CBSE: 12వ తరగతి పరీక్షలు జరిగేనా?
close

తాజా వార్తలు

Published : 08/05/2021 16:24 IST

CBSE: 12వ తరగతి పరీక్షలు జరిగేనా?

దిల్లీ: దేశంలో కరోనా తీవ్రత నేపథ్యంలో సీబీఎస్‌ఈ 10వ తరగతి వార్షిక పరీక్షలను ఇప్పటికే రద్దు చేసిన విషయం తెలిసిందే. అలాగే 12వ తరగతి పరీక్షలను వాయిదా వేసింది. అయితే, కరోనా ఉద్ధృతి ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో 12వ తరగతి పరీక్షల నిర్వహణపై అనేక ఊహాగానాలు వెలువడుతున్నాయి. మరోసారి పరీక్షల్ని వాయిదా వేసి జులైలో నిర్వహించే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. లేదా పూర్తిగా రద్దు చేసే అవకాశమూ ఉందన్న వార్తలూ వినిపిస్తున్నాయి. అయితే, బోర్డుకు చెందిన ఓ ఉన్నతాధికారి మాత్రం ఈ ఊహాగానాలన్నింటినీ కొట్టిపారేశారు. 

ఈ ఊహాగానాలతో బోర్డుకు ఎలాంటి సంబంధం లేదని సీబీఎస్‌ఈకి చెందిన ఓ అధికారి తెలిపారు. జూన్‌లో కరోనా వ్యాప్తి పరిస్థితిపై సమీక్ష జరిపి పరీక్షల నిర్వహణపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. వాయిదా వేయాలా లేక రద్దు చేయాలా అన్నది అప్పుడే తేలుతుందన్నారు. అయితే, పరిస్థితి మరింత విషమిస్తే మాత్రం పరీక్షల నిర్వహణకు అవకాశాలు సన్నగిల్లుతాయన్నారు. జులైలో పరీక్షల నిర్వహణ కష్టసాధ్యమన్నారు. ఆగస్టు వరకు ఫలితాలు వెలువడకపోతే విద్యార్థులు ఉన్నత విద్యాసంస్థల్లో చేరేందుకు సమస్యలు ఎదురవుతాయన్నారు. ఈ నేపథ్యంలో పదో తరగతి తరహాలోనే అసెస్‌మెంట్‌ ప్రక్రియలో ఫలితాలు ప్రకటించే అవకాశం లేకపోలేదన్నారు.  

మరోవైపు పరీక్షల్ని రద్దు చేయాలన్న డిమాండ్‌ సామాజిక మాధ్యమాల్లో జోరుగా వినిపిస్తోంది. #cancel12thboardexams2021 ఇప్పుడు ట్విటర్‌లో ట్రెండ్‌ అవుతోంది. కరోనా రెండో దశ ఉద్ధృతి నేపథ్యంలో పరీక్షల్ని రద్దు చేయాలని కోరుతూ వేలాది మంది విద్యార్థులు కేంద్ర విద్యాశాఖకు విజ్ఞప్తి చేస్తున్నారు.

పదో తరగతికి మార్కుల కేటాయింపు ఇలా... 

ఇక పదో తరగతి విద్యార్థులకు మార్కుల కేటాయింపు విధానాన్ని సీబీఎస్‌ఈ ఇటీవలే ప్రకటించింది. ప్రతి సబ్జెక్టులోనూ ఎప్పటిలాగే 20 శాతం మార్కులను ఇంటర్నల్‌ అసెస్‌మెంట్‌ ద్వారా కేటాయిస్తారు. మిగిలిన 80 శాతం మార్కులను ఆయా పాఠశాలలు సంవత్సరం పొడవునా నిర్వహించిన పలు పరీక్షల్లో విద్యార్థులు కనబర్చిన ప్రతిభ ఆధారంగా కేటాయించాలని సీబీఎస్‌ఈ తెలిపింది. ఈ ప్రక్రియ కోసం ప్రతి పాఠశాల ప్రిన్సిపల్‌ నేతృత్వంలో ఎనిమిది మంది సభ్యులతో కమిటీని వేయాలని పేర్కొంది. గతంలో బోర్డు పరీక్షల్లో ఆయా పాఠశాలలు కనబర్చిన ప్రతిభకు అనుగుణంగానే ప్రస్తుత మార్కుల కేటాయింపు ఉండాలని.. ఇష్టారాజ్యంగా మార్కులిస్తే అనుబంధ గుర్తింపు రద్దుతో పాటు జరిమానాలు ఉంటాయని సీబీఎస్‌ఈ హెచ్చరించింది. జూన్‌ 20వ తేదీకల్లా ఫలితాలను ప్రకటిస్తామని పేర్కొంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని