close

తాజా వార్తలు

Updated : 16/01/2021 16:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

భారత్‌లో టీకా పంపిణీ..ప్రపంచానికి పాఠాలు!

సవాళ్ల నడుమ ముందుకెళ్తోన్న భారత్‌

దిల్లీ: కరోనా వైరస్‌ విజృంభణతో అల్లాడిపోతున్న ప్రపంచ దేశాలకు  వ్యాక్సిన్‌ అందుబాటులోకి రావడం కాస్త ఊరట కలిగిస్తోంది. అయితే, ఇప్పటికే వ్యాక్సినేషన్‌ ప్రారంభించిన కొన్నిదేశాలు మాత్రం తీవ్ర ఒడుదొడుకులను ఎదుర్కొంటున్నాయి. ఈ సమయంలో ప్రపంచంలోని అతిపెద్ద దేశాల్లో ఒకటైన భారత్‌, కరోనా మహమ్మారిని ఎదుర్కొనే వ్యాక్సిన్‌ పంపిణీ భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కోట్ల మందికి టీకా అందించేందుకు సన్నద్ధమైన భారత్‌, ఇందుకోసం ముందుగానే చేసిన ఏర్పాట్లు, ప్రణాళికలు ప్రపంచ దేశాలకు కొన్ని పాఠాలు నేర్పిస్తుందని అంతర్జాతీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

చతికిలపడుతోన్న ధనిక దేశాలు..
భారత్‌ కన్నా ముందే చాలా దేశాలు వ్యాక్సిన్‌ పంపిణీని చేపట్టాయి. అమెరికా వంటి ధనిక దేశాలు భారీస్థాయిలో టీకాలను నిల్వ చేసుకున్నాయి. కానీ, ఊహించని పరిణామాలు, ప్రజల విముఖత, రవాణా సమస్యల కారణంగా పంపిణీలో మాత్రం వెనకబడ్డాయి. అలాంటి ఇబ్బందులు ముందుగానే పసిగట్టిన భారత్‌, పటిష్ట ప్రణాళికతో వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని చేపట్టింది. ముందుగా వ్యాక్సిన్‌ ఎవరికి, ఎంత మందికి ఇవ్వాలనే అంశాలపై స్పష్టమైన ప్రణాళికను రూపొందించింది. ఇప్పటివరకు టీకా పంపిణీ ప్రారంభించిన ఏ దేశం కూడా భారత్‌ మాదిరిగా ఇలాంటి ప్రణాళికతో ముందుకెళ్లలేదని వాషింగ్టన్‌కు చెందిన సెంటర్‌ ఫర్‌ గ్లోబల్‌ డెవలప్‌మెంట్‌కు చెందిన నిపుణులు వెల్లడించారు.

యూరప్‌ దేశాల్లోనూ వెనకడుగే..!
కరోనా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసిన తొలి దేశంగా నిలిచినట్లు రష్యా గతంలో ప్రకటించుకుంది. అంతేకాకుండా అత్యవసర వినియోగం కింద టీకా పంపిణీని చేపడుతోంది. అయితే, ప్రజల నుంచి ఆశించినంత స్పందనను పొందడంలో మాత్రం విఫలమయ్యింది. ఇప్పటివరకు అక్కడ కేవలం 15లక్షల మందికి మాత్రమే టీకాలు ఇచ్చినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. వైరస్‌ తీవ్రత అధికంగా ఉన్న 27 దేశాల ఈయూలోనూ వ్యాక్సినేషన్‌ ప్రారంభమైంది. అయితే, అక్కడి టీకా పంపిణీ కాస్త మందకొడిగానే కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఫ్రాన్స్‌, స్పెయిన్‌, జర్మనీ వంటి దేశాల్లో టీకా తీసుకునేందుకు ప్రజలు అంతగా ఆసక్తి కనబరచడం లేదని నివేదికలు చెబుతున్నాయి. ముఖ్యంగా వ్యాక్సిన్‌ సరఫరాలో ఆలస్యం, ఏర్పాట్లతో పాటు ప్రజలను ముందస్తుగా మానసికంగా సిద్ధం చేయడంలో పలుదేశాలు విఫలమవుతున్నట్లు అంతర్జాతీయ వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ముందస్తు ఏర్పాట్లు..
ధనిక దేశాల్లో టీకా పంపిణీ ఇలా ఉన్న నేపథ్యంలో.. టీకా పంపిణీ కోసం భారత్ మాత్రం‌ భారీ ఏర్పాట్లే చేసిందని చెప్పవచ్చు. తొలుత దేశవ్యాప్తంగా 3006 కేంద్రాల్లో వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసింది. తర్వాత వీటి సంఖ్యను పెంచుకోవాలని రాష్ట్రాలకు సూచించింది. ఆయా కేంద్రాలకు వ్యాక్సిన్‌ను ఎప్పటికప్పుడు సరఫరా చేసేందుకు దేశవ్యాప్తంగా 12 వ్యాక్సిన్‌ ప్రధాన కేంద్రాలను ఏర్పాటు చేసింది. అక్కడ రిఫ్రిజిరేషన్‌ సౌకర్యాలను కూడా ఏర్పాటు చేసింది. ఉత్పత్తి కేంద్రాల నుంచి నేరుగా విమానాల్లో ఈ ప్రధాన కేంద్రాలకు తరలించి, అక్కడ నుంచి అన్ని రాష్ట్రాలు, జిల్లా కేంద్రాలకు సరఫరా చేయనుంది. ఈ పనితీరును పరీక్షించేందుకు ఇప్పటికే రెండు సార్లు దేశవ్యాప్తంగా వ్యాక్సిన్‌ డ్రైరన్‌ చేపట్టింది. వాటిలో ఎదురైన లోటుపాట్లను సరిదిద్దుకుంది. వీటితోపాటు ప్రత్యేకంగా రూపొందించిన కో-విన్‌ యాప్‌ ద్వారా రిజిస్టర్‌ చేసుకొనే సౌలభ్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చే ఏర్పాట్లు చేసింది. ఇలా ముందస్తు ప్రణాళికతో భారీ వ్యాక్సిన్‌ పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

భారత్‌కు కలిసొచ్చే అంశాలు..!
వ్యాక్సిన్‌లు సురక్షితమైనవే విశ్వాసం ఇక్కడి ప్రజల్లో ఉండడం కూడా భారత్‌కు కలిసివచ్చిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే పోలియో టీకా వంటి కార్యక్రమాలను భారత్‌ సమర్థవంతంగా నిర్వహించడం కూడా వ్యాక్సిన్‌ పంపిణీ సులభతరం కావడానికి అనుకూలమైన అంశాలని చెబుతున్నారు. అంతేకాకుండా స్వదేశంలోనే వ్యాక్సిన్‌ తయారీ కావడంతోపాటు అవి సురక్షితమేనని ప్రభుత్వం ప్రకటించడంతో వ్యాక్సిన్‌ పంపిణీ సజావుగానే సాగుతుందనే నమ్మకం ఉందని నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు నిర్వహించిన సర్వేల్లోనూ పలువురు వ్యాక్సిన్‌ తీసుకునేందుకు మొగ్గుచూపుతున్నట్లు వెల్లడైంది.

ఇవీ చదవండి..
కన్నీటి పర్యంతమైన మోదీ
‘పేషెంట్‌ జీరో’ను ఎప్పటికీ కనుక్కోలేము..!Tags :

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని