బైడెన్‌ ప్రభుత్వం..ఇక్కడ అన్నీ రిపేర్‌ చేస్తాం!

తాజా వార్తలు

Updated : 05/02/2021 10:08 IST

బైడెన్‌ ప్రభుత్వం..ఇక్కడ అన్నీ రిపేర్‌ చేస్తాం!

తన విదేశాంగ విధానంపై అగ్రరాజ్యాధిపతి

వాషింగ్టన్‌: ప్రపంచ దేశాలతో దెబ్బతిన్న సంబంధాలను తిరిగి పునరుద్ధరిస్తామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ అన్నారు. తమ దేశాన్ని, తమ విదేశాంగ విధానాన్ని తిరిగి గాడిన పెడతామని స్పష్టం చేశారు. అమెరికాను ఢీకొట్టాలన్న చైనా ఆశలను, అగ్రరాజ్య ప్రజాస్వామ్యాన్ని కూలదోయాలనుకుంటున్న రష్యా ఆశయాలను సమర్థంగా ఎదుర్కోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. అదే సమయంలో మిత్రదేశాలతో ఏర్పడ్డ పొరపొచ్చాలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుంటామన్నారు. అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత బైడెన్‌ తొలిసారి తన విదేశాంగ విధానం ఎలా ఉండబోతోందో సమగ్రంగా వివరించారు. గురువారం విదేశాంగ శాఖ అధికారులతో సమావేశమైన ఆయన.. తన లక్ష్యాలను వారి ముందుంచారు.

ఒంటరిగా ఎదుర్కోలేం...

యావత్తు ప్రపంచం ఎదుర్కొంటున్న అణ్వాయుధ ముప్పు, వాతావరణ మార్పులు, కరోనా మహమ్మారి వంటి ఉమ్మడి సవాళ్లను ఎదుర్కోవడానికి అన్ని దేశాలతో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు బైడెన్‌. అమెరికా ఒంటరిగా వీటిని పరిష్కరించుకోవడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. దీనికోసం అమెరికా ప్రజాస్వామ్య విలువల్లో పాతుకుపోయిన దౌత్యవిధానాన్ని అనుసరించాల్సిన అవసరం ఉందన్నారు. స్వేచ్ఛా-స్వాతంత్ర్యాలను పరిరక్షించడం, అవకాశాల్ని అందిపుచ్చుకోవడం, సార్వత్రిక హక్కులను కాపాడడం, చట్టబద్ధమైన పాలనను సమర్థించడం, ప్రతి పౌరుడి ఆత్మగౌరవాన్ని గుర్తించడం వంటి విలువలే అమెరికాను ప్రపంచ శక్తిగా మార్చాయన్నారు. అవే అగ్రరాజ్యానికి బలాన్ని, ప్రయోజనాన్ని చేకూర్చాయని స్పష్టం చేశారు.

చెడిన సంబంధాల పునరుద్ధరణపై దృష్టి....

గత రెండు వారాల్లో అనేక మిత్రదేశాల అధినేతలతో మాట్లాడినట్లు బైడెన్‌ తెలిపారు. గత కొన్నేళ్లలో చెడిన సంబంధాల పునరుద్ధరణపై చర్చించినట్లు వెల్లడించారు. యెమెన్‌లో జరుగుతున్న యుద్ధానికి అమెరికా మద్దతను ఉపసంహరించుకుంటున్నామని బైడెన్‌ ఈ సందర్భంగా ప్రకటించారు. అలాగే సౌదీ అరేబియాపై జరుగుతున్న క్షిపణి, డ్రోన్‌ దాడుల్ని ఖండిస్తున్నామని తెలిపారు. వీటిని సమర్థంగా ఎదుర్కొనేందుకు సౌదీ అరేబియాకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
చైనాను నేరుగా ఎదుర్కొంటాం...

చైనా నుంచి ఎదురవుతున్న సవాళ్లను అమెరికా నేరుగా ఎదుర్కొంటుందని బైడెన్‌ స్పష్టం చేశారు. ఆర్థికపరమైన ఇబ్బందులు, మానవ హక్కుల ఉల్లంఘన, మేధోహక్కుల తస్కరణ, ప్రజాస్వామ్య వ్యవస్థపై దాడి.. ఇలా చైనా నుంచి ఎదురవుతున్న ప్రతి సవాల్‌ను సమర్థంగా తిప్పికొడతామని తెలిపారు. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో అమెరికా మిత్ర దేశాలైన భారత్‌, తైవాన్‌, సింగపూర్‌, ఫిలిప్పీన్స్‌, ఇండోనేసియా, దక్షిణ కొరియా, జపాన్‌ పట్ల చైనా ప్రదర్శిస్తున్న దుందుడుకు వైఖరిని విస్మరించబోమని తేల్చి చెప్పారు. అదే సమయంలో అమెరికాకు ప్రయోజనం చేకూరుతుందనుకుంటే చైనాతో కలిసి పనిచేయడానికి కూడా వెనుకాడబోమని తెలిపారు.

రష్యా.. జాగ్రత్త!

రష్యా విషయంలో మునుపటి అధ్యక్షుడు (ట్రంప్‌) అవలంబించిన మెతక వైఖరికి స్వస్తి పలుకుతున్నట్లు బైడెన్‌ తెలిపారు. రష్యా దూకుడును ఏమాత్రం సహించబోమని స్పష్టం చేశారు. అమెరికా ఎన్నికల్లో జోక్యం, ప్రత్యర్థులపై విష ప్రయోగం, సైబర్‌ దాడులకు ఇక కాలం చెల్లిందని తెలిపారు. రష్యాకు గుణపాఠం చెప్పి అమెరికా ప్రయోజనాల్ని కాపాడుకోవడానికి ఏమాత్రం వెనుకాడబోమని తేల్చి చెప్పారు. రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీని జైలుకు పంపడం, ఆయనకు మద్దతుగా చేస్తున్న నిరసనలను అణగదొక్కడం పట్ల ఈ సందర్భంగా బైడెన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఇవీ చదవండి...

బెదిరింపులకు తలొగ్గను : థన్‌బర్గ్‌

విదేశాలకు బహుమతిగా 56 లక్షల డోసుల వ్యాక్సిన్‌!


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని