కరోనా మూలాల శోధనపై యూఎస్‌ ఆందోళన

తాజా వార్తలు

Updated : 14/02/2021 16:00 IST

కరోనా మూలాల శోధనపై యూఎస్‌ ఆందోళన

తొలినాళ్ల సమాచారాన్ని చైనా పంచుకోవాలని డిమాండ్‌

వుహాన్‌: ప్రపంచాన్ని కుదిపేసిన కరోనా వైరస్‌.. ఒక జంతువు నుంచే మానవుల్లోకి వ్యాపించి ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో), చైనా శాస్త్రవేత్తల బృందం చేసిన ప్రకటనపై అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. నివేదికను స్వతంత్రంగా, చైనా ప్రభుత్వ మార్పుల నుంచి దూరంగా ఉంచాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. వైరస్ వెలుగులోకి వచ్చిన తొలిరోజుల నాటి సమాచారాన్ని తమతో పంచుకోవాలని కోరింది. ప్రస్తుత వైరస్‌ను నిరోధించేందుకు.. భవిష్యత్తు మహమ్మారులను అరికట్టేందుకు ఆ సమాచారం ఎంతో కీలకమని అభిప్రాయపడింది. పరిశోధన కోసం ఉపయోగించిన ప్రశ్నావళి.. తద్వారా సేకరించిన సమాచారాన్ని వెల్లడించిన తీరుపై తమకు తీవ్ర అభ్యంతరాలున్నట్లు వెల్లడించింది. ఈ క్రమంలో డబ్ల్యూహెచ్‌వోలో తిరిగి చేరిన తమకు సంస్థ విశ్వసనీయతను కాపాడాల్సిన అవసరం ఉందని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్‌ సలీవన్‌ వ్యాఖ్యానించారు. కరోనా మూలాల విషయంలో చైనాను నిందించిన మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ వైఖరినే తాజా ప్రభుత్వం కూడా అనుసరిస్తున్నట్లు సలీవన్‌ వ్యాఖ్యలతో అర్థమవుతోంది.

చైనాలోని వివాదాస్పద వైరాలజీ ల్యాబ్‌ నుంచి కరోనా లీకై ఉంటుందన్న వాదనను కొట్టిపారేస్తూ చైనా శాస్త్రవేత్తల బృందంతో కలిసి డబ్ల్యూహెచ్‌వో నిపుణుల బృందం ప్రకటన చేసిన విషయం తెలిసిందే. చైనాలోని వుహాన్‌ నగరంలోనే 2019లో కరోనా కేసులు తొలిసారిగా వెలుగు చూశాయి. ఇక్కడి వుహాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీలో అనేక రకాల వైరస్‌ నమూనాలను నిల్వ ఉంచారు. దీంతో అక్కడి నుంచి లీకైన కరోనా.. సమీప ప్రాంతాల్లోకి వ్యాపించి ఉంటుందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. వీటిని చైనా ఖండించింది. ఈ వైరస్‌ మరెక్కడో పుట్టి ఉంటుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో కరోనా వైరస్‌ మూలాలను శోధించేందుకు డబ్ల్యూహెచ్‌వోకు చెందిన నిపుణుల బృందం జనవరి 14న వుహాన్‌ చేరుకుంది. మొదట కరోనా కేసులు వెలుగు చూసిన హువానన్‌ సీఫుడ్‌ మార్కెట్‌ సహా అనేక ప్రాంతాలను సందర్శించింది. మహమ్మారి తొలి రోజులకు సంబంధించి ప్రస్తుతమున్న అవగాహన.. తమ పర్యటనతో పెద్దగా మారలేదని డబ్ల్యూహెచ్‌వో బృందం నాయకుడు పీటర్‌ బెన్‌ ఎంబ్రేక్‌ చెప్పారు. కరోనా వైరస్‌.. వైరాలజీ ల్యాబ్‌ నుంచి లీకై, మానవుల్లోకి వ్యాపించి ఉండటానికి ఆస్కారం లేదని తెలిపారు. గబ్బిలం నుంచి ఇది మరో జంతువులోకి ప్రవేశించి ఉంటుందన్నారు. దాని నుంచి మానవుల్లోకి వ్యాపించి ఉంటుందని, ప్రాథమిక విశ్లేషణల్లో ఇదే వెల్లడైందని పేర్కొన్నారు. ఇది గబ్బిలాల నుంచి అలుగు లేదా బేంబూ ర్యాట్‌ అనే మరో జంతువు ద్వారా మానవుల్లోకి ప్రవేశించి ఉంటుందన్న అంచనాలు ఉన్నాయని చెప్పారు. నేరుగా గబ్బిలాల నుంచి లేదా శీతలీకరించిన ఉత్పత్తుల వాణిజ్యం ద్వారా కూడా మానవుల్లోకి ఈ వైరస్‌ వ్యాప్తి చెంది ఉండటానికీ ఆస్కారం ఉందన్నారు.

డబ్ల్యూహెచ్‌వో బృందంలో 10 దేశాల నిపుణులు ఉన్నారు. తీవ్ర అంతర్జాతీయ ఒత్తిడి, నెలల తరబడి చర్చల తర్వాతే ఈ బృందం పర్యటనకు చైనా అంగీకరించింది. తాము ఊహించినదాని కన్నా ఎక్కువగానే చైనా అధికారులు తమకు సహకరించారని డబ్ల్యూహెచ్‌వో సభ్యుడు పీటర్‌ డాస్జాక్‌ పేర్కొన్నారు. అన్ని కేంద్రాలు, సంస్థలను తమకు అందుబాటులో ఉంచారని చెప్పారు. అయితే డబ్ల్యూహెచ్‌వో తొలి నుంచి చైనాకు అనుకూలంగా వ్యవహరిస్తోందని అమెరికా ఆరోపిస్తూ వస్తోంది. అమెరికా తాజా వ్యాఖ్యలపై డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధనోమ్‌ స్పందించారు. వైరస్‌ వెలుగులోకి వచ్చిన రోజు నుంచి దాని మూలాలపై ఉన్న థియరీలు ఇప్పటికీ పరిగణనలోనే ఉన్నట్లు తెలిపారు. వాటిని ఇంకా కొట్టిపారేయలేదని తెలిపారు. ఇటీవల నిపుణుల బృందం నివేదికను ఎవరైనా సమీక్షించవచ్చని తెలిపారు.

ఇవీ చదవండి..

అభిశంసన నుంచి గట్టెక్కిన ట్రంప్‌

మయన్మార్‌లో నిరసనలపై ఉక్కుపాదం


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని