close

తాజా వార్తలు

ఆ భయంతోనే అసోం గరం గరం...

దిల్లీ :  పౌరసత్వ సవరణ బిల్లుపై ఈశాన్యరాష్ట్రాలు అట్టుడికిపోతున్నాయి. అసోం, త్రిపుర రాష్ట్రాల్లో పరిస్థితిని అదుపుచేసేందుకు సైన్యాన్ని , పారామిలటరీ బలగాలను రంగంలోకి దింపవలసివచ్చింది. అరుణాచలప్రదేశ్‌, నాగాలాండ్‌, మిజోరం,మణిపూర్‌ రాష్ట్రాల్లో ఇన్నర్‌ లైన్‌ పర్మిట్‌ ఉండటంతో అక్కడ ఎలాంటి వ్యతిరేకత లేదు. ఇన్నర్‌లైన్‌ పర్మిట్‌ ప్రకారం అక్కడికి వెళ్లాలంటే ఇతర రాష్ట్రాలకు చెందిన వారు అనుమతి తీసుకోవాలి. దీంతో అఫ్గన్‌, పాక్‌, బంగ్లాదేశ్‌లకు చెందిన ముస్లిమేతరులు ఇక్కడ స్థిరపడేందుకు అవకాశం లేదు. 

అసోంలోనే ఎందుకు?
 అసోంలో బిల్లుకు వ్యతిరేకంగా పెద్దఎత్తున నిరసనలు జరుగుతున్నాయి. అసోంలో లక్షలాదిమంది బంగ్లాదేశీయులు అక్రమంగా స్థిరపడ్డారు. దీంతో అనేక జిల్లాల్లో స్థానికుల జనాభా బాగా తగ్గిపోయింది. దీనిపైనే 1980ల్లో అస్సాం విద్యార్థి సంఘాల సారథ్యంలో ఉద్యమం జరిగింది. అనంతరం కేంద్రంతో జరిగిన ఒప్పందంలో 1971 తరువాత వచ్చిన వారిని తిప్పిపంపేయాలన్న అంశాన్ని చేర్చడంతో ఆందోళనలకు తెరపడింది. దీనిపై జాతీయ పౌర రిజిస్టర్‌ను ఇటీవలే విడుదల చేశారు. 19 లక్షలమంది అక్రమంగా ఉన్నట్టు లెక్కతేలింది.  వీరిలో ఎక్కువమంది  బంగ్లాకు చెందిన మైనార్టీలని భావిస్తున్నారు. ఇప్పుడు తాజాగా పౌరసత్వ సవరణ బిల్లు చట్టంగా రూపుదాల్చితే బంగ్లానుంచి అక్రమంగా వచ్చిన హిందువులు, బౌద్ధులకు అన్ని హక్కులు లభిస్తాయి. దీంతో బంగ్లాదేశ్‌ నుంచి లక్షలాదిమంది హిందువులు అసోంకు వచ్చే అవకాశం ఉందని అసోం సంఘాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. రాజ్యాంగంలోని ఆరో షెడ్యూలు ప్రకారం అసోంలోని ఆదివాసీ ప్రాంతాల్లో వలసలను అనుమతించరు. బ్రహ్మపుత్ర లోయలో బిల్లుపై ఆందోళనలు జరుగుతున్నాయి. బరాక్‌ లోయ్‌లో బెంగాలీల జనాభా ఎక్కువ. వీరు మాత్రం బిల్లును స్వాగతిస్తున్నారు. 

బ్రిటిషు పాలన నుంచే ఆందోళన..
1826లో అసోంను బ్రిటీషువారు ఆక్రమించారు. ఉద్యోగాల కోసం బెంగాల్‌ నుంచి వలసలను ప్రోత్సాహించారు. దీంతో బెంగాలీల జనాభా పెరిగింది. 1947 తరువాత కేంద్రం హామీతో ఆందోళనలు తగ్గాయి. త్రిపురలోనూ ఇలాంటి వలసలు పెరిగిపోవడంతో అక్కడ ఉన్న స్థానికులు మైనార్టీలుగా మారిపోయారు. తాజా బిల్లుతో బంగ్లాదేశ్‌ నుంచి హిందువులు తమ రాష్ట్రానికి వచ్చే అవకాశముందని అసోంలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఫలితంగా ఆందోళనలు తారస్థాయికి చేరాయి. ఇంటర్నెట్‌ సేవలను కూడా ప్రభుత్వం నిలిపివేసింది. పారామిలటరీ బలగాలను రంగంలోకి దించారు. 

లెక్కలు చెబుతున్నాయి..
అసోంలో అస్సామీ భాష మాట్లాడేవారి సంఖ్య తగ్గుతోంది. 1991లో 58 శాతం ఉంటే  2001కు ఆ సంఖ్య 48 శాతానికి తగ్గిపోయింది. మరో వైపు బెంగాలీ మాట్లాడేవారి సంఖ్య భారీగా పెరిగింది. అసోంలోని బెంగాలీలు మతాలకు అతీతంగా ఒక్కటయితే బెంగాలీ భాష ఆధిపత్యం చలాయించవచ్చని అస్సామీయులు అనుమానిస్తున్నారు. దీంతో ఈ బిల్లును ఒప్పుకోబోమని నిరసనలకు దిగారు. త్రిపురలో ఇప్పటికే బెంగాలీల ఆధిపత్యం ఉందని ఇది మరింత ఎక్కువ కానుందని త్రిపుర ఆదివాసీలు ఆందోళనలకు దిగారు.

కొట్టిపారేస్తున్న భాజపా..
భాజపా నేత, అసోం మంత్రి హిమంత బిశ్వశర్వ స్థానికుల ఆందోళన సహేతుకం కాదన్నారు. ఈ బిల్లుతో రాష్ట్రానికి మేలు జరుగుతుందన్నారు. ఈ ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో భాజపా గణనీయమైన విజయాలను సాధించిందన్న అంశాన్ని గుర్తు చేశారు. 

సోషల్‌మీడియాలో పుకార్లు..
సోషల్‌మీడియాలో వస్తున్న పుకార్లతో ఆందోళనలు పెరిగేందుకు దోహదం చేస్తున్నాయి. ఇప్పటికే ఒక కోటిమంది బంగ్లా హిందువులు రాష్ట్రానికి చేరుకున్నారని వారికి ఈ బిల్లు రక్షణగా ఉంటుందని ప్రచారం జరుగుతోంది. అయితే బిల్లులో 2014 డిసెంబరు ముందు వచ్చిన వారికి మాత్రమే పౌరసత్వం లభిస్తుందన్న అంశం స్పష్టంగా ఉంది.  సోషల్‌మీడియాలో వస్తున్న ఇలాంటి తప్పుడు ప్రచారంతో ఆందోళనలు మిన్నంటుతున్నాయి.  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సామరస్యంగా సమస్య పరిష్కారానికి కృషి చేయాలని మేధావులు కోరుతున్నారు.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.