
తాజా వార్తలు
యూట్యూబర్ తప్పుడు రివ్యూ.. మూతపడ్డ హోటల్
ఇంటర్నెట్ డెస్క్: యూట్యూబర్లు తమ ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసిన నెటిజన్ల పట్ల బాధ్యతగా వ్యవహరించాలి. ఎందుకంటే వారు ఏది చెప్పినా నెటిజన్లు నిజమని నమ్మే అవకాశాలు ఎక్కువ కాబట్టి. సామాజిక బాధ్యతతో ఏ వీడియోనైనా ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుని పోస్టు చేయాలి. ఏ కాస్త నిర్లక్ష్యం వహించినా, అది పెద్ద తప్పిదానికి దారితీయొచ్చు. అలాంటి సంఘటనే దక్షిణకొరియాలో ఓ యూట్యూబర్ వల్ల జరిగింది. ఒక హోటల్‌పై అతడు ప్రతికూల రివ్యూలు ఇవ్వడంతో అది కాస్తా వైరల్‌గా మారి ఏకంగా హోటల్ మూసివేతకు దారితీసింది. తర్వాత తన తప్పిదాన్ని తెలుసుకున్న యూట్యూబర్ నాలుక్కర్చుకున్నాడు.
దక్షిణకొరియాకు చెందిన హయన్ ట్రీ... రెస్టారెంట్లు, ఆహారపదార్థాలపై రివ్యూలు ఇస్తూ యూట్యూబ్‌లో పోస్టు చేస్తుంటాడు. అతడికి దాదాపు 7లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఈ మధ్య అక్కడి డయగు అనే ప్రాంతంలోని ఓ రెస్టారెంట్‌కు వెళ్లిన హయన్ పలు ఆహార పదార్థాలను ఆర్డర్ ఇచ్చి రుచి చూశాడు. సర్వర్ తీసుకొచ్చిన పదార్థాలను వడ్డించుకుంటుండగా, అందులో అక్కడక్కడా అన్నం మెతుకులు కనిపించాయి. దాంతో రెస్టారెంట్ యాజమాన్యంపై హయన్ మండిపడ్డాడు. తినగా మిగిలిన పదార్థాలను మళ్లీ కస్టమర్లకు వడ్డిస్తున్నారని దారుణమైన రివ్యూ ఇచ్చాడు. ఆ వీడియో కాస్తా వైరల్‌గా మారింది. పది లక్షలకుపైగా నెటిజన్లు దానిని చూశారు. రెస్టారెంట్‌పై నెటిజన్లు, కస్టమర్లు తీవ్ర విమర్శలు చేశారు. ఫలితంగా రెస్టారెంట్‌ను మూసివేయాల్సి వచ్చింది.
హయన్ పోస్టు చేసిన కొన్ని గంటల్లోనే రెస్టారెంట్ యాజమాన్యం స్పందించింది. తాము మిగిలిన పదార్థాలను కస్టమర్లను వడ్డించమనీ, కావాలంటే వీడియో ఫుటేజ్ చూపిస్తామనీ పదేపదే వివరణ ఇచ్చింది. అయినా ఫలితం లేకపోయింది. ‘నిజం గడప దాటేలోపు.. అబద్ధం ఊరు చుట్టొస్తుంది’ అన్న చందంగా.. యూట్యూబర్ రివ్యూ వైరల్ అయినంతంగా ఈ వివరణ ప్రజల్లోకి వెళ్లలేదు. కొన్నాళ్ల తరవాత రెస్టారెంట్ ఫుటేజ్ హయన్ కంటపడింది. తను తిన్న ప్లేటులో అన్నం మెతుకులే మళ్లీ పెట్టుకున్న ఆహారపదార్థాలకు అంటుకున్నాయని గుర్తించాడు. తప్పు తెలుసుకొని రెస్టారెంట్ యజమాన్యానికి క్షమాపణ చెప్పడానికి ప్రయత్నించాడు. అప్పటికే ఆర్థికంగా ఎంతో నష్టం చవిచూసిన యజమాని హయన్ క్షమాపణ పట్ల అసంతృప్తి వ్యక్తం చేశాడు. దీంతో హయన్.. తను చేసిన తప్పిదానికి క్షమాపణ చెబుతూ మరో వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. హయన్ తీరుపై నెటిజన్ల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఎంతలా అంటే.. వేలమంది నెటిజన్లు హయన్ ఛానెల్‌ను అన్‌సబ్‌స్క్రైబ్ చేశారు. ఈ ఘటనపై రెస్టారెంట్ యాజమాని ఆగ్రహం వ్యక్తం చేయడమే కాదు, ఇలాంటి యూట్యూబర్లను నియంత్రించేలా చట్టాలు తీసుకురావాలంటూ పిటిషన్ దాఖలు చేశాడు.