కరోనా పోయిందనే భ్రమలో బతక్కండి..

తాజా వార్తలు

Published : 09/07/2021 18:38 IST

కరోనా పోయిందనే భ్రమలో బతక్కండి..

దిల్లీ: దేశంలో కరోనా రెండో దఫా విజృంభణ ఇంకా ముగియలేదని, వైరస్ మన మధ్య నుంచి తొలగిపోయిందనే భ్రమలో బతకొద్దని శుక్రవారం కేంద్ర ఆరోగ్య శాఖ హెచ్చరించింది. అలాగే ఉత్తరాఖండ్‌లోని కెమ్టీ జలపాతం వద్ద వెలుగుచూసిన దృశ్యాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఆ వైఖరితో కరోనాకు మరోసారి ఆహ్వానం పలుకుతున్నారంటూ అసహనం వ్యక్తం చేసింది.  ఇది సమూహ వ్యాప్తితో ముడిపడి ఉందని పేర్కొంది. ప్రజలంతా కచ్చితంగా కొవిడ్ నియమావళిని పాటించాలని తేల్చిచెప్పింది. ప్రపంచ వ్యాప్తంగా డెల్టా వేరియంట్‌ విజృంభిస్తుండగా.. యూకే, రష్యా, బంగ్లాదేశ్‌లో వైరస్ కేసులు పెరుగుతోన్న విషయాన్ని గుర్తుచేసింది. బంగ్లాదేశ్‌ రెండో దశతో పోల్చుకుంటే మూడో దశలో ఎక్కువ కేసుల్ని చవిచూసిందని వెల్లడించింది. దాంతో అక్కడి ప్రభుత్వం లాక్‌డౌన్ విధించినట్లు చెప్పింది. అలాగే యూరో 2020 ఫుట్‌బాల్‌ టోర్నీ కారణంగా యూకేలో కేసులు పెరుగుతున్నాయనే వాస్తవాలను కళ్లకు కట్టింది.

సగానికి పైగా కేసులు కేరళ, మహారాష్ట్రలోనే..

దేశవ్యాప్తంగా నమోదవుతోన్న కొత్త కేసుల్లో సగానికిపైగా కేరళ, మహారాష్ట్రలోనే వెలుగుచూస్తున్నాయి. ఈ రోజు గణాంకాల ప్రకారం.. 43,393 కేసులు వెలుగుచూశాయి. కేరళలో ఆ సంఖ్య 13,772 గా ఉండగా.. మహారాష్ట్రలో 9,083 మందికి వైరస్‌ సోకింది. ఇప్పుడు ఆ రెండు రాష్ట్రాల్లో కొవిడ్ ఉద్ధృతిపై కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. అలాగే జులై 8 నాటికి 66 జిల్లాల్లో 10 శాతానికి పైగా పాజిటివిటీ రేటు నమోదవుతోంది. 

లామ్డా.. వేరియంట్‌ ఆఫ్ ఇంట్రెస్ట్..

ఇప్పటికే డెల్టాప్లస్ ఆందోళన కలిగిస్తుండగా.. కొత్తగా రకం కపా వెలుగులోకి వచ్చింది. ఈ వేరియంట్‌కు సంబంధించి ఉత్తర్‌ప్రదేశ్‌లో రెండు కేసులు వెలుగుచూశాయి. ఇదిలా ఉండగా.. మరో కొత్త రకం లామ్డా రకాన్ని ఇంకా భారత్‌లో గుర్తించలేదని కేంద్రం వెల్లడించింది. దీన్ని వేరియంట్‌ ఆఫ్ ఇంట్రెస్ట్‌గా వర్గీకరించి, దాని లక్షణాలపై దృష్టి సారించినట్లు చెప్పింది. ఇదిలా ఉండగా.. జనవరి 16న ప్రారంభమైన కరోనా టీకా కార్యక్రమం కింద ఇప్పటివరకూ సమారు 37 కోట్ల డోసులు పంపిణీ అయ్యాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని