joe Biden On Afghan: ‘అఫ్గాన్‌పై మాది తెలివైన, ఉత్తమమైన నిర్ణయం’: బైడెన్‌

తాజా వార్తలు

Updated : 01/09/2021 12:09 IST

joe Biden On Afghan: ‘అఫ్గాన్‌పై మాది తెలివైన, ఉత్తమమైన నిర్ణయం’: బైడెన్‌

వాషింగ్టన్‌: అఫ్గానిస్థాన్‌ నుంచి బలగాల ఉపసంహరణ నిర్ణయాన్ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ మరోసారి సమర్థించుకున్నారు. 20ఏళ్ల సుదీర్ఘ పోరాటాన్ని ముగించడం..  ‘తెలివైన, ఉత్తమ’ నిర్ణయంగా ఆయన అభివర్ణించారు. అమెరికా ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేనప్పుడు.. అఫ్గాన్‌లో బలగాలను కొనసాగించడంలో అర్థం లేదని వ్యాఖ్యానించారు. 

అఫ్గాన్‌ నుంచి అమెరికా బలగాల ఉపసంహరణ పూర్తయిన తర్వాత జో బైడెన్‌.. తమ దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ‘‘అఫ్గాన్‌ నుంచి బలగాల ఉపసంహరణ పూర్తయింది. 1.20లక్షల మందిని సురక్షితంగా తీసుకొచ్చాం. చరిత్రలో ఏ దేశం ఎప్పుడూ ఈ విధంగా చేయలేదు. అమెరికా మిలిటరీ అద్భుత నైపుణ్యం, ధైర్యం వల్లే ఈ ఆపరేషన్‌ విజయవంతమైంది. అమెరికా ప్రజల కోసం మేం తీసుకున్న నిర్ణయం సరైనది, తెలివైనది, ఉత్తమమైనదని నమ్ముతున్నా. యుద్ధంలో సుదీర్ఘకాలం ఉన్న దేశం మనది. ఇప్పుడు మీకు(అమెరికన్లను ఉద్దేశిస్తూ) 20ఏళ్లు ఉంటే గనుక.. అమెరికా శాంతియుతంగా ఉండటం మీరెప్పుడూ చూసిఉండరు. ఈ యుద్ధాన్ని, బలగాల ఉపసంహరణను ఇంకా పొడగించాలని కోరుకోలేదు. 20ఏళ్ల తర్వాత కూడా మరో తరం అమెరికా బిడ్డలను యుద్ధానికి పంపాలనుకోవట్లేదు. ఈ యుద్ధాన్ని ముగిస్తానని అధ్యక్ష పదవికి పోటీ పడ్డప్పుడే దేశ ప్రజలకు హామీ ఇచ్చాను. ఇప్పుడు ఆ హామీని నిలబెట్టుకున్నందుకు గర్వంగా ఉంది. అమెరికా ప్రజలకు ఏ మాత్రం ప్రయోజనం లేని ఈ యుద్ధం కోసం బలగాలను కొనసాగించాల్సిన అవసరం ఏముంది? అఫ్గాన్‌లో వేలాది మంది సైనికులను కొనసాగించడంతో పాటు బిలియన్‌ డాలర్లను ఖర్చు చేయడం వల్ల అమెరికన్ల భద్రత పెరుగుతుందని నేను ఎంతమాత్రం విశ్వసించడం లేదు’’ అని బైడెన్‌ వివరించారు. 

ప్రస్తుతం మారుతున్న ప్రపంచంలో అమెరికాకు అనేక సవాళ్లు ఎదురవుతున్నాయని బైడెన్‌ చెప్పారు. చైనాతో పోటీ, రష్యాతో విభేదాలు, సైబర్‌ దాడులు, అణ్వస్త్రాలు ఇలా తమ ముందు ఎన్నో సవాళ్లున్నాయని తెలిపారు. అయితే, బలగాలను ఉపసంహరించినప్పటికీ ఉగ్రవాదంపై తమ పోరాటం కొనసాగుతుందని బైడెన్‌ తెలిపారు. అఫ్గాన్‌ గడ్డతో పాటు ఇతర దేశాల్లోని ఉగ్రవాదంపైనా పోరు సాగిస్తామని వెల్లడించారు. ఇందుకోసం ఆయా దేశాల్లో ఉండి యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదని, తమ వ్యూహాలు తమకున్నాయని చెప్పుకొచ్చారు. 

మీతో యుద్ధం ఇంకా ముగియలేదు..

ఈ సందర్భంగా ఇటీవల కాబుల్‌ ఎయిర్‌పోర్టులో ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడిపైనా బైడెన్‌ స్పందించారు. ఉగ్రవాదులు జరిపిన దాడిలో అమెరికా జవాన్లు, అఫ్గాన్‌ పౌరులు మరణించడంపై ఆయన విచారం వ్యక్తం చేశారు. అయితే, ఆ తర్వాత తాము డ్రోన్‌తో దాడి చేసిన ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదిని మట్టుబెట్టామని, దీంతో అమెరికా సామర్థ్యం ఏంటో ఉగ్రవాదులకు స్పష్టంగా అర్థమైందని చెప్పారు. చివరగా.. ‘‘ మీపై మా పోరు ఇంకా ముగియలేదు’’ అంటూ ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదులను బైడెన్‌ గట్టిగా హెచ్చరించారు. 



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని