మనుషులకు సోకే మరో రెండు కరోనా వైరస్‌లు..!

తాజా వార్తలు

Published : 21/05/2021 17:41 IST

మనుషులకు సోకే మరో రెండు కరోనా వైరస్‌లు..!

ఇంటర్నెట్‌డెస్క్‌: మనుషులకు సోకే ప్రమాదం ఉన్న మరో రెండురకాల కరోనావైరస్‌లను శాస్త్రవేత్తలు కొన్నేళ్ల కిందటే గుర్తించారని సైన్స్‌మాగ్‌.ఓఆర్‌జీ పత్రిక పేర్కొంది. కొన్నేళ్ల క్రితం మలేసియాలో ఎనిమిది మంది పిల్లలకు నిమోనియా సోకి ఆసుపత్రి పాలయ్యారు. వారిని పరిశీలించగా కుక్కల్లో కనిపించే ఒక రకమైన కరోనావైరస్‌ సోకినట్లు గుర్తించారు. ఇప్పటికే కరోనా కుటుంబ నుంచి ఏడురకాల వైరస్‌లు మనుషులకు సోకుతున్నాయి. వీటిలో సార్స్‌1, సార్స్‌2, మెర్స్‌ అత్యంత ప్రమాదకరమైనవి. మిగిలినవి స్వల్ప అనారోగ్యం కలిగిస్తాయి. దీనిపై ఐయోవా విశ్వవిద్యాలయం వైరాలజిస్టు స్టాన్లీ పెర్ల్‌మన్‌ మాట్లాడుతూ ‘‘మనం కరోనావైరస్‌లు ఒక జీవి నుంచి మరో జీవిలోకి మారటాన్ని మరింత ఎక్కువగా చూస్తుంటాం’’ అని పేర్కొన్నారు.  

కాకపోతే వైద్యులు గతంలో కనుగొన్న రెండు కొత్త కరోనావైరస్లు మనుషుల నుంచి మనుషులకు వ్యాపించగలవో లేదో వెల్లడించలేదు.  మలేషియాలో కనుగొన్న కరోనావైరస్‌ జన్యుక్రమాన్ని ‘క్లినికల్‌ ఇన్‌ఫెక్షియస్‌ డిసీజెస్‌’ పత్రికలో ప్రచురించారు.  వాటిలో ఒకటి పిల్లులకు, మరొకటి పందులకు గతంలో సోకిందని అందులో పేర్కొన్నారు. 

ఇక ఈ కొత్త కరోనావైరస్‌ సోకిన 8 మంది కూడా మలేషియాలోని సంప్రదాయ తెగకు చెందినవారే కావడం విశేషం. వారంతా గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తారు.  తరచుగా పెంపుడు, అడవి జంతువులతో దగ్గరగా మెలుగుతుంటారు. అలా జంతువుల్లోని వైరస్‌లకు సమీపంగా ఉండటంతో  వారికి వ్యాపించి ఉండొచ్చని భావించారు. పైగా వారంతా పిల్లలే. అందులో నలుగురు పసికందులు. అప్పట్లో 4 నుంచి 7 రోజుల పాటు ఆసుపత్రుల్లో చికిత్స పొంది అందరూ కోలుకొన్నారు. సాధారణంగా భారీగా మనుషులు, ఇతర జీవులు కలిసి ఉండేచోట కొత్త వైరస్లు ప్రబలే అవకాశాలున్నాయని డ్యూక్‌ విశ్వవిద్యాలయానికి చెందిన గ్రెగరీ గ్రే పేర్కొన్నారు. ముఖ్యంగా జంతువుల మార్కెట్లు, ఫామ్‌లు వంటివి వీటికి కేంద్రాలుగా ఉంటాయన్నారు. వైరస్లు మనుషుల్లోకి ప్రవేశించేలా రూపాంతరం చెందడానికి కొన్నేళ్లు సమయం పడుతుందని ఆయన తెలిపారు. 

 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని