స్వీయ క్షమాభిక్షపై వెనక్కి తగ్గిన ట్రంప్‌!
close

తాజా వార్తలు

Published : 18/01/2021 11:54 IST

స్వీయ క్షమాభిక్షపై వెనక్కి తగ్గిన ట్రంప్‌!

వాషింగ్టన్‌: మరికొద్ది గంటల్లో అధికార పీఠాన్ని వీడబోతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. చివరి రోజు కరుణరసాన్ని కురిపించేందుకు సిద్ధమవుతున్నారు. మంగళవారం 100 మందికి పైగా వ్యక్తులకు క్షమాభిక్ష పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం జాబితాను కూడా సిద్ధం చేసుకున్నారు. అయితే, తన తప్పులను కూడా ప్రక్షాళన చేసుకునేందుకు ‘స్వీయ క్షమాభిక్ష’ గురించి యోచన చేసిన ట్రంప్‌.. ఇప్పుడు ఆ ఆలోచనపై వెనక్కి తగ్గినట్లు సమాచారం. 

దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని అనే చందంగా.. పదవిలో ఉండగానే తన తప్పిదాల నుంచి విముక్తి కల్పించుకోడానికి ‘స్వీయ క్షమాభిక్ష యోచన చేసినట్లు ఇటీవల అమెరికా మీడియా కథనాలు వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ విశేషాధికారంపై ట్రంప్‌ తన వ్యక్తిగత సలహాదారులతో విస్తృతంగా సంప్రదింపులు జరిపారట. అయితే, దీనిపై ప్రజల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తుందని, అంతేగాక.. తప్పులను స్వయంగా ఒప్పుకున్నట్లవుతందని వారు ట్రంప్‌ను హెచ్చరించినట్లు తెలుస్తోంది. దీంతో స్వీయ క్షమాభిక్షపై ఆయన వెనక్కి తగ్గినట్లు సమాచారం. అంతేగాక, తన కుటుంబసభ్యుల్లోనూ ఎవరికీ ట్రంప్‌ క్షమాభిక్ష పెట్టట్లేదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. 

అధ్యక్షుడే తనకు తానుగా క్షమాభిక్ష ఇచ్చుకోవాలని అనుకోవడం గతంలో ఎప్పుడూ జరగలేదు. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల నాటి నుంచే ‘స్వీయ క్షమాభిక్ష’పై ట్రంప్‌ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా చేస్తే వచ్చే పరిణామాలపై న్యాయనిపుణులతో చర్చించారు. 2018 జూన్‌లోనే దీనిపై ట్రంప్‌ ట్వీట్‌ చేశారు. ‘‘నేను చాలా మంది న్యాయనిపుణులతో సంప్రదింపులు జరిపాను. స్వీయ క్షమాభిక్ష ఇచ్చుకునేందుకు నాకు అధికారాలు ఉన్నాయి’’ అని దాంట్లో పేర్కొన్నారు. అయితే రాజ్యాంగం ప్రకారం ఇది సాధ్యం కాదని పలువురు అంటున్నారు. ఏ వ్యక్తికి కూడా తన సొంత కేసులో తీర్పు చెప్పుకునే అవకాశం ఉండదని వారు పేర్కొన్నారు. 

గతేడాది డిసెంబరులోనే 40 మందికి పైగా వ్యక్తులకు క్షమాభిక్ష ప్రసాదించిన ట్రంప్‌.. మంగళవారం మరో 100 మందికి పైగా వ్యక్తులకు కేసుల దర్యాప్తుల నుంచి విముక్తి కల్పించనున్నారు. దీంతో పాటు పలువురు దోషుల శిక్షలు కూడా తగ్గించనున్నట్లు సమాచారం. జనవరి 20న అధ్యక్ష బాధ్యతల నుంచి దిగిపోనున్న ట్రంప్‌నకు.. మంగళవారమే చివరి పనిదినం కానుంది. బుధవారం కొత్త అధ్యక్షుడిగా జో బైడెన్‌ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరుకాబోనని ముందే ప్రకటించిన ట్రంప్‌.. ఆ రోజు ఉదయమే వాషింగ్టన్‌ వదిలి వెళ్లనున్నారు.

ఇవీ చదవండి..

ఆ రకంగానూ ట్రంప్‌ది రికార్డే

చైనాకు ట్రంప్‌ చివరి ఝలక్‌!

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని