
తాజా వార్తలు
మహిళా నేతలు.. ఇచ్చిన మాట తప్పరు!
ఇంటర్నెట్ డెస్క్: ఎన్నికలు వచ్చాయంటే చాలు.. ప్రచార కార్యక్రమాల్లో రాజకీయ నేతలు పాల్గొంటూ ప్రజలపై హామీల వర్షం కురిపిస్తారు. మీకు ఇది చేస్తాం.. అది తెస్తాం అని ఎన్నో మాటలు చెబుతారు. వాటిని నమ్మి ప్రజలు ఓట్లు వేస్తారు. ఇక్కడి వరకు బాగానే ఉంటుంది. అయితే, అధికారంలోకి వచ్చిన తర్వాత నేతలు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తారా లేదా అనేది పదవులు చేపట్టిన నేతలను బట్టి ఉంటుంది. కొన్ని ప్రభుత్వాలు ఆలస్యంగానైనా ఇచ్చిన హామీలను నెరవేర్చే ప్రయత్నం చేస్తే.. మరికొన్ని ప్రభుత్వాలు హామీలను గాలికొదిలేస్తాయి. కానీ, ప్రభుత్వంలో కీలక పదవుల్లో మహిళలు ఉంటే మాత్రం కచ్చితంగా ఇచ్చిన హామీలను నెరవేరుస్తారని ఓ సర్వేలో తేలింది.
ఇటీవల కాలంలో అనేక దేశాల ప్రభుత్వాల్లో మహిళలు కీలక పదవులను చేపడుతున్నారు. అమెరికా ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్ ఎన్నికే ఇందుకు ఉదాహరణ. కాగా.. ఇలా మహిళలు బాధ్యతాయుత పదవులు చేపడుతూ రాజకీయ స్వరూపాన్ని మార్చగలరా? ప్రజల్లో రాజకీయ నాయకులపై నమ్మకాన్ని పెంచగలరా?వంటి అంశాలపై టెక్సాస్లోని రైస్ యూనివర్సిటీ పరిశోధకులు అధ్యయనం చేశారు. ఇందుకోసం రాజకీయ నేతలు ఇచ్చే హామీలు.. వాటిని నేరవేర్చడంలో నేతలు చేస్తున్న కృషిని తెలిపేందుకు రూపొందించిన ‘కంపేరేటివ్ పార్టీ ప్లెడ్జ్ గ్రూప్(సీపీపీజీ) డేటాను విశ్లేషించారు. ఆస్ట్రియా, బల్గేరియా, కెనడా, జర్మనీ, ఐర్లాండ్, ఇటలీ, నెదర్లాండ్స్, పోర్చుగల్, స్పెయిన్, స్వీడెన్, యూకే, యూఎస్ దేశాల్లోని రాజకీయ నాయకుల డేటా సీపీపీజీలో ఉంది. ఈ డేటా విశ్లేషణలో పరిశోధకులు కొత్త విషయం కనుగొన్నారు. పురుష నేతలకన్నా మహిళా నేతలే ఇచ్చిన హామీలను కచ్చితంగా నేరవేరుస్తారని వెల్లడించారు. ఎలాంటి అడ్డంకులు వచ్చినా హామీలను అమలు చేసే తీరుతారని పేర్కొన్నారు. అయితే, రాజకీయాల్లో మహిళల ప్రాతినిథ్యం, పార్టీలో పోటీతత్వం, నిర్ణయాధికారం వంటి అంశాలపై మరింత లోతుగా అధ్యయనం చేయాల్సి ఉందని పరిశోధకులు చెప్పారు.