UP: జనాభా పెరుగుదలతో ఎన్నో సమస్యలు

తాజా వార్తలు

Updated : 11/07/2021 16:38 IST

UP: జనాభా పెరుగుదలతో ఎన్నో సమస్యలు

నూతన జనాభా విధాన వివరాలను వెల్లడించిన యూపీ సీఎం

లఖ్‌నవూ: సమాజంలో అసమానతలు ఏర్పడడంతో పాటు ప్రజలు ఎదుర్కొనే ఎన్నో ప్రధాన సమస్యలకు జనాభా పెరుగుదలే కారణమని ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌ పేర్కొన్నారు. రాష్ట్రంలో జనాభా నియంత్రణకు రూపొందించిన నూతన విధాన వివరాలను వెల్లడించిన ఆయన.. 2026 నాటికి రాష్ట్రంలో జనన రేటును ప్రతి వెయ్యి జనాభాకు 2.1శాతానికి తగ్గించాలనే లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం 2.7శాతంగా ఉన్న జనన రేటును 2030 నాటికి 1.9శాతానికి తగ్గించాలని తమ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. యూపీ లా కమిషన్‌ రూపొందించిన జనాభా బిల్లు ముసాయిదా వివరాలను ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌ ఆదివారం విడుదల చేశారు.

జనాభా పెరుగుదల విపరీతమవడం వల్ల రాష్ట్రంతో పాటు దేశాభివృద్ధికి ఆటంకం కలుగుతుందని యోగీ ఆదిత్యనాథ్‌ అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా పేదరికం పెరగడానికి జనాభా పెరుగుదల కారణమవుతుందన్న ఆయన, నూతన జనాభా విధానం కోసం 2018 నుంచి తమ ప్రభుత్వం ప్రయత్నాలు చేసిందని గుర్తుచేశారు. రాష్ట్రంలో జనాభా నియంత్రణ చేపట్టాలంటే ఇద్దరు సంతానం మధ్య వ్యవధి ఎక్కువగా ఉండాలని యోగీ ఆదిత్యనాథ్‌ సూచించారు.

ఇదిలాఉంటే, దేశంలోనే అత్యధిక జనాభా గల రాష్ట్రమైన ఉత్తర్‌ప్రదేశ్‌.. జనాభా నియంత్రణ చర్యల్లో భాగంగా ఇద్దరు పిల్లల నిబంధనను తీసుకురానుంది. ఈ మేరకు ఆ రాష్ట్ర లా కమిషన్‌.. ముసాయిదా యూపీ జనాభా బిల్లు-2021ను తయారుచేసింది. ఇది చట్ట రూపంలోకి వస్తే ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉన్నవారు స్థానిక ఎన్నికల్లో పోటీకి అనర్హులు. అంతేకాదు.. ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికీ అర్హత ఉండదు. ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవారికి భవిష్యత్తులో ఎలాంటి పదోన్నతులు లభించవు. ప్రభుత్వం నుంచి పథకాలు పొందడానికి వీల్లేదు. ఇక ఇద్దరు పిల్లల నిబంధన పాటించే ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం ప్రోత్సాహకాలు అందజేయనున్నారు. కుటుంబంలో ఎంతమంది ఉన్నా.. రేషన్‌ కార్డులో నలుగురే ఉండేలా ప్రతిపాదన చేశారు. ఈ ముసాయిదా బిల్లును రాష్ట్ర లా కమిషన్‌ తన వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. దీనిపై ప్రజల నుంచి సూచనలను జులై 19వరకు స్వీకరిస్తారు. ఆగస్టు రెండోవారంలో ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశముంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని