‘కట్టె’కు కట్టె కరవు!

తాజా వార్తలు

Updated : 29/04/2021 10:36 IST

‘కట్టె’కు కట్టె కరవు!

దిల్లీలో మృతదేహాల  దహనానికి కలప కొరత

ఈనాడు, దిల్లీ: దేశరాజధాని దిల్లీలో పరిస్థితులు రోజురోజుకీ దయనీయంగా మారిపోతున్నాయి. ఇప్పటివరకు శ్మశానాల్లో చితి పేర్చడానికి స్థలం దొరక్క ఇబ్బందులు పడుతున్న దిల్లీ వాసులు ఇప్పుడు ఆప్తుల భౌతికకాయాలను కాల్చడానికి కట్టెలు సైతం దొరకని దుర్భరమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. లెక్కకు మించిన భౌతికకాయాలు మరుభూములకు వరుస కడుతుండడంతో కాటికాపరులు సైతం చేతులెత్తేస్తున్నారు. దాంతో కుటుంబసభ్యులే అక్కడ ఇక్కడ కట్టెలు సమకూర్చుకుని, ఎక్కడ స్థలం దొరికితే అక్కడ చితులు పేర్చి దహన సంస్కారాలు పూర్తిచేయాల్సి వస్తోంది. దిల్లీలో అతిపెద్ద నిగంబోధ్‌ ఘాట్‌ శ్మశానవాటికలో ఏప్రిల్‌ 1-23 తేదీల మధ్య 2,526 మందిని దహనం చేసినట్లు అధికార లెక్కలు చెబుతున్నాయి. ఇందుకోసం 8,000 క్వింటాళ్లకుపైగా కలపను ఉపయోగించారు. ఇప్పటివరకు ఈ కలప అంతా ఉత్తర్‌ప్రదేశ్‌ నుంచి వచ్చేది. ఇప్పుడు అక్కడ కూడా దహన సంస్కారాలు పెరిగిపోవడంతో అధికారులు ఆర్డర్లు తీసుకోవడం మానేశారు. దాంతో హరియాణా అటవీశాఖను సంప్రదించాల్సిన పరిస్థితి ఏర్పడింది. క్వింటాల్‌కు రూ.450 లెక్కన 7వేల క్వింటాళ్ల కలప అందించడానికి వారు అంగీకరించారు. అంతకుమించి సరఫరా చేయడానికి నిరాకరించారు. ఇప్పుడు నానాటికీ డిమాండ్‌ పెరిగిపోతుండటంతో క్వింటాల్‌కు రూ.750 పెట్టినా బయట కలప దొరకని పరిస్థితి నెలకొన్నట్లు దిల్లీ శ్మశానవాటికల్లో అంత్యక్రియలను పర్యవేక్షించే అధికారులు చెబుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే చితులు పేర్చేందుకు అవసరమైన కర్రలనుకూడా నల్లబజారు (బ్లాక్‌మార్కెట్‌)లో కొనాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తంచేశారు. కలప కొరతను ఎదుర్కోవడానికి ఆవు పిడకలను ఉపయోగించాలని తూర్పు దిల్లీ నగరపాలక సంస్థ ఉత్తర్వులు జారీచేసింది.

 వెయ్యి దహన సంస్కారాలకు ఏర్పాట్లు..

దిల్లీ శ్మశానాల్లో రద్దీ పెరిగిపోయి దహన సంస్కారాల నిర్వహణ కోసమూ భౌతికకాయాలను వరుసలో పెట్టాల్సిన దుస్థితి నెలకొనడంతో నగరపాలక సంస్థలు అప్రమత్తమయ్యాయి. భవిష్యత్తులో తలెత్తబోయే పరిస్థితులను అంచనావేసి రోజుకు వెయ్యి దహన సంస్కారాలు నిర్వహించేందుకు వీలుగా విస్తృత ఏర్పాట్లు మొదలుపెట్టాయి. ప్రతిరోజూ 15% అంత్యక్రియలు పెరుగుతున్నాయని, అందువల్ల వసతులను పెంచకతప్పని పరిస్థితి నెలకొందని అధికారులు తెలిపారు. గత వారం రోజులుగా రోజుకు 300మేర మరణాలు సంభవిస్తున్నట్లు దిల్లీ ప్రభుత్వం చెబుతున్నప్పటికీ గత సోమవారం 357, మంగళవారం 410, బుధవారం 432, గురువారం 483, శుక్రవారం 539, శనివారం 585 మందికి అంత్యక్రియలు నిర్వహించినట్లు ఇక్కడి మున్సిపల్‌ గణాంకాలు చెబుతున్నాయి. ఈ మంగళవారం దాదాపు 700 వరకు జరిగినట్లు తెలిసింది. దీన్ని దృష్టిలో ఉంచుకొనే ఇప్పుడు వెయ్యి దహన సంస్కారాలకు ఏర్పాట్లు చేయడానికి అధికారులు సమాయత్తమయ్యారు.

సాఫీగా కలప సరఫరా అయ్యేలా చూడండి

శ్మశానాల్లో అంత్యక్రియలు నిర్వహించేందుకు అవసరమైన కలప సరఫరా సాఫీగా సాగేలా చూడాలంటూ ఉత్తర దిల్లీ నగర పాలక సంస్థ మేయర్‌ జై ప్రకాశ్‌ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు బుధవారం విజ్ఞప్తి చేశారు. ఈ విషయమై అటవీశాఖ అధికారులకు తగిన ఆదేశాలు జారీచేయాలని కోరారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని