నా దగ్గర కాల్‌డేటా ఉంది..: ఫడణవీస్‌

తాజా వార్తలు

Published : 23/03/2021 15:07 IST

నా దగ్గర కాల్‌డేటా ఉంది..: ఫడణవీస్‌

 పోలీసు అధికారుల బదిలీల కుంభకోణంలో కొత్తకోణం

ఇంటర్నెట్‌డెస్క్‌: ముఖేశ్‌ అంబానీకి బెదిరింపుల కేసు మహారాష్ట్రలో రాజకీయ సునామీని సృష్టిస్తోంది. పోలీసు అధికారుల బదిలీల్లో భారీ కుంభకోణం జరిగిందని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ ఆరోపించారు. మహారాష్ట్ర భాజపా ప్రధాన కార్యాలయంలో ఆయన ప్రెస్‌మీట్‌ నిర్వహించారు. ఈ కుంభకోణానికి సంబంధించి తన వద్ద 6.3 గిగాబైట్ల కాల్‌డేటా, ఇతర సాక్ష్యాధారాలు ఉన్నాయని  తెలిపారు. ఈ కుంభకోణం గురించి ఆధారాలతో సమాచారం అందించిన అధికారిని ఒక అనామక పోస్టుకు బదిలీ చేశారని ఆరోపించారు. ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికే ఉద్ధవ్‌ ఠాక్రే ఎటువంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు.

‘‘ముంబయిలో ప్రముఖల పేర్లను ఉపయోగించి పోలీసుల బదిలీలకు సంబంధించిన వ్యవహారాలు జరుగుతున్నాయని ఇంటెలిజెన్స్‌ అధికారిణి రష్మీ శుక్లా ఓ నివేదికను ముఖ్యమంత్రికి పంపించారు. ఆ తర్వాత ఆ నివేదిక హోం మంత్రి చేతికి వెళ్లింది. దీంతో ఆమెను ఓ అనామక పోస్టుకు బదిలీచేశారు. సాధారణ పరిపాలన విభాగం ముఖ్యమంత్రి కిందకే వస్తుంది. ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికే మహారాష్ట్ర ముఖ్యంత్రి ఉద్ధవ్‌ ‌ఠాక్రే బదిలీల కుంభకోణంపై చర్యలు తీసుకోలేదు. దీనికి సంబంధించిన కాల్‌డేటాతో కూడిన నివేదిక 2020 ఆగస్టు నుంచి ఆయన వద్దే ఉంది. ఆ డేటాను ఈ రోజు సాయంత్రం దిల్లీలోని కేంద్ర హోంశాఖ కార్యదర్శికి అందజేస్తాను. ఐపీఎస్‌ అధికారులకు ఆయనే కస్టోడియన్‌. ముఖ్యమంత్రి ఇన్‌ఛార్జి’’ అని ఫడణవీస్‌ పేర్కొన్నారు.

పవార్‌ను తప్పుదోవపట్టించారు.. 
అనిల్‌ దేశ్‌ముఖ్‌పై వచ్చిన ఆరోపణలపై సొంత పార్టీ సభ్యులే ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌ను తప్పుదోవ పట్టించారని దేవేంద్ర ఫడణవీస్‌ అన్నారు. తనకు లభించిన ఓ షెడ్యూల్‌ ప్రకారం.. అనిల్‌ దేశ్‌ముఖ్‌ ఫిబ్రవరి 15వ తేదీన ఓ ప్రైవేట్‌ జెట్‌లో ముంబయికి వచ్చారనీ.. ఆ తర్వాత 17వ తేదీన సహ్యాద్రి అతిథి గృహానికి వెళ్లారని, 24వ తేదీన కార్యాలయానికి కూడా వెళ్లారని ఆయన పేర్కొన్నారు.  ఈ షెడ్యూల్‌ ప్రకారమే కార్యక్రమాలు జరిగాయో లేదో కచ్చితంగా చెప్పలేనని వెల్లడించారు. ఇక ఫిబ్రవరి 15 నుంచి 27వ తేదీ వరకు ఆయన పలువురితో భేటీ అయినట్లు ఫడణవీస్‌ వెల్లడించారు. అనిల్‌ దేశ్‌ముఖ్‌ షెడ్యూల్‌ విషయంలో ఎన్సీపీ నేతలు శరద్‌ పవార్‌ చేత అబద్ధాలు చెప్పించారని విమర్శించారు.

మరో లగ్జరీ కారు స్వాధీనం..

అంబానీకి బెదిరింపుల కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సచిన్‌ వాజే వాడిన వొల్వో కారును అధికారులు స్వాధీనం చేసుకొన్నారు.  ఈ కారు మహారాష్ట్ర రిజిస్ట్రేషన్‌తో ఉంది. ఇదో పెద్ద వ్యాపారవేత్తకు చెందినదిగా అనుమానిస్తున్నారు. ఈ కారును డామన్‌లో సీజ్‌ చేశారు. మన్‌సుక్‌ హిరేన్‌ హత్య కేసులో ఈ కారును ఎలా వినయోగించారనే అంశంపై దర్యాప్తు చేస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని