మ్యాప్‌ వివాదం.. ట్విటర్‌ ఎండీపై మరో కేసు

తాజా వార్తలు

Updated : 29/06/2021 13:57 IST

మ్యాప్‌ వివాదం.. ట్విటర్‌ ఎండీపై మరో కేసు

నోయిడా: సామాజిక మాధ్యమ సంస్థ ట్విటర్‌ భారత విభాగం ఎండీ మనీశ్‌ మహేశ్వరిపై మరో కేసు నమోదైంది. జమ్మూకశ్మీర్‌, లద్దాఖ్‌లను వేరే దేశంగా పేర్కొంటూ తమ వెబ్‌సైట్లో ఓ తప్పుడు మ్యాప్‌ను ప్రదర్శించినందుకు గానూ ట్విటర్‌ సీనియర్‌ అధికారులపై ఉత్తరప్రదేశ్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. యూపీలోని ఖుజ్రానగర్‌ పోలీసు స్టేషన్‌లో భజరంగ్‌దళ్‌ కార్యకర్తల ఫిర్యాదు మేరకు మనీశ్‌ మహేశ్వరితో పాటు న్యూస్‌ పార్టనర్‌షిప్స్‌ హెడ్‌ అమృతా త్రిపాఠిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది.

జమ్మూకశ్మీర్‌, లద్దాఖ్‌లను వేరే దేశంగా చూపిస్తూ ఒక తప్పుడు మ్యాప్‌ను ట్విటర్‌ సోమవారం తన వెబ్‌సైట్లో ప్రదర్శించడం వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. దీంతో సామాజిక మాధ్యమ సంస్థపై విమర్శలతో విరుచుకుపడ్డ నెటిజన్లు ‘ట్విటర్‌ బ్యాన్‌’ అంటూ వేలకొద్దీ పోస్టులు చేశారు. దీంతో స్పందించిన ట్విటర్‌.. కొన్ని గంటల్లోనే ఆ మ్యాప్‌ను తొలగించింది. అయితే దేశ భౌగోళిక సరిహద్దులను ట్విటర్‌ ఇలా తప్పుగా చూపడం ఇదే మొదటిసారి కాదు. గత అక్టోబరులో లేహ్‌ను చైనాలో అంతర్భాగంగా చూపించింది. దేశ సార్వభౌమత్వం, సమగ్రతలను ఏమాత్రం అగౌరవపరిచినా సహించేది లేదని అప్పట్లో కేంద్ర ప్రభుత్వం తీవ్ర హెచ్చరిక జారీ చేసింది.

ఇదిలా ఉండగా.. ట్విటర్‌ ఎండీ మనీశ్ మహేశ్వరిపై ఇది రెండో కేసు కావడం గమనార్హం. ఐటీ నిబంధనలను అమలు చేయనందుకు గానూ భారత్‌లో ట్విటర్‌ తన మధ్యవర్తిత్వ రక్షణ హోదాను కోల్పోయింది. ఈ నేపథ్యంలో యూపీలోని ఘాజియాబాద్‌లో ఓ వృద్ధుడిపై దాడి ఘటనలో గతవారం అక్కడి పోలీసులు ట్విటర్‌ ఎండీపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై వివరణ ఇవ్వాలంటూ సమన్లు కూడా జారీ చేశారు. అయితే దీనిపై ఆయన కర్ణాటక హైకోర్టును ఆశ్రయించడంతో ముందస్తు బెయిల్‌ జారీ అయ్యింది. అయితే ట్విటర్‌ ఎండీకి రక్షణ కల్పిస్తూ హైకోర్టుకు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ యూపీ పోలీసులు తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 

ఐటీ నిబంధనల విషయంలో కేంద్రం, ట్విటర్‌ మధ్య గత కొన్ని రోజులుగా ప్రతిష్టంభన నెలకొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే గతవారం కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ ఖాతాను ట్విటర్‌ కొంతసేపు నిలిపివేయడం వివాదాస్పదమైంది. కాపీరైట్‌ నిబంధనలను ఉల్లంఘించారంటూ కేంద్రమంత్రికి గంటపాటు ట్విటర్‌ యాక్సెస్‌ను నిలిపివేసి ఆ తర్వాత పునరుద్ధరించింది. అంతకుముందు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఇతర ప్రముఖుల ఖాతాలకు వెరిఫైడ్‌ టిక్‌ మార్కులను తొలగించడం కూడా వివాదానికి దారితీసింది.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని