వెంకయ్యనాయుడి ట్విటర్‌.. ‘బ్లూటిక్‌’ వివాదం
close

తాజా వార్తలు

Updated : 05/06/2021 12:06 IST

వెంకయ్యనాయుడి ట్విటర్‌.. ‘బ్లూటిక్‌’ వివాదం

దిల్లీ: ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు వ్యక్తిగత ట్విటర్‌ ఖాతాకు బ్లూ వెరిఫైడ్‌ టిక్‌ మార్క్‌లను సోషల్‌మీడియా సంస్థ శనివారం తొలగించింది. అయితే కొద్ది గంటల తర్వాత మళ్లీ ఆయన ఖాతాకు బ్లూ టిక్‌లు పెట్టడం గమనార్హం. గత కొంతకాలంగా కేంద్ర ప్రభుత్వం, ట్విటర్‌ మధ్య తరచూ వివాదాలు నెలకొంటున్న సమయంలో తాజా పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి. 

వెంకయ్యనాయుడు వ్యక్తిగత ట్విటర్‌ @MVenkaiahNaidu ఖాతాకు ఈ ఉదయం వెరిఫైడ్‌ టిక్ మార్కులు తొలగించారు. గత కొన్ని నెలలుగా ఈ ఖాతాను ఉపయోగించకపోవడం వల్లే బ్లూ టిక్‌లను తీసేసినట్లు ట్విటర్‌ ప్రతినిధులు తెలిపారు. ఈ ఖాతా నుంచి జులై 23, 2020న చివరి ట్వీట్ చేశారు. ఆ తర్వాత నుంచి ఎలాంటి ట్వీట్లు చేయలేదు. సాధారణంగా ఒక ఖాతా ఆ వ్యక్తికి చెందినదే అని అధికారికంగా చెప్పేందుకు ట్విటర్‌ ఈ వెరిఫైడ్ టిక్‌లను ఇస్తుంది. అయితే ట్విటర్‌ నిబంధనల ప్రకారం.. అకౌంట్‌ పేరు(@తో మొదలయ్యే పేరు) మార్చినా.. ఆరు నెలలకు పైగా ఖాతాను ఉపయోగించకపోయినా.. వెరిఫికేషన్‌ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నా.. ఎలాంటి నోటీసు లేకుండానే ఈ బ్లూ టిక్‌లను సంస్థ తొలగిస్తుంటుంది.

అయితే దేశానికి ఉపరాష్ట్రపతి అయిన వెంకయ్యనాయుడు వ్యక్తిగత ఖాతాను ట్విటర్‌ ‘అన్‌వెరిఫై’ చేయడం వివాదాస్పదంగా మారింది. దీనిపై ఉపరాష్ట్రపతి కార్యాలయం నుంచి అభ్యంతరం వ్యక్తమవడంతో కొద్ది గంటల తర్వాత తిరిగి ఆయన ఖాతాకు బ్లూ టిక్‌లను యాడ్‌ చేసినట్లు తెలుస్తోంది.

ఓవైపు కేంద్రం, ట్విటర్‌ మధ్య వివాదం కొనసాగుతున్న సమయంలో ఈ పరిణామాలు చోటుచేసుకోవడం గమనార్హం. డిజిటల్‌ మీడియాలో డేటా నియంత్రణ కోసం కేంద్రం తీసుకొచ్చిన కొత్త చట్టాల అమలు విషయంలో ఇరు వర్గాల మధ్య వివాదం రాజుకున్న విషయం తెలిసిందే. ఆ చట్టాల వల్ల భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు ముప్పు ఉందని ట్విటర్‌ చేసిన వ్యాఖ్యలు కేంద్రానికి తీవ్ర ఆగ్రహం తెప్పించాయి. దీనికి ప్రభుత్వం కూడా దీటుగానే బదులిచ్చింది. ఇక, అంతకుముందు కాంగ్రెస్‌ టూల్‌కిట్‌ వ్యవహారంలో భాజపా నేతల ట్వీట్లకు ‘నకిలీ మీడియా’ అని మార్క్‌ చేయడం కూడా తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని