
తాజా వార్తలు
పాక్‌పై ఒత్తిడి తప్పదు: బైడెన్ బృందం
వాషింగ్టన్: ఉగ్రవాద నిర్మూలనకు పాకిస్థాన్ చర్యలు అసంపూర్తిగా ఉన్నాయని అమెరికాకు కాబోయే రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ స్పష్టం చేశారు. అలాగే ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా దూకుడుగా వ్యవహరిస్తోందని తెలిపారు. భారత్‌కు ముప్పుగా పరిణమించిన రెండు దేశాలపై బైడెన్ పాలకవర్గం అనుసరించనున్న వైఖరిని ఆస్టిన్ స్పష్టం చేశారు. రక్షణ మంత్రిగా తనని సెనేట్ కమిటీ ఆమోదించడానికి ముందు ఆయన తన విధానాలను కమటీకి వివరించారు.
భారత్‌ను అమెరికా ప్రధాన రక్షణ భాగస్వామిగా చేర్చుకునేందుకు కృషి చేస్తామని ఆస్టిన్ తెలిపారు. అంతర్జాతీయ రక్షణపరమైన విషయాల దృష్ట్యా ఆసియా ప్రాంతానికి అమెరికా అత్యంత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. చైనాయే తమ ప్రభుత్వానికి సవాల్‌గా మారనుందంటూ డ్రాగన్ దుశ్చర్యలను గుర్తుచేశారు. ముఖ్యంగా సమాచార దోపిడి, సైబర్ దాడులు, అంతరిక్షంలో అమెరికా భద్రతకు చైనా ముప్పుగా పరిణమిస్తోందని తెలిపారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా దురాక్రమణపూరిత వైఖరి అవలంబిస్తోందని స్పష్టం చేశారు.
ఇక పాకిస్థాన్ విషయానికి వస్తే.. భారత వ్యతిరేక ఉగ్రవాద సంస్థలపై ఆ దేశం తీసుకున్న చర్యలు ఇంకా అసంపూర్తిగా ఉన్నాయని స్పష్టం చేశారు. ఉగ్రవాద సంస్థలకు ఆశ్రయం కల్పించడాన్ని మానుకునేలా పాక్‌పై ఒత్తిడి తెస్తామని తెలిపారు. అఫ్గానిస్థాన్ శాంతి ఒప్పందం విషయంలో మాత్రం పాక్ కొంత పురోగతి సాధించినట్లు తెలిపారు.
ఇవీ చదవండి...
ఆ విశ్వాసంతోనే వెళ్లిపోతున్నా: ట్రంప్