యూపీలో కేసు.. ముందస్తు బెయిల్‌కు ట్విటర్‌ ఎండీ
close

తాజా వార్తలు

Published : 24/06/2021 14:53 IST

యూపీలో కేసు.. ముందస్తు బెయిల్‌కు ట్విటర్‌ ఎండీ

దిల్లీ: నూతన ఐటీ నిబంధనలను పాటించనందుకు గానూ భారత్‌లో మధ్యవర్తి రక్షణ హోదా కోల్పోయిన సామాజిక మాధ్యమ సంస్థ ట్విటర్‌.. తొలి విచారణ ఎదుర్కోబోతోంది. ఉత్తరప్రదేశ్‌లో ఓ దాడి ఘటనకు సంబంధించిన కేసులో ట్విటర్‌ అధికారులపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఆ కేసు విచారణ నిమిత్తం ట్విటర్‌ ఇండియా హెడ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ మనీశ్‌ మహేశ్వరీ నేడు పోలీసుల ఎదుట హాజరుకానున్నట్లు అధికారిక వర్గాల సమాచారం. అయితే, ఇదే సమయంలో మనీశ్.. ముందస్తు బెయిల్‌ కోరుతూ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. దాడి కేసులో తనకు అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ ఆయన నిన్న కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసినట్లు తెలిసింది. 

ఉత్తరప్రదేశ్‌లోని ఘాజియాబాద్‌లో ఇటీవల ఓ ముస్లిం వృద్ధుడిపై దాడి జరిగింది. ఆ ఘటనకు సంబంధించిన కొన్ని వీడియోలు ట్విటర్‌లో వైరల్‌ అయ్యాయి. అయితే, వాస్తవాలను కప్పిపుచ్చి ఆ వీడియోల్లో తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఆ పోస్టులపై ట్విటర్‌, ట్విటర్‌ కమ్యూనికేషన్‌ ఇండియాపై కేసు నమోదు చేశారు. దీనిపై వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాలంటూ గతవారం ట్విటర్‌ ఇండియా ఎండీ మనీశ్‌కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ‘‘సమాజంలో విద్వేషాలను రెచ్చగొట్టేందుకు కొంతమంది ట్విటర్‌ను ఉపయోగించుకున్నారు. ట్విటర్‌ సంస్థగానీ, భారత్‌లోని దాని విభాగంగానీ దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో ఈ విద్వేషపూరితమైన సందేశం వైరల్‌గా మారేందుకు ఆస్కారం ఏర్పడింది’’ అని మహేశ్వరికి పంపిన నోటీసుల్లో పోలీసులు పేర్కొన్నారు. దీంతో జులై 24న తాను ఘాజియాబాద్‌ పోలీస్‌స్టేషన్‌కు వెళ్తున్నట్టు మనీశ్‌ గత సోమవారం వెల్లడించారు. అయితే విచారణకు వెళ్లకముందే ఆయన ముందస్తు బెయిల్‌ కోరడం గమనార్హం. 

నూతన ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ(ఐటీ) నిబంధనలు పాటించనందుకు ‘సురక్షిత ఆశ్రయం’(సేఫ్‌ హార్బర్‌) అన్న రక్షణ కవచాన్ని ట్విటర్‌ కోల్పోయింది. నూతన నిబంధనల ప్రకారం ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేకంగా అధికారులను నియమించాలని పలుమార్లు సూచించినా పట్టించుకోకపోవడంతో కేంద్రం ఈ సౌకర్యాన్ని తొలగించింది. దీని ప్రకారం ఎవరైనా చట్టవ్యతిరేకమైన సమాచారాన్ని పెడితే తృతీయ పక్షం కింద ట్విటర్‌పై భారతీయ శిక్షా స్మృతి ప్రకారం చర్యలు తీసుకొనే వీలు కలుగుతుంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని