
ప్రధానాంశాలు
కేంద్రం మార్గదర్శకాలు
ఈనాడు, దిల్లీ
కరోనా వైరస్ సోకకుండా వైద్యసిబ్బంది ముందుజాగ్రత్తగా తీసుకుంటున్న హైడ్రాక్సీ క్లోరోక్విన్(హెచ్‌సీక్యూ) మాత్రలను కంటెయిన్మెంట్ జోన్లలో పనిచేసే పోలీసులు, పారామిలటరీ సిబ్బందికి కూడా ఇవ్వాలని ఐసీఎంఆర్ సిఫార్సు చేసింది. ఎయిమ్స్, ఎన్సీడీసీ, ఎన్డీఎంఎ, డబ్ల్యూహెచ్‌వో ప్రతినిధులతో కలిసి హెచ్‌సీక్యూ ప్రభావంపై అధ్యయనం చేసిన అనంతరం ఐసీఎంఆర్ ఇచ్చిన నివేదిక ఆధారంగా కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ దీని వినియోగంపై సవరించిన మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ మాత్రలు తీసుకుంటున్న వైద్యసిబ్బందిలో దుష్పరిణామాలు కనిపిస్తున్నప్పటికీ వైరస్ సంక్రమణ విషయంలో అది చెప్పుకోదగ్గ స్థాయిలోనే పనిచేస్తున్నట్లు ఐసీఎంఆర్ పేర్కొంది. మొత్తం 1,323 మంది వైద్య సిబ్బందిపై అధ్యయనం జరపగా అందులో 8.9% మందిలో వికారం, 7.3% మందిలో కడుపునొప్పి, 1.5% మందిలో వాంతులు, 1.7% మందిలో హైపోగ్లైసేమియా, 1.9% మందిలో కార్డియో వాస్కులర్ ప్రభావం కనిపించినట్లు వెల్లడించింది. ఫార్మాకోవిజిలెన్స్ ప్రోగ్రాం ఆఫ్ ఇండియా నుంచి సేకరించిన డేటా ప్రకారం హెచ్‌సీక్యూ తీసుకున్న 214 మందిలో తీవ్ర దుష్పరిణామాలు కనిపించినట్లు ఐసీఎంఆర్ స్పష్టం చేసింది. అయితే దిల్లీలోని మూడు ఆసుపత్రుల్లో కొవిడ్ సేవలు అందిస్తున్న వైద్యసిబ్బందిపై ఇది మంచి ప్రభావమే చూపినట్లు గుర్తించింది. హెచ్‌సీక్యూ తీసుకోని సిబ్బందితో పోల్చిచూస్తే తీసుకున్న సిబ్బందిలో వైరస్ వ్యాప్తి తక్కువగా ఉన్నట్లు పేర్కొంది. ఈ అధ్యయనంలో తేలిన ఫలితాల ఆధారంగా వైద్య సిబ్బంది అందరికీ హెచ్సీక్యూని సిఫార్సు చేస్తున్నట్లు తెలిపింది. కొవిడ్, నాన్ కొవిడ్ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న వైద్యసిబ్బందిలో రోగలక్షణాలు లేకపోయినా ఇది ముందుజాగ్రత్తగా వాడాలని పేర్కొంది. కంటెయిన్మెంట్ జోన్లలో పనిచేసే సర్వైలెన్స్ వర్కర్లు, కొవిడ్ సంబంధ నియంత్రణ పనుల్లో పాల్గొనే పారామిలిటరీ సిబ్బంది, పోలీసు సిబ్బందికీ ఇది ఇవ్వాలని సిఫార్సు చేసింది. పాజిటివ్‌గా తేలిన రోగులతో సంబంధం ఉన్న కుటుంబసభ్యులూ ముందుజాగ్రత్తగా తీసుకోవాలని సూచించింది.
వీరికి ఇవ్వకూడదు
రెటినోపతి, హైపర్ సెన్సిటివిటీ, జీ6పీడీ డెఫిషియన్సీ, ముందస్తు గుండె సంబంధ సమస్యలున్నవారికి మాత్రం ఈ మాత్రలు ఇవ్వకూడదని ఐసీఎంఆర్ స్పష్టంచేసింది. 15 ఏళ్లలోపు పిల్లలకు, గర్భిణిలు, బాలింతలకు ఇవ్వొద్దని పేర్కొంది. అరుదుగా గుండె సంబంధమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉందని, అలాంటి సమయంలో దీన్ని మానేయాలని చెప్పింది. కొన్నిసార్లు చూపు మసకబారే అవకాశం కూడా ఉంటుందని, అలాంటి సమయంలోనూ నిలిపేయాలని పేర్కొంది.
మోతాదు ఇలా...
1. కరోనా పాజిటివ్ వచ్చిన వారి కుటుంబసభ్యులకు: తొలిరోజు రెండుసార్లు 400 ఎంజీ ఇవ్వాలి. తర్వాత వారానికి ఒకసారి 400 ఎంజీ చొప్పున మూడు వారాలు భోజనంతో పాటు తీసుకోవాలి.
2. కొవిడ్, నాన్‌కొవిడ్ ఆసుపత్రులు, ప్రాంతాల్లో పనిచేసే వైద్య ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్ వర్కర్స్, పోలీసులు, పారామిలిటరీ సిబ్బందికి: తొలిరోజు రెండుసార్లు 400 ఎంజీ ఇవ్వాలి. తర్వాత వారానికి ఒకసారి 400 ఎంజీ చొప్పున 7 వారాలపాటు భోజనంతో కలిపి తీసుకోవాలి.
* ఈ మందును వైద్యుల పర్యవేక్షణలో, వారి సలహామేరకే అందించాలి. ఏదైనా ప్రతికూల ప్రభావం కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. వైద్యసిబ్బంది ఈ మందు తీసుకున్నప్పటికీ తప్పనిసరిగా పీపీఈలు ధరించాలి. ఇది తీసుకున్నాక కూడా ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే సంబంధిత ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోవాలి. కొవిడ్ లక్షణాలతో పాటు ఇతర వ్యాధి లక్షణాలు కనిపిస్తే అందుకు సంబంధించిన చికిత్స కూడా పొందాలి.
ప్రధానాంశాలు
దేవతార్చన

- ‘బిడ్డలిద్దరూ శివపార్వతులు.. నేను కాళికను’
- అక్కాచెల్లెళ్ల మరణానికి ఆ నమ్మకమే కారణమా?
- దోచుకున్న నాలుగు గంటలకే దొరికేశారు
- RRR రిలీజ్.. ఇది అన్యాయం: బోనీకపూర్
- థాంక్యూ.. టీమ్ఇండియా అంటున్న లైయన్
- 21 ఏళ్లకే వ్యాపార పాఠాలు!
- వెజ్ బఫె రూ.500, నాన్‌వెజ్ బఫె రూ.700
- ముంబయిని కేంద్రపాలిత ప్రాంతం చేయండి
- అచ్యుతానందగిరి స్వామి దారుణ హత్య
- మదనపల్లె కేసు: రిమాండ్ రిపోర్ట్‌లో కీలకాంశాలు