
తాజా వార్తలు
నిజమైన స్నేహానికి అర్థం భారత్: అమెరికా
వాషింగ్టన్: వివిధ దేశాలకు వ్యాక్సిన్లను అందించి భారత్ స్నేహానికి అర్థం చెప్పిందని అమెరికా ప్రశంసలు కురింపించింది. ఈ మేరకు అమెరికా సౌత్ సెంట్రల్ ఏసియా విభాగం ట్విటర్లో పోస్టు చేసింది. ‘‘దక్షిణాసియా ప్రాంతంలోని అనేక దేశాలకు వ్యాక్సిన్లను అందించి భారత్ తన స్నేహాన్ని చాటుకుంంది. ప్రపంచాన్ని ఆరోగ్యం దిశగా నడిపేందుకు భారత్ చర్యలు హర్షించదగ్గవి’’ అని ఆ పోస్టులో పేర్కొంది. ‘ఫార్మసీ ఆఫ్ ది వరల్డ్’గా పేరొందిన భారత్‌లో కరోనా వ్యాక్సిన్ల తయారీని ప్రారంభించారు. గత కొన్ని రోజులుగా భారత్ భూటాన్, మాల్దీవులు, బంగ్లాదేశ్, మయన్మార్, మారిషస్‌లకు కరోనా వ్యాక్సిన్లను ఉచితంగా సరఫరా చేస్తోంది. అంతేకాకుండా సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, బ్రెజిల్, మొరాకో దేశాలకు కరోనా వ్యాక్సిన్ వాణిజ్య ఎగుమతులను ప్రారంభించింది.
భారత్‌లో తయారైన వ్యాక్సిన్లు ప్రపంచవ్యాప్తంగా కరోనాను ఎదుర్కొంటున్న ప్రతిఒక్కరికీ ఉపయోగపడాలని ప్రధాని మోదీ గతంలో తెలిపారు. ప్రపంచంలో 60శాతం వ్యాక్సిన్లను భారత్ ఉత్పత్తి చేస్తోంది. కరోనాను ఎదుర్కోవడంలో పొరుగు దేశాలకు భారత్ అందిస్తున్న సహకారాన్ని అమెరికా విదేశీ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ గ్రెగరీ మీక్స్ అభినందించారు. భారత్ సహకారంపై అనేక విదేశీ మీడియా సంస్థలు ప్రశంసలు కురిపిస్తున్నాయి. కరోనాపై ప్రపంచానికి చేయూతనిస్తున్న భారత్ కృషిని గుర్తించినందుకు యూఎస్ భారత రాయబారి తరన్‌జిత్ సింగ్ అమెరికాకు కృతజ్ఞతలు తెలిపారు.
ఇవీ చదవండి..
చైనా తగ్గించేదాకా.. భారత్ తగ్గదు
ట్రాక్టర్ల ర్యాలీలో మమ్మల్ని చంపేందుకు కుట్ర