కరోనా మరణాలు: వణికిపోతున్న అగ్రదేశం

తాజా వార్తలు

Published : 31/12/2020 13:22 IST

కరోనా మరణాలు: వణికిపోతున్న అగ్రదేశం

రికార్డు స్థాయిలో మృత్యుఒడికి..

భారత్‌లో 299..యూఎస్‌లో 3,927 మరణాలు

 

వాషింగ్టన్‌: అగ్రదేశం అమెరికాను కరోనా వైరస్‌ వణికిస్తోంది. మహమ్మారి ఆ దేశంలో మరణమృదంగం మోగిస్తోంది. గడిచిన 24 గంటల్లో అక్కడ రికార్డు స్థాయిలో 3,900కి పైగా మరణాలు నమోదు కావడమే అందుకు నిదర్శనం. మనదేశంలో ఒక్కరోజులో 299 మంది మృత్యువాతపడగా.. అమెరికాలో అది 13 రెట్లు అధికం కావడం గమనార్హం. తాజాగా జాన్స్‌ హాప్‌కిన్స్ యూనివర్సిటీ ఈ వైరస్‌ గణాంకాలను వెల్లడించింది. 

అమెరికన్ కాలమానం ప్రకారం..గడిచిన 24 గంటల్లో 3,927 మంది కొవిడ్-19 కారణంగా మృత్యు ఒడికి చేరుకున్నారు. దాంతో మొత్తం మరణాల సంఖ్య 3,41,845కి చేరింది. నిన్న ఒక్కరోజే 1,89,671 మందికి వైరస్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. మొత్తం కేసుల సంఖ్య రెండు కోట్లకు చేరువవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు బ్రిటన్‌లో వెలుగుచూసిన కొత్త స్ట్రెయిన్‌‌ కూడా అక్కడ బయటపడింది. అది వేగంగా వ్యాప్తి చెందుతుందని ఇప్పటికే వైద్య నిపుణులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా..అమెరికాలో రాబోయే రోజుల్లో కరోనా భారీ స్థాయిలో విజృంభించనుందని ఆ దేశ అంటువ్యాధుల నిపుణుడు ఆంటోనీ ఫౌచీ ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. క్రిస్మస్, కొత్త సంవత్సర సెలవులు ముగిసిన తరవాత కేసులు భారీ స్థాయిలో రికార్డు కానున్నాయని హెచ్చరించారు. కాబోయే అధ్యక్షుడు జో బైడెన్ సైతం అమెరికాలో మరిన్ని  చీకటి రోజులు రానున్నాయని ఇటీవల అభిప్రాయపడ్డారు. 

ఇక కరోనా కట్టడికి ఆ దేశం ఇప్పటికే ఫైజర్, మోడెర్నా టీకాలకు అనుమతించింది. ఇప్పటివరకు 2.8 మిలియన్ల మంది టీకాలు తీసుకున్నారు. ఈ ఏడాది చివరిలోగా 20 మిలియన్ల మందికి టీకాలు అందిస్తామని అధ్యక్షుడు ట్రంప్ ప్రజలకు హామీ ఇచ్చారు. అయితే, ఈ లెక్కలు చూస్తుంటే ఆయన వాగ్దానం ఫలించేలా కనిపించట్లేదు.

ఇవీ చదవండి:

అమెరికాలో మున్ముందు మరిన్ని చీకటి రోజులు!

‘యూఎస్‌లో ఒకేసారి నాలుగు సంక్షోభాలు’


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని