బ్రిటన్‌ రకం వైరస్‌ ప్రమాదకరమైనదే..!
close

తాజా వార్తలు

Published : 15/02/2021 16:21 IST

బ్రిటన్‌ రకం వైరస్‌ ప్రమాదకరమైనదే..!

తాజా నివేదిక వెల్లడి

లండన్‌: బ్రిటన్‌లో వెలుగుచూసిన కొత్తరకం కరోనా వైరస్‌ ప్రమాదకరమైందేనని అక్కడి ప్రభుత్వ నివేదిక వెల్లడించింది. ఇతర వైరస్‌లతో పోలిస్తే దాదాపు 70శాతం ఎక్కువ ముప్పు ఉందని, ఇందుకు వైరస్‌లో చోటుచేసుకుంటున్న మార్పులే(మ్యుటేషన్‌లు) కారణమవుతున్నాయని మరోసారి స్పష్టంచేసింది. కొత్తరకం వైరస్‌ తీవ్రతను అంచనా వేసేందుకు ఏర్పాటు చేసిన సలహా బృందం ఇచ్చిన తాజా నివేదికను అక్కడి ప్రభుత్వ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. 

బ్రిటన్‌లో కెంట్ నగరంలో వెలుగుచూసిన కొత్తరకం వైరస్‌ అత్యంత వేగంగా వ్యాప్తిచెందడంతో పాటు ప్రమాద తీవ్రత పెరిగినట్లు నిపుణులు ఇప్పటికే అంచనా వేశారు. వీటికి సంబంధించిన ప్రాథమిక పరిశోధనా నివేదికను గతనెల 21తేదీన నిపుణుల బృందం విడుదల చేసింది. వీటిని నిర్ధారించేందుకు డజన్ల సంఖ్యలో వైరస్‌ సోకిన వారి సమాచారాన్ని నిపుణులు విశ్లేషించారు. వైరస్‌ సోకి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారి వివరాలు, మరణాల రేటును సరిపోల్చి చూశారు. దీంతో ఇతర వైరస్‌ల కంటే ఈ ‘కెంట్‌ రకం’ వైరస్‌ వల్ల 30నుంచి 70శాతం అధిక ముప్పు ఉన్నట్లు వెల్లడైంది. విశ్లేషణలో వెల్లడైన విషయాలు ఆందోళన కలిగించేవేనని ఇంగ్లాండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ ఎక్సేటెర్‌ మెడికల్‌ స్కూల్‌కు చెందిన ప్రొఫెసర్‌ డాక్టర్‌ డేవిడ్‌ స్ట్రెయిన్‌ పేర్కొన్నారు. గతంలో వైరస్‌ ముప్పు లేనివారు కూడా ప్రస్తుతం ఈ వైరస్‌ బారినపడుతూ ఆసుపత్రుల్లో చికిత్స పొందాల్సిన పరిస్థితి ఏర్పడిందని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా గతంలో మహిళలపై సాధారణ కరోనా వైరస్‌ అంతగా ప్రభావం చూపకపోగా, ప్రస్తుతం కొత్తరకం వైరస్‌తో ఆరోగ్యవంతులైన మహిళలు కూడా దీని బారినపడుతున్నారని పేర్కొన్నారు. వైరస్‌బారిన పడి ఆసుపత్రుల్లో చేరుతున్న వారిలో మగవారితో సమానంగా మహిళలు కూడా ఉండడం ఈ విషయాన్ని స్పష్టంచేస్తోందని వెల్లడించారు.

ఇక బ్రిటన్‌ రకం వైరస్‌తో పాటు దక్షిణాఫ్రికా రకం వైరస్‌ ప్రభావంతో ప్రపంచ దేశాలన్నీ అప్రమత్తమైన విషయం తెలిసిందే. దీంతో విదేశీ ప్రయాణికులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాయి. ఇందులో భాగంగా భారత్‌లోనూ ఈ తరహా కేసులు బయటపడినప్పటికీ, ఇప్పటి వరకు ఎటువంటి ప్రమాదకర పరిస్థితి తలెత్తలేదు. ఇదిలాఉంటే కొత్తరకం వైరస్‌ ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 80దేశాలకు వ్యాపించినట్లు ఈ మధ్యే ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.

ఇవీ చదవండి..
కొవాగ్జిన్‌: బ్రిటన్‌ రకంపైనా సమర్థవంతంగా..!
బ్రిటన్‌ చరిత్రలో 11రోజులు మాయం


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని