సింఘులో మళ్లీ ఉద్రిక్తత

తాజా వార్తలు

Updated : 29/01/2021 18:49 IST

సింఘులో మళ్లీ ఉద్రిక్తత

టియర్‌ గ్యాస్‌ ప్రయోగించిన పోలీసులు

దిల్లీ: దిల్లీ-హరియాణా సరిహద్దు సింఘులో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్న రైతులు గత కొన్ని రోజులుగా ఇక్కడ శిబిరాలు ఏర్పాటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని డిమాండ్‌ చేస్తూ స్థానికులుగా చెప్పుకుంటున్న కొంతమంది ఆందోళనకు దిగారు. ఓ దశలో రైతుల గుడారాలపైకి రాళ్లు విసిరినట్లు సమాచారం. అలాగే కొన్ని టెంట్లను పీకివేసేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. దీంతో రైతులు, స్థానికుల మధ్య తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది.

దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. స్థానికులుగా చెప్పుకుంటున్న వారిని అదుపుచేసేందుకు ప్రయత్నించారు. అయినా వినకపోవడంతో లాఠీఛార్జి చేశారు. పరిస్థితి మరీ ఉద్రిక్తంగా మారడంతో బాష్పవాయువు కూడా ప్రయోగించారు. ఈ ఘటనలో కొంతమంది పోలీసులు గాయపడ్డట్లు తెలుస్తోంది. సింఘు ప్రాంతాన్ని ఖాళీ చేయాలని డిమాండ్‌ చేస్తూ కొంతమంది స్థానికులు గురువారమే నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. అక్కడి నుంచి ఒక్క రోజులో వెళ్లిపోవాలని రైతులకు అల్టిమేటం జారీ చేశారు. అయినా, రైతులు అక్కడే బైఠాయించడంతో.. నేడు ఆకస్మికంగా ఆందోళనకు దిగారు.

మరోవైపు ఆందోళన కొనసాగుతున్న ఇతర ప్రాంతాల్లో వాతావరణం వేడెక్కింది. గురువారం అర్ధరాత్రిలోగా దిల్లీ సరిహద్దులోని యూపీ గేట్‌ను ఖాళీ చేయాలంటూ ఘజియాబాద్‌ పాలనాయంత్రాంగం రైతులకు అల్టిమేటం జారీ చేసిన విషయం తెలిసిందే. అక్కడి నుంచి వెళ్లిపోని పక్షంలో తామే తొలగిస్తామని జిల్లా మేజిస్ట్రేట్‌ మౌఖికంగా తెలిపారు. దీంతో అక్కడ భద్రతా బలగాల్ని భారీగా మోహరించారు.

రైతు ఉద్యమకారులపై కేంద్రం అన్నివైపుల నుంచి ఒత్తిడి పెంచుతోంది. వారిపై రకరకాల కేసులు పెట్టడంతోపాటు ఎక్కడికక్కడ దీక్షా శిబిరాలను భగ్నం చేయడానికి చర్యలు చేపట్టింది. శిబిరాల్లో ఉన్న వారికి కనీస సౌకర్యాలు అందకుండా చేస్తోంది. ఈ పరిణామాలతో దిల్లీ సరిహద్దుల్లో ఎప్పుడేం జరుగుతుందోనన్న ఉత్కంఠ, ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 

ఇవీ చదవండి...

రైతు ఉద్యమకారులపై ఉచ్చు

రైతుల సంక్షేమం కోసమే కొత్త చట్టాలుAdvertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని