Corona: వరుసగా 10 నెలల్లో.. 43 సార్లు పాజిటివ్‌
close

తాజా వార్తలు

Published : 24/06/2021 17:35 IST

Corona: వరుసగా 10 నెలల్లో.. 43 సార్లు పాజిటివ్‌

లండన్‌: సాధారణంగా కరోనా వైరస్‌ సోకిన వ్యక్తికి దాదాపు రెండు వారాల పాటు లక్షణాలు కన్పిస్తాయి. కొందరిలో ఈ సమయం కాస్త అటూ ఇటూగా ఉంటుంది. అయితే చాలా తక్కువ మందిలో దీర్ఘకాలం పాటు కొవిడ్ ఉండే అవకాశాలు కూడా ఉన్నాయని ఇటీవల నిపుణులు చెబుతున్నారు. కానీ, బ్రిటన్‌కు చెందిన ఓ 72ఏళ్ల వ్యక్తికి ఏకంగా 10 నెలల పాటు కరోనా పాజిటివ్‌ వచ్చింది. సుదీర్ఘంగా కరోనాతో పోరాడి ఆయన వైరస్‌ను జయించడం విశేషం. 

పశ్చిమ ఇంగ్లాండ్‌లోని బ్రిస్టల్‌ ప్రాంతానికి చెందిన 72ఏళ్ల డేవ్‌ స్మిత్‌ డ్రైవింగ్‌ ఇన్‌స్ట్రక్టర్‌గా పనిచేసి రిటైర్‌ అయ్యారు. 2020 మార్చిలో డేవ్‌ అస్వస్థతకు గురయ్యారు. అయితే ఇంట్లోనే ఉండి చికిత్స తీసుకున్నారు. కానీ కరోనా పరీక్షలు చేయించుకోలేదు. చివరకు వాసన, రుచి కోల్పోవడంతో ఏప్రిల్‌లో పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌ వచ్చింది. దీంతో ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు. కోలుకున్న తర్వాత ఇంటికి వచ్చారు. అయినప్పటికీ అతడిని అనారోగ్యం వెంటాడింది.

ఇంట్లో నుంచి బయటకు వెళ్లే సత్తువ కూడా లేకపోవడంతో ఆ ఏడాది జులైలో మరోసారి ఆసుపత్రిలో చేరారు. అప్పుడు కరోనా పరీక్షలు నిర్వహించగా.. మళ్లీ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. తొలుత ఆయన రెండోసారి కరోనా బారినపడ్డారని వైద్యులు భావించారు. అయితే జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ చేయగా.. తొలిసారి సోకిన వైరస్‌ నుంచే ఇంకా కోలుకోలేదని తేలింది. దీంతో ఆశ్చర్యపోయిన వైద్యులు ఆయన రక్తనమూనాలను బ్రిస్టోల్‌ యూనివర్శిటీలోని పరిశోధకులకు పంపారు. ఆ తర్వాత వరుసగా 10 నెలలు 43 సార్లు ఆయనకు కొవిడ్‌ టెస్టులు చేయగా ప్రతిసారీ పాజిటివ్‌ అనే వచ్చింది. దీంతో చికిత్స అందించిన వైద్యులు చివరగా రెజినెరాన్‌ యాంటీబాడీ థెరపీని ప్రారంభించారు. ఈ చికిత్స తీసుకున్న 45 రోజుల తర్వాత డేవ్‌కు కరోనా పరీక్షలు నిర్వహించగా నెగెటివ్‌ రావడంతో డేవ్‌తో పాటు వైద్యులు కూడా ఊపిరిపీల్చుకున్నారు. 

దీర్ఘకాలంగా కొవిడ్ వైరస్‌ శరీరంలో ఉండటంతో అనేక ఆరోగ్యం బాగా దెబ్బతింది. ఒకదశలో వరుసగా రెండుమూడు నెలలు బెడ్‌మీదే ఉండాల్సి వచ్చింది. నిలబడే ఓపిక కూడా లేకపోయేదట. ఇక బతకనేమో అని భావించి తన అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయమని కుటుంబసభ్యులకు చెప్పానని డేవ్‌ స్మిత్‌ చెప్పారు. తనతో పాటు తన భార్య కూడా ఏడాది పాటు నరకం అనుభవించిదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తానికి 305 రోజుల తర్వాత కరోనా నెగెటివ్‌ రావడంతో పునర్జన్మ ఎత్తినంత సంబరపడ్డానని ఆనందం వ్యక్తం చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని