Bagram: అమెరికా దళాలు చెప్పకుండా వెళ్లిపోయాయి..!

తాజా వార్తలు

Updated : 06/07/2021 19:19 IST

Bagram: అమెరికా దళాలు చెప్పకుండా వెళ్లిపోయాయి..!

ఇంటర్నెట్‌డెస్క్‌: అమెరికా బలగాలు తమకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండానే బాగ్రం వైమానిక స్థావరాన్ని ఖాళీ చేసి వెళ్లిపోయాయని అఫ్గాన్‌ దళాలు వాపోయాయి. ఆ దళాల జనరల్‌ అష్బుల్లా కొహిస్తాని ఈ విషయాన్ని చెప్పారు. స్థానిక కాలమానం ప్రకారం 3.00 సమయంలో అమెరికా దళాలు వెళ్లిపోయినట్లు తెలిపారు. ఆ విషయాన్ని తాము కొన్ని గంటల తర్వాత గుర్తించామన్నారు. బాగ్రంలో 5,000 మంది అఫ్గాన్‌ తాలిబాన్లను బంధించిన ఒక జైలు ఉంది. అతి త్వరలోనే తాలిబన్‌ బలగాలు ఈ వైమానిక స్థావరంపై దాడి చేస్తాయని అఫ్గాన్‌ బలగాలు కొహిస్తాని అంచనావేశారు. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో వారి కదలికలు మొదలయ్యాయని తెలిపారు. ‘‘అమెరికన్లతో పోలిస్తే మేము ఏమిటో మీకు తెలుసు. కానీ, ఈ ప్రాంతాన్ని కాపాడటానికి మేము చేయగలిగింది చేస్తాము’’ అని తెలిపారు. ఆయన కింద 3,000 మంది సిబ్బంది ఉన్నారు.  ఇక ఇప్పటికే 1,000 మంది అఫ్గాన్‌ సైనికులు తజకిస్థాన్‌ పారిపోయిన విషయం తెలిసిందే.  2001లో అమెరికా అఫ్గానిస్థాన్‌ను ఆక్రమించిన తర్వాత బాగ్రాం ఎయిర్‌పోర్టును ప్రధాన స్థావరంగా మార్చుకొంది. తాలిబన్‌, అల్‌ఖైదాపై పోరుకు ప్రణాళికల దగ్గర నుంచి దాడుల వరకు ఇక్కడి నుంచే కొనసాగాయి. భారీ కార్గో విమానాలతో పాటు యుద్ధ విమానాల కార్యకలాపాలకు కావాల్సిన సకల వసతులు ఇక్కడ ఉండేవి. అల్‌ఖైదాతో పోరులో పట్టుబడ్డ యుద్ధ ఖైదీలను బంధించిన పెద్ద జైలు కూడా ఉంది. 80వ దశకంలో అఫ్గానిస్థాన్‌ను వశం చేసుకున్న రష్యా దీన్ని నిర్మించింది. దేశ రాజధాని కాబూల్‌కు ఇది 40 కి.మీ దూరంలో ఉంటుంది.

గతేడాది ఫిబ్రవరి 29న అమెరికా, తాలిబన్ల మధ్య కుదిరిన దోహా ఒప్పందం ప్రకారం.. 2021 మే 1వ తేదీ నాటికి అమెరికా, దాని మిత్ర దేశాలు అఫ్గాన్‌ నుంచి పూర్తిగా బలగాలను ఉపసంహరించుకోవాలి. బైడెన్‌ ప్రభుత్వం వచ్చాక ఆ గడువును సెప్టెంబర్‌ 11వ తేదీకి పొడిగించింది. ఈ ప్రక్రియలో భాగంగా జూన్‌ 8 నాటికి సగం బలగాలను అమెరికా  వెనక్కి రప్పించింది. చివరగా మిగిలిన 2500-3500 అమెరికన్‌ సైనికులు సైతం ఇటీవల అఫ్గాన్ నుంచి నిష్క్రమించారు. మరోపక్క అఫ్గాన్ సైన్యం బలహీనతలను సొమ్ముచేసుకుంటున్న తాలిబన్లు.. పూర్వం తమ అధీనంలో ఉన్న ప్రాంతాలను తిరిగి తమ నియంత్రణలోకి తెచ్చుకుంటున్నారు. రాజధాని కాబూల్‌కు 500 కిలోమీటర్ల దూరం వరకు వారు వచ్చేశారు. మే 1వ తేదీకి ముందు మొత్తం 387 జిల్లాల్లో 73 జిల్లాలు తాలిబన్ల నియంత్రణలో ఉండేవి. అయితే గత రెండు నెలల కాలంలో 17 ప్రావిన్స్‌లలో ఉన్న 30 జిల్లాలను తాలిబన్లు తమ నియంత్రణలోకి తెచ్చుకున్నారు.   ఇటీవలే ఈశాన్య రాష్ట్రమైన బదాక్షాన్‌ వీరి వశమైంది. చాలా చోట్ల అఫ్గాన్‌ సైన్యం ప్రతిఘటించకపోవడంతో వీరి పని మరింత సులువైంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని