దిల్లీ: ఇక 24x7 టీకా పంపిణీ..!

తాజా వార్తలు

Updated : 05/04/2021 19:50 IST

దిల్లీ: ఇక 24x7 టీకా పంపిణీ..!

టీకా కేంద్రాలు పెంచాలని ప్రధానికి కేజ్రీవాల్‌ లేఖ

దిల్లీ: కరోనా వైరస్‌ ఉద్ధృతి పెరుగుతోన్న నేపథ్యంలో దిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలను పెంచిన ప్రభుత్వం, తాజాగా వ్యాక్సినేషన్‌ కేంద్రాలను 24గంటల పాటు ప్రజలకు అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది. సాధ్యమైనంత తొందరగా ఎక్కువ మంది ప్రజలకు టీకా అందించే లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు దిల్లీ ప్రభుత్వం వెల్లడించింది.

దేశంలో కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌ ప్రభావం రోజురోజుకూ పెరుగుతోంది. రోజువారీ కేసుల సంఖ్య లక్ష దాటడం ఆందోళన కలిగిస్తోంది. దిల్లీలోనూ కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కరోనా వైరస్‌ని కట్టడి చేయడంతో పాటు వ్యాక్సిన్‌ పంపిణీని వేగవంతం చేయాలని కేజ్రీవాల్‌ ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఏప్రిల్‌ 6వ తేదీ నుంచి 24గంటల పాటు వ్యాక్సిన్‌ కేంద్రాలు తెరిచే ఉంచాలని దిల్లీ ఆరోగ్యశాఖ ఆదేశాలు జారీచేసింది. ప్రస్తుతం ఉదయం 9గం. నుంచి రాత్రి 9గం.వరకు మాత్రమే అందుబాటులో ఉండగా, మంగళవారం నుంచి దాదాపు 30శాతం టీకా పంపిణీ కేంద్రాలు రాత్రి 9 నుంచి ఉదయం 9వరకు తెరిచే ఉంటాయని పేర్కొంది.

ప్రధానికి కేజ్రీవాల్‌ లేఖ..

కొవిడ్ మహమ్మారి విజృంభిస్తోన్న వేళ.. వ్యాక్సినేషన్‌ ప్రక్రియను వేగవంతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని దిల్లీ ప్రభుత్వం పేర్కొంది. ఈ నేపథ్యంలో కొత్తగా మరిన్ని టీకా పంపిణీ కేంద్రాలకు అనుమతి ఇవ్వడంతోపాటు అన్ని వయసుల వారికి వ్యాక్సిన్‌ అందించే విధంగా నిబంధనలు సడలించాలని కోరుతూ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ లేఖ రాశారు. కరోనా వ్యాక్సిన్‌ కేంద్రాలను కొత్తగా ఏర్పాటు చేసుకునే వెసులుబాటు కల్పించాలని కోరారు. వీటితోపాటు టీకా వయసుపై ఉన్న నిబంధన తొలగిస్తే రానున్న మూడు నెలల్లోనే దిల్లీ వాసులందరికీ టీకా పంపిణీ చేస్తామనే ఆశాభావం వ్యక్తం చేశారు. తద్వారా వైరస్‌ వ్యాప్తిని సాధ్యమైనంత వరకు కట్టడి చేయవచ్చని దిల్లీ ముఖ్యమంత్రి‌ సూచించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని