
తాజా వార్తలు
‘అక్కడి హింసపై ప్రపంచ దేశాలు గొంతెత్తాలి’
వాషింగ్టన్: మయన్మార్లో పౌర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ నిరసన చేస్తున్న వారిపై సైన్యం కాల్పులు జరపడాన్ని అగ్రరాజ్యం తప్పుబట్టింది. ఆ దేశంలో బుధవారం చోటుచేసుకున్న హింసాత్మక సన్నివేశాలు తమను ఆందోళనకు గురిచేశాయని పేర్కొంది. ఈ మేరకు ఆ దేశ విదేశాంగ ప్రతినిధి నెడ్ ప్రైస్ ఓ ప్రకటనలో వెల్లడించారు.
‘మయన్మార్లో ప్రజలపై పెరుగుతున్న సైన్యం దాడులు, జర్నలిస్టుల అక్రమ అరెస్టులు ఆందోళన కలగజేస్తున్నాయి. సొంత ప్రజలపై బర్మా మిలిటరీ కొనసాగిస్తున్న హింసాత్మక విధానాన్ని ఖండించాల్సిందిగా మేం ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేస్తున్నాం. బుధవారం నాటి హింసాత్మక ఘటనలకు సంబంధించిన ఫొటోలు, నివేదికలు దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయి. పౌర ప్రభుత్వం కోసం శాంతియుతంగా నిరసన చేస్తున్నవారిపై హింసాకాండను చూసి మేం ఆందోళనకు గురయ్యాం. అక్రమంగా అరెస్టు చేసిన జర్నలిస్టులను సైన్యం వెంటనే విడుదల చేయాలి. జర్నలిస్టులను వేధించడం ఆపాలి. మయన్మార్ ప్రజల శాంతియుత నిరసనలకు మా మద్దతు ఉంటుంది. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భారత్, జపాన్ మాకు కీలక భాగస్వామ్య దేశాలు. కాబట్టి బర్మాలో ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని నెలకొల్పేందుకు మేం సంయుక్తంగా కృషి చేస్తాం’ అని ప్రైస్ తెలిపారు.
మయన్మార్లో సైనిక పాలనకు వ్యతిరేకంగా ప్రజలు చేస్తున్న ఆందోళనలు బుధవారం రక్తసిక్తమయ్యాయి. రహదారులపైకి వచ్చి నిరసనలు చేపట్టిన ప్రజలపై పోలీసులు తూటాల వర్షం కురిపించారు. ఈ కాల్పుల్లో 38 మంది మరణించినట్లు స్థానిక వార్తా సంస్థలు వెల్లడించాయి.