close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
డబ్ల్యూహెచ్‌వోకు ట్రంప్‌ అల్టిమేటం

చైనా ప్రభావం లేదని రుజువు చేసుకోవాలన్న అమెరికా అధ్యక్షుడు

వాషింగ్టన్‌:కరోనా వ్యాప్తి నియంత్రణలో ఘోరంగా విఫలమైందంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో)పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి విమర్శలతో విరుచుకుపడ్డారు. చైనా అధీనంలో కాకుండా స్వతంత్రంగా పనిచేస్తున్నామని 30 రోజుల్లోగా నిరూపించుకోవాలంటూ డబ్ల్యూహెచ్‌వోకు ఆయన ఆఖరి హెచ్చరిక(అల్టిమేటం) జారీ చేశారు. లేనిపక్షంలో సంస్థకు తమ దేశం నుంచి ఇంకెప్పటికీ నిధులు అందకుండా చర్యలు తీసుకుంటామన్నారు. సంస్థలో తమ సభ్యత్వాన్నీ వదులుకునేందుకూ వెనుకాడబోమని హెచ్చరించారు. డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధనామ్‌కు ట్రంప్‌ ఈ మేరకు నాలుగు పేజీల లేఖ రాశారు. అమెరికా నుంచి డబ్ల్యూహెచ్‌వోకు ఏటా అందే నిధులను ట్రంప్‌ ఇప్పటికే తాత్కాలికంగా నిలిపివేసిన సంగతి గమనార్హం. ట్రంప్‌ తాజా వ్యాఖ్యలపై చైనా స్పందిస్తూ.. కరోనా విజృంభణను అడ్డుకోవడంలో అమెరికా ప్రభుత్వం విఫలమైందని పేర్కొంది. ఆ వైఫల్యం నుంచి అందరి దృష్టిని మళ్లించేందుకే తమపై, డబ్ల్యూహెచ్‌వోపై విమర్శలు గుప్పిస్తున్నారని ఆరోపించింది.

హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను రోజూ తీసుకుంటున్నా
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ తనకు సోకకుండా ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రతిరోజు హైడ్రాక్సీ క్లోరోక్విన్‌(హెచ్‌సీక్యూ) ఔషధాన్ని తీసుకుంటున్నట్లు ట్రంప్‌ వెల్లడించారు. ఇప్పటివరకు తనలో కొవిడ్‌ లక్షణాలేవీ కనిపించలేదని చెప్పారు. హెచ్‌సీక్యూతో దుష్ప్రభావాలు తలెత్తే ముప్పుందని అమెరికా ఆహార, ఔషధ ప్రాధికార సంస్థ(ఎఫ్‌డీఏ) హెచ్చరించినప్పటికీ.. ఆ ఔషధాన్ని ట్రంప్‌ తీసుకుంటుండటం తాజాగా చర్చనీయాంశమైంది. వాషింగ్టన్‌లో రెస్టారెంట్‌ ఎగ్జిక్యూటివ్‌లతో తాజాగా జరిగిన సమావేశంలో ట్రంప్‌ మాట్లాడుతూ.. ‘‘దాదాపు 10 రోజులుగా హెచ్‌సీక్యూను తీసుకుంటున్నా. ఏదో ఒకరోజు ఆపేస్తా. కరోనాకు టీకా, మెరుగైన చికిత్స త్వరలోనే అందుబాటులోకి వస్తుందని అనుకుంటున్నా’’ అని అన్నారు. హెచ్‌సీక్యూ తీసుకోవాలని తనకు శ్వేతసౌధ వైద్యుడేమీ సిఫార్సు చేయలేదని స్పష్టం చేశారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.