దాత అవయవం నుంచి కరోనా: మహిళ మృతి!

తాజా వార్తలు

Updated : 25/02/2021 16:05 IST

దాత అవయవం నుంచి కరోనా: మహిళ మృతి!

మిషిగాన్‌: ఒకరి నుంచి మరొకరికి కరోనా వైరస్‌ నోరు.. ముక్కు.. కళ్ల ద్వారా సోకుతుందని అందరికి తెలిసిందే. కాగా.. దాత అవయవం నుంచి ఓ మహిళకు కరోనా సోకిన అరుదైన ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. అవయవ మార్పిడి జరిగిన తర్వాత రెండు నెలల పాటు ఆమె కరోనాతో పోరాడి మృతి చెందడంతో అవయవాల మార్పిడిలో భద్రతపై సందేహాలు మొదలయ్యాయి. 

అమెరికన్‌ జర్నల్‌ ఆఫ్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌లో ప్రచురించిన కథనం ప్రకారం.. మిషిగాన్‌కు చెందిన ఓ మహిళకు ఊపిరితిత్తుల్లో సమస్య ఉంది. అవయవ మార్పిడి ఒక్కటే మార్గమని వైద్యులు స్పష్టం చేశారు. దీంతో అవయవదాత కోసం ఎదురుచూశారు. ఎట్టకేలకు రోడ్డుప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయిన ఓ వ్యక్తి ఊపిరితిత్తుల్ని అన్‌ ఆర్బార్‌ యూనివర్సిటీ ఆస్పత్రి వైద్యులు మహిళకు శస్త్రచికిత్స చేసి అమర్చారు. అంతకుముందు అవయవ గ్రహీతకు, మృతదేహానికి ముక్కు, గొంతు నుంచి నమూనాలు సేకరించి కరోనా పరీక్షలు నిర్వహించగా.. ఇద్దరికి నెగటివ్‌ వచ్చింది. అందుకే వైద్యులు ఊపిరిత్తుల మార్పిడి చేశారు.

మొదట ఇన్ఫెక్షన్‌ అనుకున్నారు..

శస్త్రచికిత్స పూర్తయిన మూడు రోజుల తర్వాత ఆస్పత్రిలో ఉండగానే.. ఆ మహిళలో కరోనా లక్షణాలు బయటపడ్డాయి. జ్వరం.. శ్వాసతీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడ్డాయి. మొదట వైద్య సిబ్బంది ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్‌ అయి ఉండొచ్చని భావించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణిస్తుండటంతో అనుమానం వచ్చి కొత్తగా అమర్చిన ఊపిరిత్తుల నుంచి నమూనా సేకరించి పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌గా తేలింది. నిర్థారణ కోసం అవయవ దాత మృతదేహానికి మరోసారి కరోనా పరీక్షలు చేశారు. నివేదికలో కరోనా పాజిటివ్‌ రావడంతో వైద్యులు కంగుతిన్నారు. మరోవైపు శస్త్రచికిత్సలో పాల్గొన్న ఓ వైద్యుడికి సైతం కరోనా పాజిటివ్‌గా తేలింది. వీరికి జన్యు పరీక్షలు చేసి.. ఆ మృతదేహం ఊపిరితిత్తుల ద్వారానే ఆ మహిళకు, వైద్యుడికి కరోనా సోకినట్లు నిర్థారించారు. వైద్యుడు చికిత్స తీసుకొని కోలుకోగా.. అవయవ మార్పిడి చేసుకున్న మహిళ మృతి చెందింది. ఇలా దాత అవయవం నుంచి గ్రహీతకు కరోనా సోకడం ప్రపంచంలో ఇదే తొలిసారి అయి ఉంటుందని వైద్యాధికారులు భావిస్తున్నారు. ఇకపై ఊపిరితిత్తుల మార్పిడి సమయంలో కేవలం ముక్కు, గొంతు నుంచే కాకుండా అవయవం లోపలి భాగాల నుంచి నమూనాలు సేకరించి సమగ్రంగా కరోనా పరీక్షలు జరపాలని సూచిస్తున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని