Ashraf Ghani: అష్రఫ్‌ ఘనీ యూఏఈకే ఎందుకు వెళ్లారు?

తాజా వార్తలు

Updated : 28/08/2021 14:57 IST

Ashraf Ghani: అష్రఫ్‌ ఘనీ యూఏఈకే ఎందుకు వెళ్లారు?

ఇంటర్నెట్‌ డెస్క్‌: అఫ్గానిస్థాన్ తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిన వెంటనే ఆ దేశ అధ్యక్షుడు అష్రఫ్‌ఘనీ అక్కడి నుంచి పలాయనం చిత్తగించిన విషయం తెలిసిందే. అయితే, తొలుత ఆయన తజకిస్థాన్‌ లేదా ఒమన్‌కి వెళ్లి ఉంటారని వార్తలు వచ్చాయి. కానీ, చివరకు ఆయన యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(యూఏఈ)కి వెళ్లి సెటిలయ్యారు. మానవతా దృక్పథంతో ఆయనకు ఆశ్రయం కల్పిస్తున్నట్లు యూఏఈ ప్రభుత్వం కూడా ప్రకటించింది. ఈయనే కాదు.. గతంలోనూ పలు దేశాధినేతలు పారిపోయి వచ్చి ఇక్కడ తలదాచుకున్నారు.

యూఏఈనే ఎందుకు?

యూఏఈ ఇప్పటి వరకు అనేక మంది బహిష్కృత లేదా ఆశ్రయం కోరి వచ్చిన ఇతర దేశాధినేతలకు ఆశ్రయం కల్పించింది. దేశ రాజధాని అబుదాబి ఆకాశహర్మ్యాలకు పెట్టింది పేరు. ఎత్తైన భవనాలు, విలాసవంతమైన ఫైవ్‌ స్టార్ హోటళ్లకు ఇది నెలవు. అలాగే తీర ప్రాంతాల్లోని కట్టడాలు కట్టుదిట్టమైన భద్రతలోఉంటాయి. ఈ నేపథ్యంలో ఏకాంతాన్ని కోరుకునే వారికి ఈ ప్రాంతాలు చాలా అనువుగా ఉంటాయి. తమని తాము రక్షించుకోవడంతో పాటు తమ సంపదకు కూడా ఇక్కడ రక్షణ ఉంటుందని విశ్వసిస్తుంటారు.

ఇక భారీ ఎత్తున చమురు, సహజవాయు నిల్వలు ఉన్న నేపథ్యంలో యూఏఈలో భద్రత కట్టుదిట్టంగా ఉంటుంది. విమానాశ్రయంలో దిగిన దగ్గర నుంచి హోటళ్లకు చేరుకునే వరకు గట్టి నిఘా వ్యవస్థ మధ్య కదలాల్సి ఉంటుంది. ముఖ్యమైన ప్రదేశాల్లో ఐరిస్‌ స్కానింగ్‌, సెక్యూరిటీ కెమెరాలు మరింత రక్షణ కల్పిస్తాయి. దీంతో అక్కడ తలదాచుకునే నేతల్ని పట్టుకోవడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి. అలాగే యూఏఈకి అమెరికా భద్రత, రక్షణపరమైన సహకారం అందిస్తోంది.

యూఏఈ ఎందుకు చేస్తోంది?

ఆధునిక ప్రపంచంలో ప్రతి దేశం ప్రపంచ రాజకీయాలపై తమదైన ముద్ర వేయాలని తహతహలాడుతున్నాయి. ఈ క్రమంలో తమకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోవాలని యూఈఏ ఆరాటపడుతున్నట్లు విదేశాంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా అమెరికా మెప్పు కోసం యూఏఈ ప్రయత్నిస్తున్నట్లు సంకేతాలు ఉన్నాయి. తాము కూడా అమెరికాకు నమ్మదగిన మిత్రదేశమేనని నిరూపించుకునేందుకు ఆ దేశాధినేతలు ప్రయత్నిస్తున్నారు. అబుదాబి సమీపంలో ఉన్న అల్‌దఫ్రా వైమానిక స్థావరం నుంచి అమెరికా కార్యకలాపాలు కూడా కొనసాగిస్తోంది. ఇలా అమెరికాతో బలమైన సంబంధాల్ని ఏర్పరచుకోవడం ద్వారా భవిష్యత్తులో లబ్ధి పొందాలన్న ఆలోచనలో యూఏఈ ఉన్నట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ఇంకా ఎవరెవరు ఆశ్రయం పొందారు?

యూఏఈ రాజధాని అబుదాబి సహా వాణిజ్య, పర్యాటక కేంద్రంగా ఉన్న దుబాయ్‌లోనూ అనేక మంది నేతలు తలదాచుకుంటున్నారు. అవినీతి సహా పలునేరాల్లో దోషులుగా తేలిన థాయ్‌లాండ్‌ మాజీ ప్రధానులు థక్సిన్‌ శినవట్ర, యింగ్‌లక్‌ శినవట్ర ఇక్కడే ఉన్నారు. పాకిస్థాన్‌కు తిరిగొచ్చి 2007లో హత్యకు గురైన పాకిస్థాన్‌ మాజీ ప్రధాని బెనజీర్‌ భుట్టో కూడా యూఏఈలోనే చాలాకాలం నివసించారు. మరో పాక్‌ మాజీ ప్రధాని పర్వేజ్‌ ముషారఫ్‌ కూడా దుబాయ్‌లోనే ఉన్నారు. ఆర్థిక అభియోగాలున్న స్పెయిన్‌ రాజు జువాన్‌ కార్లోస్‌, జైలు శిక్ష పడిన పాలస్తీనా నేత మహమ్మద్‌ దహ్లాన్‌, యెమెన్‌లో కీలక నేత అహ్మద్‌ అలీ అబ్దుల్లా సాలేహ్‌ కూడా యూఏఈలోనే తలదాచుకుంటున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని