బెంగాల్‌లో 80%.. అసోంలో 74% పోలింగ్‌  

తాజా వార్తలు

Published : 01/04/2021 19:27 IST

బెంగాల్‌లో 80%.. అసోంలో 74% పోలింగ్‌  

రెండో దశలోనూ భారీ పోలింగ్‌

కోల్‌కతా: బెంగాల్‌, అసోంలో రెండో దశ పోలింగ్‌ ముగిసింది. పలుచోట్ల ఉద్రిక్తతల నడుమ పశ్చిమ బెంగాల్‌లో రెండో దశ ఎన్నికలు పూర్తయ్యాయి. భాజపా, తృణమూల్‌ కార్యకర్తల మధ్య పరస్పర దాడులతో ఉద్రిక్త పరిస్థితుల్లోనూ ఓటర్లు చైతన్యాన్ని చాటారు. భారీ సంఖ్యలో  పోలింగ్‌ కేంద్రాలకు తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాష్ట్రంలో 30 నియోజకవర్గాలకు నేడు పోలింగ్‌ జరగగా సాయంత్రం 7గంటల వరకు 80.43శాతం ఓటింగ్‌ నమోదైనట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. ముఖ్యంగా మమతా, సువేందు అధికారి బరిలోఉన్న నందిగ్రామ్‌లోనూ భారీ స్థాయిలో ఓటింగ్‌ జరగడం విశేషం. నందిగ్రామ్‌ నియోజకవర్గంలో 80శాతం పోలింగ్‌ జరిగినట్లు ఎన్నికల సంఘం పేర్కొంది. అత్యధికంగా కతూల్‌పూర్‌ నియోజకవర్గంలో 87శాతం ఓటింగ్‌ నమోదుకాగా, చంద్రకోనా, ఇండస్‌, పత్తార్‌ప్రతిమ నియోజకవర్గాల్లో 86శాతం ఓటింగ్‌ నమోదైంది.

ఇక నందిగ్రామ్‌ నియోజకవర్గంలో పలు చోట్ల భాజపా, తృణమూల్‌ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఒకానొక సమయంలో నందిగ్రామ్‌లోని బోయల్‌ పోలింగ్‌ బూత్‌లో మమతా బెనర్జీ నిరసన వ్యక్తం చేశారు. కొన్నిచోట్ల ఓటర్లను అనుమతించకపోవడంపై ఎన్నికల సంఘానికి పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఈసీ సరిగా స్పందించలేదని ఆరోపించారు. ఈసీ వ్యవహార శైలిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసిన దీదీ, వీటిపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని పేర్కొన్నారు.

అస్సాంలో 74శాతం..

అటు ఈశాన్య రాష్ట్రం అసోంలోనూ రెండో విడత పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగింది. అక్కడ రెండో దశలో 39 నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి. సాయంత్రం 7 గంటల వరకు 74.79శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. నొవ్‌గాంగ్‌ నియోజక వర్గంలో అత్యధికంగా 83శాతం ఓటింగ్‌ నమోదయ్యింది. బెంగాల్‌లో మొత్తం 294 నియోజకవర్గాలకు ఎనిమిది విడతల్లో, అసోంలో 126 నియోజకవర్గాలకు మూడు దశల్లో ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. మే 2న ఫలితాలు వెలువడనున్నాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని