Maharashtra: ఒకరి కోసం వేచి చూసి.. ప్రాణాలు కోల్పోయిన 29 మంది

తాజా వార్తలు

Published : 04/08/2021 22:24 IST

Maharashtra: ఒకరి కోసం వేచి చూసి.. ప్రాణాలు కోల్పోయిన 29 మంది

ముంబయి: డబ్బు, ఫోన్ కోసం ఇంటికి వెళ్లిన వ్యక్తి కోసం వేచి చూసి, అతడితో సహా 30 మంది ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. గత నెల మహారాష్ట్రలోని రాయ్‌గఢ్‌ జిల్లాలో కొండచరియలు విరిగి పడిన ఘటనలో జరిగిన విషాదం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇటీవల ఆ రాష్ట్రంలో వర్షాలు బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో కొండచరియల రూపంలో మృత్యువు ముంచుకొచ్చి.. పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన నుంచి బయటపడిన వ్యక్తి వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి.

వర్షాలు సృష్టించిన బీభత్సం, కొండ చరియల ముప్పుతో రాయగఢ్‌ జిల్లాలోని తలై గ్రామస్థులు సురక్షిత ప్రాంతానికి వెళ్లేందుకు బయలుదేరారు. అలా తరలివెళ్తుండగా.. వారిలో ఒకరు వెంటనే వస్తానని ఫోన్, డబ్బు తెచ్చుకునేందుకు ఇంటికి వెళ్లారు. అతడి కోసం మిగతా 29 మంది వేచిఉన్నారు. ఆ విషయాన్ని అక్కడే ఉన్నమరో వ్యక్తి గమనించారు. వారంతా ప్రమాదం అంచున్న ఉన్నారని గ్రహించిన ఆయన.. వెంటనే అక్కడినుంచి సురక్షిత ప్రాంతానికి వెళ్లిపోవాలని వారికి సూచించారు. అయితే అప్పటికే ఆలస్యమైంది. కొండచరియలు ఒక్కపెట్టున విరిగిపడటంతో.. ఫోన్‌కోసం వెళ్లిన వ్యక్తితో సహా అంతా వాటికింద ఇరుక్కుపోయి ప్రాణాలు కోల్పోయారు. జులై 22న జరిగిన ఘటన వివరాల్ని తాజాగా ఓ మీడియా కథనం వెల్లడించింది. ఆ వెంటనే ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది. ఆ సమయంలో శిథిలాల కింద సదరు వ్యక్తి మృతదేహం వద్ద రూ.500 నోట్లు ఉన్నట్లు గుర్తించారు. ఈ ప్రమాదాన్ని ముందే పసిగట్టి అక్కడి నుంచి వెళ్లిపోయినవారంతా ప్రాణాలతో బయటపడ్డారు.

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ముంబయి సహా పలు జిల్లాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. పలు చోట్ల కొండచరియలు విరిగిపడగా.. మరికొన్ని చోట్ల లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. దాంతో సుమారు 200 మంది ప్రాణాలు కోల్పోయారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని