
తాజా వార్తలు
కరోనా విజృంభణకు కొత్తరకం కారణం కాదు..!
కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడి
దిల్లీ: దేశంలో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత మరోసారి పెరుగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లో వైరస్ వ్యాప్తి అధికంగా ఉంది. ఈ సమయంలో వైరస్ విస్తృత వ్యాప్తికి కారణంగా భావిస్తోన్న N440K, E484K రకాలను ఈ రెండు రాష్ట్రాల్లో గుర్తించారు. అయితే, ఈ రెండు రాష్ట్రాల్లో కేసుల సంఖ్య పెరుగుదలకు ఈ కొత్తరకం కారణమని చెప్పలేమని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టంచేసింది.
‘మహారాష్ట్రలో N440K, E484K కొత్తరకం వైరస్లు ఇప్పటికే నిర్ధారణ అయ్యాయి. ఇవే రకాలు అటు కేరళ, తెలంగాణలో వెలుగుచూశాయి. దేశంలో గతకొన్ని రోజులుగా కేసుల సంఖ్య పెరగడానికి ఈ కొత్తరకం కాకపోవచ్చని..ఇందుకు సంబంధించిన శాస్త్రీయ సమాచారం ఆధారంగా నమ్మడానికి ఎలాంటి కారణాలు లేవు’ అని నీతి ఆయోగ్ (ఆరోగ్యం) సభ్యుడు వీకే పాల్ వెల్లడించారు. కరోనా వైరస్ మ్యుటేషన్ల ప్రవర్తనను నిశితంగా గమనిస్తున్నామన్న పాల్, ఇప్పటిరవకు దేశంలో 3500 స్ట్రెయిన్లను సీక్వెన్స్ చేసినట్లు చెప్పారు. ఈ ప్రక్రియను నిరంతరం చేస్తూనే ఉంటామని, పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తామని పేర్కొన్నారు. ఇక బ్రిటన్ రకం వైరస్ ఇప్పటివరకు 187 కేసుల్లో నిర్ధారణ కాగా, మరో ఆరు కేసుల్లో దక్షిణాఫ్రికా రకం కేసులు వెలుగు చూశాయన్నారు. మరో కేసులో బ్రెజిల్ రకం బయటపడినట్లు వీకే పాల్ తెలిపారు.
ఇదిలాఉంటే, N440K అనే కరోనా వైరస్ ఉత్పరివర్తనం దేశంలో తీవ్ర స్థాయిలో వ్యాప్తి చెందుతోందని కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్(సీసీఎంబీ) శాస్త్రవేత్తలు వెల్లడించారు. N440K రకం దక్షిణాది రాష్ట్రాల్లోనే విజృంభిస్తున్నట్లు సీసీఎంబీ డైరెక్టర్ రాకేశ్ మిశ్రా తెలిపారు. ప్రతి వైరస్ ఉత్పరివర్తనం కొత్తరకం కరోనా వైరస్ కానక్కర్లేదని ఆయన, కొవిడ్-19 జన్యు సమాచారం జెనెటిక్ కోడ్ను కనుగొనడంలో భారత్ వెనకబడి ఉందని చెప్పారు. ఇప్పటివరకు కోటి కరోనా కేసుల్లో కేవలం 6400 జీనోమ్లను మాత్రమే కనుగొన్నామని పేర్కొన్నారు.