
తాజా వార్తలు
వాట్సాప్: ఐరోపాలో ఒకలా.. భారత్‌లో మరోలా
దిల్లీ: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ప్రైవసీ విధానంలో ఐరోపా ప్రజలను ఒకలా.. భారతీయులను మరోలా చూస్తోందని కేంద్రప్రభుత్వం దిల్లీ హైకోర్టుకు తెలిపింది. అంతేగాక, భారత యూజర్ల పట్ల వాట్సాప్ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం ఆందోళన కలిగిస్తోందని వెల్లడించింది.
వాట్సాప్ నూతన గోప్యతా విధానాన్ని(ప్రైవసీ పాలసీ) సవాల్ చేస్తూ ఓ న్యాయవాది దాఖలు చేసిన వ్యాజ్యంపై దిల్లీ హైకోర్టు సోమవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా కేంద్ర తరఫున వాదనలు వినిపించిన అదనపు సొలిసిటర్ జనరల్ చేతన్‌శర్మ మాట్లాడుతూ.. కొత్త నిబంధనలను తిరస్కరించే (నాట్ టు అగ్రీ) ఆప్షన్‌ను ఐరోపా దేశాల్లో ఇచ్చిన వాట్సాప్.. భారత్‌లో మాత్రం ఆ వెసులుబాటు తీసుకురావడం లేదని తెలిపారు. భారత యూజర్లు ‘ఏకపక్షంగా’ గోప్యతా విధానంలో మార్పునకు గురవుతున్నారని చెప్పారు. ఇది ప్రభుత్వానికి ఆందోళన కలిగిస్తోందన్నారు. దీనిపై సమగ్ర వివరాలు తెలుసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే వాట్సాప్‌కు నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. వాట్సాప్ తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం.. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను మార్చి 1వ తేదీకి వాయిదా వేసింది.
కాగా.. వాట్సాప్ ప్రైవసీ పాలసీ నచ్చకుంటే ఈ యాప్ వాడొద్దని గత విచారణ సందర్భంగా దిల్లీ హైకోర్టు పేర్కొన్న విషయం తెలిసిందే. ఆ నిబంధనలకు సమ్మతి తెలపడం తప్పనిసరి కాదని, అవసరమైతే దాన్నుంచి వైదొలగి ఇతర యాప్‌లు ఉపయోగించుకోవాలని సూచించింది.
ఇవీ చదవండి..
సిక్కిం సరిహద్దుల్లో భారత్, చైనా జవాన్ల ఘర్షణ!
ఉగ్రవాదుల చేతుల్లో కొత్త మెసేజింగ్ యాప్‌లు!