మొదలుపెట్టారు. ఆ తర్వాత ఇది దాదాపు 100 దేశాలకు విస్తరించింది. జర్మనీ, నేదర్లాండ్స్‌, స్పెయిన్‌, ఆస్ట్రేలియా, సెర్బియాల్లో ఇది బాగా పాపులర్‌ అయింది. నేరగాళ్లకు తెలియనిది ఏమిటంటే ఆ యాప్‌ నుంచి వెళ్లే ప్రతిసందేశం ఎఫ్‌బీఐ సర్వర్‌లో కాపీ అవుతుందని. దీంతో చాలా నేరాలను అధికారులు ముందే అడ్డుకోగలిగారు.

ఇప్పుడు ఆపరేషన్‌ను ఎందుకు బహిర్గతం చేశారు..

ఇన్నాళ్లు గుట్టుగా ఉన్న ఈ ఆపరేషన్‌ను ఇప్పుడు ఎందుకు బహిర్గతం చేశారో కారణాలు కచ్చితంగా తెలియలేదు. కానీ, న్యాయపరమైన చిక్కులు, పలు అనుమానాలు ఎదురుకావడం ఒక కారణంగా భావిస్తున్నారు. దీంతోపాటు ఇటీవలే కొందరు ఏఎన్‌ఓఎం ఒక స్కామ్‌ అని అన్‌లైన్‌లో పోస్టు చేశారు. ఒక సెర్చింజిన్‌ సర్వర్‌తో నిరంతరం అది కనెక్ట్‌ అవుతోందని పేర్కొన్నారు. ఇలా పలు కారణాలతో ఆపరేషన్‌ను బహిర్గతం చేశారు. కానీ, రెండోసారి నేరగాళ్ల ముఠాలు ఎన్‌క్రిప్టెడ్‌ కమ్యూనికేషన్‌ను నమ్మాలంటే భయపడే పరిస్థితి తీసుకొచ్చారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని