‘అమెరికా శక్తితో చైనా వైరస్‌ను తుడిచిపెట్టేస్తాం’

తాజా వార్తలు

Published : 11/10/2020 11:08 IST

‘అమెరికా శక్తితో చైనా వైరస్‌ను తుడిచిపెట్టేస్తాం’

చికిత్స అనంతరం తొలిసారి ప్రజల ముందుకు వచ్చిన ట్రంప్‌

వాషింగ్టన్‌: అమెరికా వైద్య, శాస్త్ర పరిజ్ఞాన శక్తితో ‘చైనా వైరస్‌’ను పూర్తిగా తుడిచిపెట్టేస్తామని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వ్యాఖ్యానించారు. కరోనా సోకి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో తనకోసం ప్రార్థనలు చేసిన వారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. చికిత్స అనంతరం ట్రంప్‌ తొలిసారి శనివారం ప్రజల ముందుకు వచ్చారు. రిపబ్లికన్‌ పార్టీకి చెందిన మద్దతుదారులు ఏర్పాటు చేసిన సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. సౌత్‌ లాన్‌లోని వైట్‌ హౌస్‌ బాల్కనీలో నిలబడే ట్రంప్‌ మాట్లాడారు. ఆయన పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు కనిపించారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా కొవిడ్‌ సోకడానికి ముందు తరహాలోనే ప్రసంగించారు.

బైడెన్‌ ఉద్యోగాల్ని ఎగుమతి చేశారు..

ఈ సందర్భంగా డెమొక్రాటిక్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్‌పై విమర్శలు గుప్పించారు. సెనెటర్‌గా, ఉపాధ్యక్షుడిగా వ్యవహరించిన ఆయన అమెరికా ఉద్యోగాలను చైనాకు ఎగుమతి చేశారని ఆరోపించారు. బైడెన్‌ అధికారంలోకి వస్తే డెమొక్రాటిక్‌ పార్టీ అమెరికాను సోషలిస్టు దేశంగా మారుస్తుందన్నారు. ఎట్టి పరిస్థితుల్లో అలా జరగనివ్వబోనని ట్రంప్‌ ధీమా వ్యక్తం చేశారు. నల్ల జాతి, లాటిన్‌ అమెరికన్లకు డెమొక్రాటిక్ పార్టీ వ్యతిరేకమని ఆరోపించారు. వారిని గతంలో బైడెన్‌ తీవ్ర నిర్లక్ష్యం చేశారన్నారు. ట్రంప్ ఆరోపణల్ని బైడెన్‌ తిప్పికొట్టారు. ట్రంప్‌ హయాంలో నిరుద్యోగం మనుపెన్నడూ లేని స్థాయికి పెరిగిందన్నారు. ఆర్థిక వ్యవస్థ సైతం కుప్పకూలిందన్నారు. ట్రంప్‌ హయాంలో ధనవంతులు మరింత సంపన్నంగా.. పేదలు నిరుపేదలుగా మారారని విమర్శించారు. 

ఇక ట్రంప్‌ నుంచి వైరస్‌ సోకదు..

ఇక ట్రంప్‌ నుంచి ఇతరులకు వైరస్‌ సోకే ప్రమాదం లేదని శ్వేతసౌధంలోని వైద్యుడు డాక్టర్‌ సియాన్‌ కాన్లే వెల్లడించారు. సీడీసీ నిబంధనల ప్రకారం ఆయన ఐసోలేషన్‌ నుంచి బయటకు రావొచ్చని తెలిపారు. ఆయనలో వృద్ధి చెందుతున్న క్రియాశీల వైరస్‌ ఆనవాళ్లు లేవని తెలిపారు. అయితే, వైరస్‌ నెగెటివ్‌గా నిర్ధారణ అయినట్లు మాత్రం వెల్లడించలేదు. సీడీసీ నిబంధలన ప్రకారం.. స్వల్ప నుంచి మోతాదు లక్షణాలున్న వారు 10 రోజుల తర్వాత ఐసోలేషన్‌ నుంచి బయటకు రావొచ్చు. అలాగే అత్యల్ప వైరల్‌ లోడ్‌ కలిగిన వారి నుంచి ఇతరులకు సోకే ప్రమాదం చాలా తక్కువ అని నిబంధనలు చెబుతున్నాయి. దీన్ని బట్టి ట్రంప్‌లో వైరస్‌ పూర్తిగా తొలగిపోకున్నా.. అత్యల్ప స్థాయిలో ఉండొచ్చని భావిస్తున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని