Twitter: బెట్టువీడి.. చర్యలు చేపట్టి!

తాజా వార్తలు

Published : 12/07/2021 01:16 IST

Twitter: బెట్టువీడి.. చర్యలు చేపట్టి!

నెలవారీ పారదర్శక నివేదిక విడుదల చేసిన ట్విటర్‌

దిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఐటీ నిబంధనల అమలుకు తొలుత ససేమిరా అన్న సామాజిక మాధ్యమం ట్విటర్‌ ఎట్టకేలకు బెట్టువీడింది. నిబంధనల అమలుకు అంగీకరిస్తూ తగు చర్యలు తీసుకుంది. ఇప్పటికే దేశంలో ఫిర్యాదుల అధికారిని నియమించింది. తాజాగా నెలవారీ పారదర్శక నివేదికను కూడా విడుదల చేసింది. నిబంధనలు అమల్లోకి వచ్చి దాదాపు నెలన్నర గడిచిన తర్వాత ట్విటర్ చర్యలకు ఉపక్రమించడం గమనార్హం. ఈ క్రమంలో దిల్లీ హైకోర్టు వేసిన మొట్టికాయలు కూడా తినాల్సి రావడంతో పాటు, వివిధ రాష్ట్రాల్లో కేసులు ఎదుర్కోవాల్సి వచ్చింది.

తమ వేదికపై నిబంధనలకు విరుద్ధంగా ఉన్న కంటెంట్లపై చర్యలు తీసుకున్నట్లు పారదర్శక నివేదికలో ట్విటర్‌ వెల్లడించింది. వీటిలో చాలా కంటెంట్లను తొలగించగా.. కొన్నింటిని ఫ్లాగ్‌ చేసినట్లు పేర్కొంది. మే 26-జూన్‌ 25 మధ్య.. హింసను ప్రేరేపించేలా, నగ్నచిత్రాలకు సంబంధించిన 18 వేల పోస్టులు, ఉగ్రవాదానికి చెందిన 4 వేలు సహా విద్వేషాలు, ఆత్మహత్యలు, వేధింపులకు సంబంధించిన పోస్టులు, ఫొటోలు, వీడియోలపై చర్యలు తీసుకున్నట్లు వెల్లడించింది. తీవ్ర అభ్యంతరకరంగా ఉన్న వాటిని పూర్తిగా తొలగించినట్లు తెలిపింది. కొన్నింటిని హెచ్చరికతో వదిలేసినట్లు వివరించింది. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న కంటెంట్లను పర్యవేక్షించేందుకు సంస్థలో ఉన్న అంతర్గత సాధనాలను వినియోగించినట్లు తెలిపింది.

ప్రభుత్వం సమాచారం కోసం చేసిన అభ్యర్థనలు.. వాటిలో ఎన్ని ఖాతాలకు సంబంధించిన వివరాలను సర్కార్‌కు అందజేశారో తెలియజేసే ‘ఇన్ఫర్మేషన్‌ రిక్వెస్ట్‌’ను కూడా ట్విటర్‌ విడుదల చేసింది. నూతన ఐటీ నిబంధనలను అనుసరించి ఫేస్‌బుక్‌, గూగుల్‌, ఇన్‌స్టాగ్రామ్‌ సహా పలు సామాజిక మాధ్యమాలు ఇప్పటికే నెలవారీ పారదర్శక నివేదికను విడుదల చేశాయి.

వివిధ సామాజిక మాధ్యమాల్లో డిజిటల్‌ కంటెంట్‌పై నియంత్రణ కోసం... కేంద్ర ప్రభుత్వం గత ఫిబ్రవరిలో కొత్త నియమ నిబంధనలను ప్రకటించింది. అవన్నీ తక్షణమే అమల్లోకి వచ్చాయి. అయితే... దిగ్గజ సామాజిక వేదిక(50 లక్షల రిజిస్టర్డ్‌ వినియోగదారులున్నవి... ట్విటర్‌, వాట్సప్‌, ఫేస్‌బుక్‌, గూగుల్‌ లాంటివి)లకు మాత్రం వీటి అమలుకు వీలుగా 3నెలల సమయం ఇచ్చింది. ఆ గడువు ముగియడంతో మే 26 నుంచి నూతన నిబంధనలు అమల్లోకి వచ్చాయి. అయితే ఈ నిబంధనలను పాటించేందుకు ఫేస్‌బుక్‌, గూగుల్‌ సుముఖత వ్యక్తం చేసినప్పటికీ.. ట్విటర్‌ మాత్రం కొత్త నిబంధనలు అమలు చేయడంలో జాప్యం చేసింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని