
తాజా వార్తలు
రెండో ప్రపంచ యుద్ధం కంటే ఎక్కువ!
కొవిడ్ మరణాల్లో అగ్రస్థానంలో కొనసాగుతోన్న అమెరికా
వాషింగ్టన్: కరోనా వైరస్ దాటికి అమెరికా వణికిపోతోంది. ప్రపంచంలోనే అధిక తీవ్రత ఉన్న అమెరికాలో, కరోనా మరణాల సంఖ్య రెండో ప్రపంచ యుద్ధ కాలంలో మరణించిన అమెరికన్ల సంఖ్యను దాటిపోయింది. అయినప్పటికీ కరోనా ముప్పు ఇంకా తొలగిపోలేదని.. రానున్న రోజుల్లో వైరస్ తీవ్రత అధికంగా ఉండనున్నట్లు అమెరికా నూతన అధ్యక్షడు జో బైడెన్ హెచ్చరించారు. పదవీ బాధ్యతలు తీసుకున్న అనంతరం తొలిరోజు వైట్‌హౌస్‌లో కరోనా వైరస్‌ను ఎదుర్కొనే వ్యూహంపైనే జో బైడెన్ అధికారులతో చర్చించనున్నారు.
జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ నివేదిక ప్రకారం, అమెరికాలో 4,05,400 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇవి రెండో ప్రపంచ యుద్ధ కాలంలో మరణించిన అమెరికన్ల సంఖ్య (4,05,399) కన్నా ఎక్కువ. ‘ప్రస్తుతం అమెరికాలో కరోనా తీవ్రత మరింత ఎక్కువగా ఉంది. రానున్న రోజుల్లో మరింత క్లిష్ట, ప్రాణాంతక సమయంలోకి అడుగు పెడుతున్నాం. ఇలాంటి చీకటి సమయాన్ని మనమందరం కలసికట్టుగా ఎదుర్కోవాలి’ అని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థతోనే కలిసి అమెరికా పనిచేస్తుందని స్పష్టంచేశారు. ఇక గురువారం జరిగే డబ్ల్యూహెచ్ఓ బోర్డు కార్యవర్గ సమావేశంలోనూ ఆంటోని ఫౌచీ నేతృత్వంలోని బృందం పాల్గొంటుందని బైడెన్ పేర్కొన్నారు.
ఇక కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు సాధ్యమైనంత ఎక్కువ మందికి వ్యాక్సిన్ అందించేందుకు బైడెన్ ప్రభుత్వం సిద్ధమైంది. కేవలం వంద రోజుల్లోనే దాదాపు 10కోట్ల మందికి వ్యాక్సిన్ పంపిణీ చేయడం ద్వారా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు వ్యాహాలు రచిస్తోంది. ఇందులో భాగంగా అమెజాన్ వంటి సంస్థలు వ్యాక్సిన్ సరఫరా చేసేందుకు అవసరమైన లాజిస్టిక్స్‌ను అందిస్తామని ముందుకొస్తున్నాయి.
ఇదిలాఉంటే, ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కేసుల సంఖ్య 9కోట్ల 60 లక్షలకు చేరగా..వీరిలో 20లక్షల 75వేల మంది ప్రాణాలు కోల్పోయారు. కేవలం అమెరికాలో అత్యధికంగా 2కోట్ల 44లక్షల మందిలో వైరస్ బయటపడగా నాలుగు లక్షల మంది కొవిడ్ రోగులు మరణించారు. ఇక బ్రిటన్‌లో వెలుగు చూసిన స్ట్రెయిన్ ఇప్పటికే 60దేశాల్లో విస్తరించగా..దీని తీవ్రత ఎక్కువ ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే వెల్లడించింది. దక్షిణాఫ్రికాలో బయటపడ్డ కొత్త రకం కరోనా వైరస్ దాదాపు 23దేశాలకు పాకినట్లు డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలు వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియను వేగవంతం చేసే పనిలో నిమగ్నమయ్యాయి.
ఇవీ చదవండి..
ట్రంప్ లేఖ..గొప్పగా ఉంది: జో బైడెన్
అందరికీ టీకా లభిస్తుంది: WHO