Mehul Choksi: ‘వలపు వలలో ఛోక్సీ..!’ 

తాజా వార్తలు

Published : 31/05/2021 18:16 IST

Mehul Choksi: ‘వలపు వలలో ఛోక్సీ..!’ 

హనీట్రాప్‌తో కిడ్నాప్‌ అంటోన్న ఆయన సన్నిహిత వర్గాలు

ఇంటర్నెట్‌డెస్క్‌: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ కుంభకోణం నిందితుడు, వజ్రాల వ్యాపారి మెహుల్‌ ఛోక్సీ అదృశ్యం.. అరెస్టు వ్యవహారం పూటకో మలుపు తిరుగుతోంది. రోజుకో వార్త వినిపిస్తోంది. ఆయనను కిడ్నాప్‌ చేసి తీసుకెళ్లారని ఛోక్సీ న్యాయవాదులు ఆరోపిస్తుండగా.. లేదు లేదు గర్ల్‌ ఫ్రెండ్‌తో విందు కోసం వెళ్లి పోలీసులకు చిక్కాడని ఆంటిగ్వా ప్రధాని చెప్పారు. అయితే ఛోక్సీ వెంట అమ్మాయి ఉన్న మాట నిజమేగానీ, ఆమె ఆయన స్నేహితురాలు కాదట.. కిడ్నాప్‌ టీంలో ఆమె కూడా ఓ పాత్రధారి అట.. ఈ మేరకు ఆయన సన్నిహిత వర్గాలు చెప్పినట్లు ఓ ఆంగ్ల మీడియా కథనం పేర్కొంది. 

మార్నింగ్ వాక్‌లో హాలో చెప్పి..

ఛోక్సీ తన గర్ల్‌ఫ్రెండ్‌తో విందు కోసం.. ఆమెతో సరదాగా గడిపేందుకు బోటు ద్వారా డొమినికా చేరుకుని ఉంటాడని ఆంటిగ్వా ప్రధాని గాస్టన్‌ బ్రౌన్‌ ఆదివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఆ అమ్మాయి ఛోక్సీ స్నేహితురాలు కాదని తాజాగా ఆయన సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. ఆంటిగ్వాకు చెందిన ఆ యువతి ఉదయం, సాయంత్రం వాకింగ్‌కు వెళ్లిన సమయంలో ఛోక్సీతో పరిచయం పెంచుకుని స్నేహం చేసిందని సదరు వర్గాలు చెప్పినట్లు సదరు మీడియా కథనం వెల్లడించింది. మే 23న ఆమె ఛోక్సీకి ఫోన్‌ చేసి తన అపార్ట్‌మెంట్‌కు రమ్మని పిలిచిందట. ఆయన అక్కడకు వెళ్లేసరికి కొంతమంది వ్యక్తులు తనను బలవంతంగా లాక్కెళ్లి బోటులో డొమినికా తీసుకెళ్లినట్లు సదరు వర్గాలు చెబుతున్నాయి. ఆ తర్వాత రెండో రోజులకు డొమినికా బీచ్‌లో ఛోక్సీని అరెస్టు చేసినట్లు అక్కడి పోలీసులు వెల్లడించారు. 

ఆసుపత్రికి తరలింపు..

మరోవైపు డొమినికా జైల్లో ఉన్న ఛోక్సీ ఫొటోలను ఆంటిగ్వా న్యూస్‌ రూం నిన్న విడుదల చేసింది. అందులో ఆయన చేతులు, కంటిపై గాయాలైనట్లు ఉన్నాయి. ఆయనను తీవ్రంగా కొట్టి ఉంటారని ఆయన న్యాయవాదులు ఆరోపించారు. దీనిపై వారు కోర్టుకు వెళ్లడంతో ఛోక్సీని ఆసుపత్రికి తరలించాలని అక్కడి న్యాయస్థానం ఆదేశించింది. దీంతో సోమవారం ఆయనను డొమినికా రాజధాని రొసెవులోని ఆసుపత్రిలో చేర్చారు. ఆయనకు కరోనా పరీక్షలు చేయగా.. నెగెటివ్‌గా నిర్ధారణ అయ్యింది. 

భారత్‌కు పంపిస్తారా..

ఛోక్సీని భారత్‌కు రప్పించేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలు చర్యలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల ఖతార్‌ ఎయిర్‌వేస్‌కు చెందిన ఓ విమానం దిల్లీ నుంచి డొమినికాకు వెళ్లింది. ఛోక్సీ అప్పగింతకు అవసరమైన పత్రాలు ఆ విమానంలో వచ్చాయని ఆంటిగ్వా ప్రధాని తెలిపారు. అయితే ఛోక్సీ కేసుపై డొమినికా కోర్టు జూన్‌ 2న విచారణ జరపనుంది. ఆయనను నేరుగా భారత్‌కు పంపాలా లేదా ఆంటిగ్వా పంపాలా అన్నదానిపై కోర్టు ఓ నిర్ణయానికి రానుంది. 

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌కు రూ. 13వేల కోట్లు ఎగవేసిన కేసులు ఛోక్సీ, అతడి మేనల్లుడు నీరవ్‌ మోదీ నిందితులుగా ఉన్నారు. ఈ కుంభకోణం వెలుగులోకి రావడానికి ముందే ఛోక్సీ ఆంటిగ్వా పారిపోయాడు. అంతకు మునుపే అక్కడ పౌరసత్వం కూడా పొందాడు. ఛోక్సీపై ఇంటర్‌పోల్‌ రెడ్‌కార్నర్‌ నోటీసు ఉంది. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని