close
Array ( ) 1

తాజా వార్తలు

సంబంధాల బలోపేతానికే

ట్రంప్‌ పర్యటన లక్ష్యమిదే
ఆర్థిక, ఇంధన రంగాలపై ప్రధాన దృష్టి
రక్షణ ఒప్పందాలూ కీలకం
చర్చల్లో అంశంగా మత స్వేచ్ఛ
శ్వేత సౌధం వెల్లడి

 

త్రీడీలో ‘నమస్తే ట్రంప్‌’ చిత్తరువు

సూరత్‌కు చెందిన కళాకారులు 12 రంగులను ఉపయోగించి తీర్చిదిద్దిన త్రీడీ చిత్రమిది.  అహ్మదాబాద్‌లోని మోతెరా స్టేడియంలో ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడికి ‘నమస్తే ట్రంప్‌’ అంటూ అభివాదం చేస్తున్నట్టు దీన్ని రూపొందించారు. 20 అడుగుల పొడవు, వెడల్పు ఉండే ఈ చిత్తరువును 15 గంటల్లో వేయడం విశేషం.

వాషింగ్టన్‌: భారత్‌- అమెరికాల మధ్య ఉన్న సుదృఢ, సుస్థిర సంబంధాల కొనసాగింపునకు సూచికగా డొనాల్డ్‌ ట్రంప్‌ పర్యటన ఉంటుందని అధ్యక్షుడి కార్యాలయమైన ‘శ్వేత సౌధం’ ప్రకటించింది. ట్రంప్‌ భారత్‌లో జరపనున్న తొలి అధికారిక పర్యటనపై శుక్రవారం శ్వేత సౌధం ఉన్నతాధికారి ఒకరు విలేకరులతో ముచ్చటించారు. తన పేరును బహిర్గతం చేయొద్దంటూ ఆయన పలు విషయాలను వెల్లడించారు. ‘‘ఉమ్మడి ప్రజాస్వామ్య విలువలు, వ్యూహాత్మక ప్రయోజనాలు, ప్రజల మధ్య ఉన్న బాంధవ్యాలు... రెండు దేశాల మధ్య సంబంధాలను నిర్ణయిస్తున్నాయి. ఇవికాకుండా అధ్యక్షుడు ట్రంప్‌, ప్రధాని నరేంద్ర మోదీల మధ్య ఉన్న సన్నిహిత స్నేహం రెండు దేశాల బంధాన్ని మరింత బలోపేతం చేస్తోంది’’ అని చెప్పారు. ఉమ్మడి విలువలతో పాటు గత మూడు సంవత్సరాలుగా సాధించిన ప్రయోజనాలు భూమికగా ఈ పర్యటన సాగనుందని వివరించారు. పర్యటనలో ప్రస్తావనకు రానున్న కీలక అంశాలను ఆయన వివరించారు.

* ఆర్థిక, ఇంధన రంగాల్లో సహకారం ప్రథమ అంశంగా ఉంటుంది. ఇంధన అవసరాలు ఉన్న పెద్ద ఆర్థిక వ్యవస్థలో భారత్‌ అయిదో స్థానంలో ఉంది. ఆ అవసరాలు తీరేలా అమెరికా సహకరిస్తుంది. 2016లో భారత్‌కు చేసిన ఇంధన ఎగుమతులు 7 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.50వేల కోట్లు) మేర ఉన్నాయి. అంటే 500 శాతం మేర పెరుగుదల ఉంది

* రక్షణ, భద్రత రంగాలపై దృష్టిని కేంద్రీకరించడం
* ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడడం స్వేచ్ఛాయుత, పారదర్శక ఇండో-పసిపిక్‌ ప్రాంతం ఏర్పాటు దిశగా సహకారం.
* ఇండో-పసిఫిక్‌ వ్యూహంలో భారత్‌ మూల స్తంభంలాంటింది. ఈ ప్రాంతంలో శాంతి, సుస్థిరత, చట్టబద్ధ వ్యవహారాలు నడవాలంటే భారత్‌ సైనికపరంగా బలోపేతం కావాలని అమెరికా ఆశిస్తోంది. ఇతర దేశాల సార్వభౌమాధికారాన్ని గౌరవిస్తునే ఈ ప్రాంతంలోనే సముద్ర, ఆకాశమార్గాలు ప్రపంచానికంతటికీ అందుబాటులో ఉండాలని కోరుతోంది.

‘హౌడీ మోదీ’ బృందం అభినందనలు
అహ్మదాబాద్‌లో ‘నమస్తే ట్రంప్‌’ కార్యక్రమ నిర్వాహకులకు ‘హౌడీ మోదీ’ బృందం అభినందనలు తెలిపింది. గత ఏడాది సెప్టెంబరులో ప్రవాస భారతీయులతో కూడిన ఈ బృందం టెక్సాస్‌లో ‘హౌడీ మోదీ’ కార్యక్రమాన్ని నిర్వహించిన విషయం విదితమే. ఇలాంటి కార్యక్రమ నిర్వహణ వెనక ఉండే కఠోర శ్రమ ఏమిటో తెలుసని పేర్కొంది. దీంతో రెండు దేశాల సంబంధాలు బలోపేతం అవుతాయని పేర్కొంది.

‘ట్రంప్‌ ప్లాటర్‌’లో ఏముంటాయో!
ట్రంప్‌ దిల్లీలోని ఐటీసీ మౌర్య హోటల్‌లో బస చేయనున్నారు. అక్కడి ‘బుఖారా’ రెస్టారెంట్‌లో విందు ఆరగించనున్నారు. అయితే ఆయన ఏమి తీసుకుంటారన్న విషయాలను ఆ హోటల్‌ వెల్లడించలేదు. ఇంతకుముందు ఒబామా బస చేసినప్పుడు ‘ఒబామా ప్లాటర్‌’ (ఒబామా పళ్లెం) పేరుతో వంటకాలను సిద్ధం చేసింది. ఇందులో తందూరి ఝింగా, మచ్లీ టిక్కా, ముర్గ్‌ బోటీ, కబాబ్‌లు ఉన్నాయి. అంతకుముందు కూడా ‘క్లింటన్‌ ప్లాటర్‌’, ‘చెల్సియా ప్లాటర్‌’లను తయారు చేసింది. ఇప్పుడు కూడా ‘ట్రంప్‌ ప్లాటర్‌’ను తయారు చేయనున్నా అందులో ఏ వంటకాలు ఉంటాయన్నది ఇంకా తెలియరాలేదు.

ఆగ్రాలో మయూర నృత్యాలతో స్వాగతం
ఆగ్రా: ట్రంప్‌ పర్యటనకు ఆగ్రా ముస్తాబవుతోంది. ఆయన దిగే ఖెరియా విమానాశ్రయం నుంచి తాజ్‌మహల్‌ వరకు 13 కి.మీ. మార్గాన్ని అందంగా అలంకరిస్తున్నారు. విమానాశ్రయం వద్ద ఆయనను కళాకారులు మయూర నృత్యాలతో స్వాగతం పలకనున్నారు. మార్గంలో 21 చోట్ల వేదికలు ఏర్పాటు చేసి కృష్ణ లీలలు, తదితర సాంస్కృతిక ప్రదర్శనలను ఏర్పాటు చేయనున్నారు. నగర ప్రాచీనతను గుర్తుకు తెచ్చేలా విక్టోరియా కాలం తరహా వీధి దీపాల స్తంభాలను ఏర్పాటు చేశారు.

* భారత్‌కు మరో కార్గో విమానం
అహ్మదాబాద్‌: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ భారత పర్యటన నేపథ్యంలో ఆ దేశ వైమానిక దళానికి చెందిన సి-17 గ్లోబ్‌మాస్టర్‌ సరకు రవాణా విమానం శనివారం అహ్మదాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. ఇప్పటికే ఇలాంటి మూడు కార్గో విమానాలు భారత్‌ చేరుకున్నాయి.

ట్రంప్‌ చమటోడ్చక తప్పదు!
అహ్మదాబాద్‌: వాషింగ్టన్‌లో శీతల వాతావరణంలో తిరిగే అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌, మెలనియా దంపతులు భారత పర్యటనలో మాత్రం ఎండ దెబ్బను ఎదుర్కోక తప్పదు. ఈనెల 24వ తేదీ మధ్యాహ్నం అహ్మదాబాద్‌లో జరిగే ‘నమస్తే ట్రంప్‌ రోడ్‌ షో’లో వారు కాలుష్య భరిత వాతావరణంలో ప్రయాణించాల్సి ఉంటుంది. వాషింగ్టన్‌లో ప్రస్తుతం 3 డిగ్రీల సెల్సియస్‌ మేర ఉష్ణోగ్రతలు ఉన్నాయి. అహ్మదాబాద్‌లో మాత్రం పగటి ఉష్ణోగ్రతలు 35-36 డిగ్రీల సెల్సియస్‌, రాత్రి వేళల్లో 17-18 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.


మతస్వేచ్ఛ సమస్యను తప్పకుండా ప్రస్తావిస్తారు

భారత్‌లోని మతస్వేచ్ఛ సమస్యను ప్రధాని మోదీతో జరిగే భేటీల్లో ట్రంప్‌ తప్పకుండా ప్రస్తావిస్తారని శ్వేతసౌధం అధికారి తెలిపారు. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ పౌర పట్టిక (ఎన్‌ఆర్‌సీ)లపై అధ్యక్షుడు మాట్లాడతారా అని విలేకరులు ప్రశ్నించినప్పుడు ‘‘ప్రజాస్వామ్యం, మత స్వేచ్ఛపై ఉభయ దేశాలకు ఉన్న ఉమ్మడి సంప్రదాయాలపై బహిరంగ సభల్లోనూ, ప్రయివేటు సంభాషణల్లోనూ అధ్యక్షుడు ట్రంప్‌ తప్పకుండా మాట్లాడతారు. ముఖ్యంగా మతస్వేచ్ఛ సమస్యను లేవనెత్తుతారు. మీరు ప్రస్తావించిన కొన్ని సమస్య (సీఏఏ, ఎన్‌ఆర్‌సీ)లపై మేం ఆందోళన చెందుతున్నాం’’ అని వివరించారు.

ప్రత్యామ్నాయం జైపుర్‌
ఒకవేళ వాతావరణం అనుకూలించక ట్రంప్‌ ప్రయాణించే విమానం అహ్మదాబాద్‌ విమానాశ్రయంలో దిగలేకపోతే ప్రత్యామ్నాయంగా జైపుర్‌ విమానాశ్రయాన్ని సిద్ధం చేశారు. ఈ మేరకు అమెరికా అధికారులు శనివారం జైపుర్‌ వెళ్లి పరిస్థితులను సమీక్షించారు.


కొలిక్కి రాని వాణిజ్య ఒప్పందం

వాణిజ్య ఒప్పందం ఇంకా కొలిక్కిరాలేదని శ్వేతసౌధం ఉన్నతాధికారి తెలిపారు. అమెరికా ఉత్పత్తులకు అనుమతివ్వడంలో భారత ప్రభుత్వం విఫలమయిందని విమర్శించారు. భారత్‌ మార్కెట్‌లోకి ప్రవేశించే విషయంలో చాలా సమస్యలు ఉన్నాయని, వాటన్నింటినీ ప్రస్తావించాల్సి ఉందని తెలిపారు. ఇటీవలి బడ్జెట్‌లోనూ అమెరికా ఉత్పత్తులపై పన్నులు పెంచారని చెప్పారు.


ఉగ్రవాదులను పాక్‌ అణచివేయాల్సిందే

భారత్‌- పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు తగ్గాలని అధ్యక్షుడు ట్రంప్‌ భావిస్తున్నారని ఆ ఉన్నతాధికారి చెప్పారు. రెండు దేశాల మధ్య విజయవంతమైన చర్చలు జరగాలంటే తొలుత పాకిస్థాన్‌ ఉగ్రవాదులను అణచివేయాల్సి ఉంటుందని అన్నారు.


మోదీ ఆగ్రా వెళ్లడం లేదు

ట్రంప్‌ దంపతులతో కలిసి మోదీ ఆగ్రా వెళ్లడం లేదని అధికారవర్గాలు తెలిపాయి. తాజ్మహల్‌ సందర్శనే తప్ప ఇతర అధికారిక కార్యక్రమాలేవీ లేకపోవడమే ఇందుకు కారణమని చెప్పాయి.
* అమెరికా ప్రథమ మహిళ మెలనియా ట్రంప్‌ దిల్లీలోని ప్రభుత్వ పాఠశాలను సందర్శించే కార్యక్రమంలో ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌, ఉపముఖ్యమంత్రి మనీష్‌ శిసోడియా పాల్గొనే అవకాశాలు కనిపించడం లేదు.
* ట్రంప్‌ దిల్లీలోని ఐటీసీ మౌర్య హోటల్‌లో బస చేయనున్నారు. అక్కడి ‘బుఖారా’ రెస్టారెంట్‌లో విందు ఆరగించనున్నారు. అయితే ఆయన ఏమి తీసుకుంటారన్న వివరాలను ఆ హోటల్‌ వెల్లడించలేదు.  ఇంతకుముందు ఒబామా బస చేసినప్పుడు ‘ఒబామా ప్లాటర్‌’ (ఒబామా పళ్లెం) పేరుతో వంటకాలను సిద్ధం చేసింది.

 


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.