అణచివేత తీవ్ర పరిణామాలకు దారి తీయొచ్చు!

తాజా వార్తలు

Published : 16/02/2021 09:55 IST

అణచివేత తీవ్ర పరిణామాలకు దారి తీయొచ్చు!

యాంగూన్‌: మయన్మార్‌లో సైనిక పాలనను వ్యతిరేకిస్తూ ప్రజల ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. వాటిని నిలువరించేందుకు సైనిక పాలకులు కఠిన విధానాలు అవలంబిస్తున్నారు. ఈ క్రమంలో నిరసనలు చేస్తున్న పౌరుల పట్ల ఆర్మీ వ్యవహరిస్తున్న తీరుపై ఐక్యరాజ్యసమితి స్పందించింది. నిరసనకారుల పట్ల సైనికులు వ్యవహరిస్తున్న కఠిన వైఖరి సరికాదని అభిప్రాయపడింది. ఆ పరిస్థితులు తీవ్ర పరిణామాలకు దారితీయొచ్చని హెచ్చరించింది. ఈ మేరకు ఐరాస ప్రత్యేక రాయబారి క్రిస్టినర్‌ బర్గెనర్‌ హెచ్చరించినట్లు.. యూఎన్‌ ప్రతినిధి ఫర్హాన్‌ హక్‌ ఓ ప్రకటనలో వెల్లడించారు. 

‘శాంతియుతంగా కొనసాగుతున్న పౌరుల ఆందోళనల్ని తప్పనిసరిగా గౌరవించాలి. ఆందోళనకారుల పట్ల ప్రతీకార చర్యలు ఉండకూడదు. ఇప్పటికే మయన్మార్‌లో కొనసాగుతున్న పరిణామాల్ని ప్రపంచం నిశితంగా గమనిస్తోంది. ఆర్మీ అనుసరిస్తున్న కఠిన వైఖరి తీవ్ర పరిణామాలకు దారి తీయొచ్చు’ అని క్రిస్టినర్‌ హెచ్చరించారు. అంతేకాకుండా దేశంలోని పలు ప్రధాన నగరాల్లో రెండు రోజులుగా ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేయడంపైనా ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. 

మయన్మార్‌ నేత ‌ఆంగ్‌ సాన్‌ సూకీని సైనికులు నిర్బంధించడాన్ని వ్యతిరేకిస్తూ అక్కడి ప్రజలు నిరసనలు చేస్తున్న విషయం తెలిసిందే. దేశంలో ఎన్నికైన ప్రభుత్వమే కొనసాగాలని డిమాండు చేస్తూ.. సూకీని వెంటనే విడుదల చేయాలని నిరసనకారులు కోరుతున్నారు. ఈ క్రమంలో సోమవారం మాండలేలో పౌరులు వేలాదిగా వచ్చి నిరసనలు చేశారు. వారిపై సైన్యం లాఠీఛార్జితో పాటు, రబ్బర్ ‌తూటాలను ప్రయోగించింది. సూకీ గృహ నిర్బంధం సోమవారానికి ముగిసినా దాన్ని 17వతేదీ వరకు సైనికులు పొడిగించడంపై పౌరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా మరోవైపు గత ఎన్నికల్లో జరిగిన అక్రమాల విచారణలో ప్రభుత్వం విఫలమైనందుకే తాము జోక్యం చేసుకోవాల్సి వచ్చిందని సైన్యం పేర్కొంటోంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని