సంయమనం పాటించండి!

తాజా వార్తలు

Updated : 06/02/2021 09:58 IST

సంయమనం పాటించండి!

రైతు ఉద్యమంపై స్పందించిన ఐరాస మానవ హక్కుల కమిషన్‌

జెనీవా: సాగు చట్టాలకు వ్యతిరేకంగా భారత్‌లో తీవ్ర నిరసన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఇటు ఉద్యమకారులతో పాటు అటు అధికార వర్గాలు సైతం పూర్తి సంయమనం పాటించాలని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కమిషన్‌ కార్యాలయం (ఓహెచ్‌సీహెచ్‌ఆర్‌) కోరింది. శాంతియుత మార్గంలో సమావేశమై పౌరులు తమ భావాలను వ్యక్తం చేసే హక్కును పరిరక్షించాలని సూచించింది. అన్ని వర్గాల మానవ హక్కులను కాపాడుతూ.. అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని కనుగొనాలని ఆకాంక్షించింది. ఈ మేరకు శుక్రవారం రాత్రి ఓహెచ్‌సీహెచ్‌ఆర్‌ ట్వీట్‌ చేసింది.

దిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఉద్యమం రోజురోజుకీ ఉద్ధృతమవుతున్న విషయం తెలిసిందే. జనవరి 26న నిర్వహించిన గణతంత్ర కవాతు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీయడంతో వీరి ఉద్యమం యావత్తు ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ప్రపంచవ్యాప్తంగా ప్రముఖులు మద్దతు తెలపడం ప్రారంభించారు. మరోవైపు ఉద్యమంలో సంఘ విద్రోహ శక్తులు ప్రవేశించి.. దేశ సమైక్యతకు భంగం కలిగించే కుట్ర చేస్తున్నాయని కొన్ని వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో రైతుల ఉద్యమం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.  ఉద్యమంలో భాగంగా నేడు దేశవ్యాప్తంగా చక్కా జామ్‌ (రాస్తారోకో)కు రైతు సంఘాలు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు రహదారులను దిగ్బంధనం చేయనున్నారు. ట్రాక్టర్ల కవాతు తర్వాత రైతులు చేపడుతున్న అతిపెద్ద ఆందోళన కార్యక్రమం ఇదే. దీంతో దేశవ్యాప్తంగా భద్రతాబలగాలు అప్రమత్తమయ్యాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాయి.

ఇవీ చదవండి...

ఒక్క లోపముంటే చెప్పండి

నేడే రైతుల రాస్తారోకో


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని