close

ప్రధానాంశాలు

Updated : 17/09/2020 06:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

బిల్లు రూ.వెయ్యికి మించితే ఆన్‌లైన్‌లోనే చెల్లింపు

 విద్యుత్తు వినియోగదారుల హక్కులపై కేంద్రం ముసాయిదా
 ఈ నెల 30లోగా అభిప్రాయాలు చెప్పాలని సూచన

ఈనాడు, దిల్లీ: వినియోగదారుడి నెలవారీ విద్యుత్తు బిల్లు రూ.వెయ్యి మించితే తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో చెల్లించాలన్న నిబంధనను కేంద్ర విద్యుత్తుశాఖ తీసుకొస్తోంది. విద్యుత్తు వినియోగదారుల హక్కులు-2020 పేరుతో రూపొందించిన ముసాయిదాలో ఈ అంశాన్ని పేర్కొంది. బిల్లు రూ.వెయ్యికానీ, లేదంటే కమిషన్‌ నిర్దేశించిన మొత్తాన్నికానీ మించితే తప్పనిసరిగా ఆన్‌లైన్‌లోనే చెల్లించాలి. ఇలా చెల్లించేవారికి కమిషన్‌ నిర్దేశించిన ప్రత్యేకమైన ప్రోత్సాహకాలు, రాయితీలు లభిస్తాయి. దీనిపై ఈనెల 30వ తేదీలోపు అభిప్రాయాన్ని చెప్పాలని బుధవారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో కోరింది. ఆలోపు వచ్చిన సలహాలు, సూచనలను పరిగణలోకి తీసుకొని తుది ఉత్తర్వులు జారీ చేస్తామని పేర్కొంది.
* 10 కేడబ్ల్యూ లోడ్‌ వరకు కొత్త కనెక్షన్‌ తీసుకోవడానికి రెండు పత్రాలు చాలు. అందులో 1. గుర్తింపుకార్డు (పాస్‌పోర్టు, ఆధార్‌కార్డులాంటివి), 2. కనెక్షన్‌ తీసుకొనే స్థలం/భవనానికి సంబంధించిన యాజమాన్య హక్కులు సమర్పిస్తే సరిపోతుంది.
* కొత్త కనెక్షన్‌/పాత కనెక్షన్‌ మార్చడానికి భౌతికంగాకానీ, ఆన్‌లైన్‌ వెబ్‌పోర్టల్‌, మొబైల్‌ యాప్‌ ద్వారాకానీ దరఖాస్తు చేసుకోవచ్చు. ఒకవేళ కేవలం హార్డ్‌కాపీయే సమర్పించాలని షరతు విధిస్తే మాత్రం అవి అందిన వెంటనే డిజిటైజ్‌ చేసి వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌చేసి వినియోగదారుడికి రిజిస్ట్రేషన్‌ సంఖ్య పంపాలి. ఒకసారి దరఖాస్తుదారుకి రిజిస్ట్రేషన్‌ సంఖ్య వస్తే ఆ దరఖాస్తు అందినట్లుగానే భావించాలి. గ్రామీణ ప్రాంతాల్లో అయితే 30 రోజులు, మున్సిపల్‌ ప్రాంతాల్లో అయితే 15 రోజులు, మెట్రోనగరాల్లో అయితే వారం రోజుల్లోపు కొత్త కనెక్షన్‌ ఇవ్వడం, లేదంటే ఇప్పుడున్న కనెక్షన్‌ను మార్చడం చేయాలి.
* మీటరు లోపభూయిష్టం, కాలిపోవడం, చోరీకి గురైన మీటర్ల స్థానంలో పట్టణాల్లో అయితే 24 గంటల్లో, గ్రామీణప్రాంతాల్లో అయితే 72 గంటల్లో కొత్త మీటర్లు ఏర్పాటు చేయాలి. మీటర్లు లేవన్న పేరుతో విద్యుత్తు సరఫరా పునరుద్ధరణలో జాప్యం చేయడానికి వీల్లేదు.
* మీటరు సరిగా పనిచేయకపోవడానికి వినియోగదారుడు కారణమని ప్రాథమిక విచారణలో తేలితే కమిషన్‌ నిర్దేశించిన సమయంలోపు సంబంధిత వ్యక్తి ఖర్చుతోనే కొత్త మీటర్‌ ఏర్పాటు చేయాలి.
* మీటరు తనిఖీ చేసినప్పుడు అది ఎక్కువో, తక్కువో మీటర్‌ రీడింగ్‌ చూపుతోందని గుర్తిస్తే అందుకు సంబంధించిన ఛార్జీలను బిల్లులోనే సర్దుబాటు చేయాలి. డిస్కంలు చేసిన మీటర్‌ రీడింగ్‌ పరీక్షలతో వినియోగదారుడు విభేదిస్తే వినియోగదారుడు ఎంపిక చేసిన థర్డ్‌పార్టీతో దాన్ని తనిఖీ చేయించాలి. కమిషన్‌ అనుమతించిన థర్డ్‌పార్టీ లిస్ట్‌ను వినియోగదారులకు అందుబాటులో ఉంచాలి.
* మీటరు వినియోగదారుడి ఇంటిబయట అమర్చి ఉంటే దాని రక్షణ బాధ్యత డిస్కంలదే, ఒకవేళ ఇంట్లో బిగించి ఉంటే దాని మంచిచెడులకు వినియోగదారుడు బాధ్యత వహించాల్సి ఉంటుంది.
* టారిఫ్‌ లెక్కలు డిస్కంల వెబ్‌సైట్‌లో పెట్టాలి. ప్రతి బిల్లింగ్‌ సైకిల్‌కు ముందే వివరాలు ఉంచాలి. అందులో ఇంధన సర్‌ఛార్జి, ఇతర ఛార్జీల వివరాలు స్పష్టంగా పేర్కొనాలి.
* మీటరు రీడింగ్‌ సరిగాలేదని, విద్యుత్తు వినియోగానికి, మీటరు రీడింగ్‌కు తేడా ఉందనికానీ, ఆగిపోయింది, కాలిపోయింది, పాడయిందనికానీ వినియోగదారుడు ఫిర్యాదుచేస్తే 30 రోజుల్లోపుకానీ, కమిషన్‌ నిర్దేశించిన గడువులోపుకానీ తనిఖీచేయాలి. అందుకోసం రుసుము ఏదీ వసూలు చేయకూడదు.
* సౌర విద్యుత్తు ఉత్పత్తి చేసే వినియోగదారులు ఇప్పుడు ఉపయోగిస్తున్న కనెక్షన్‌ ద్వారానే విద్యుత్తును విక్రయించుకోవచ్చు.
* మీటర్‌ లేకుండా కొత్త కనెక్షన్‌ ఇవ్వకూడదు. మీటర్లన్నీ స్మార్ట్‌ ప్రీపెయిడ్‌వే అయి ఉండాలి. ఒకవేళ స్మార్ట్‌మీటర్ల నుంచి మినహాయింపు కావాలంటే అందుకు విద్యుత్తు కమిషన్‌ అనుమతి తప్పనిసరి. ఒకవేళ కమిషన్‌ అందుకు అనుమతిచ్చేట్లయితే న్యాయబద్ధమైన కారణాలు చూపెట్టాలి.
* కొత్త కనెక్షన్‌ సమయంలో వినియోగదారుడికి రెండు అవకాశాలు ఇవ్వాలి. మీటరుతోపాటు, ఎంసీబీ, ఇతర పరికరాలన్నీ అతనే కొనుగోలు చేసే వీలు కలిగించడంగానీ, లేదంటే దరఖాస్తు సమయంలోనే డబ్బుకట్టి డిస్కం ద్వారా తీసుకొనే వెసులుబాటు కల్పించడంగానీ చేయాలి.
* ఏయే విద్యుత్తు మీటర్లు, ఇతర పరికరాలను అనుమతిస్తున్నదీ డిస్కంలు తమ వెబ్‌సైట్‌లో స్పష్టంగా పొందుపరచాలి. దాన్నిబట్టి వినియోగదారుడు వాటిని బయట కొనుగోలు చేయాలా? లేదంటే డిస్కంల నుంచే తీసుకోవాలా? అన్నది నిర్ణయించుకుంటారు.
* ప్రతి బిల్లును గడువుకు పదిరోజుల ముందు వినియోగదారుడికి చేరేలా అందించాలి. ఒరిజినల్‌ బిల్లు రాకపోతే డూప్లికేట్‌ బిల్లుకోరే హక్కు వినియోగదారుడికి ఉంటుంది. లేదంటే స్వీయ మదింపు చేసుకొని బిల్లు చెల్లించవచ్చు. అలా కట్టిన మొత్తం వాస్తవ బిల్లు కంటే ఎక్కువ/తక్కువ అయితే మిగిలిన మొత్తాన్ని తదుపరి నెలల్లో సర్దుబాటు చేయాలి.
* బిల్లు జారీ చేసిన వెంటనే ఆ విషయాన్ని వినియోగదారుడికి ఎస్‌ఎంఎస్‌, ఈ-మెయిల్‌ ద్వారా చెప్పాలి. వినియోగదారులకు సంబంధించిన అన్ని బిల్లులనూ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలి. అవి ఏడాదిపాటు అందుబాటులో ఉండేలా చూడాలి.
* వినియోగదారులకు 60 రోజులు అంతకుమించి ఆలస్యంగా బిల్లులు పంపిస్తే వాటిపై రాష్ట్ర విద్యుతు ్తకమిషన్‌ నిర్దేశించిన ప్రకారం 2 నుంచి 5% వరకు రాయితీ ఇవ్వాలి.
* వినియోగదారులు ఎవరైనా ఇంటిని దీర్ఘకాలం పాటు ఖాళీచేసి వేరేచోటికి పోతున్నామనుకున్నపుడు ముందస్తు సమాచారం ఇచ్చి ముందస్తుగానే ఫిక్స్‌డ్‌ ఛార్జీలు చెల్లిస్తే అలాంటి వారికి డిస్కంలు నోటీసులు, తాత్కాలిక బిల్లులు పంపకూడదు. విద్యుత్తు లైన్‌ను యథాతథంగా ఉంచాలి.
* వినియోగదారుడు తన కనెక్షన్‌ను శాశ్వతంగా తొలగించాలని అడిగినప్పుడు ఫైనల్‌ బిల్లు చెల్లించిన వెంటనే దాన్ని తొలగించాలి. ఒకవేళ ఫైనల్‌ బిల్లు, మీటర్‌ రీడింగ్‌ మధ్యలో ఏదైనా తేడావస్తే దాన్ని సెక్యూరిటీ డిపాజిట్‌ నుంచి సర్దుబాటు చేసుకోవాలి. మిగిలిన డిపాజిట్‌ మొత్తాన్ని 7రోజుల్లోపు తిరిగి చెల్లించేయాలి.
* పాత బిల్లులు చెల్లించలేదన్న కారణంతో డిస్‌కనెక్ట్‌ చేసి ఉంటే, వాటిని చెల్లించిన ఆరుగంటల్లోపు కనెక్షన్‌ను పునరుద్ధరించాలి.
* ప్రీపెయిడ్‌ మీటర్‌లో డబ్బు అయిపోయిన వెంటనే విద్యుత్తు సరఫరా ఆగిపోవాలి. దాన్ని డిస్‌కనెక్షన్‌ కింద భావించకూడదు. రీఛార్జి చేసిన వెంటనే సరఫరా అయ్యేలా చూడాలి.
* వినియోగదారులకు డిస్కంలకు 24్ఠ7 విద్యుత్తు సరఫరాచేయాలి. వ్యవసాయదారుల్లాంటి ప్రత్యేక వినియోగదారులకు తక్కువ గంటలు సరఫరా చేయాలని కమిషన్‌ నిర్దేశించవచ్చు. ఏడాదిలో ఎన్నిసార్లు విద్యుత్తు సరఫరాలో లోపం రావొచ్చన్నది కమిషన్‌ స్పష్టం చేయాలి. సిస్టం యావరేజ్‌ ఇంటరప్షన్‌ డ్యూరేషన్‌ ఇండెక్స్‌ (ఎస్‌ఏఐడీఐ), సిస్టం యావరేజ్‌ ఇంటరప్షన్‌ ఫ్రీక్వెన్సీ ఇండెక్స్‌ (ఎస్‌ఏఐఎఫ్‌ఐ) పేరుతో విద్యుత్తు అందని (అవుటేజ్‌) సమయాన్ని లెక్కించాలి. ఇలాంటి పరిస్థితులను పరిశీలించి, వెంటనే విద్యుత్తు పునరుద్ధరించడానికి డిస్కంలు ప్రత్యేక యంత్రాంగాలను ఏర్పాటుచేయాలి.
* సేవలు అందించడంలో డిస్కంలు జాప్యంచేస్తే వినియోగదారుడికి పరిహారం అందించాలి. ఆ మొత్తాన్ని బిల్లు ద్వారా ఆటోమేటిక్‌గా వినియోగదారుడికి చేరవేయాలి.
* కనెక్షన్‌, డిస్‌కనెక్షన్‌, రీ కనెక్షన్‌కోసం 24్ఠ7 కాల్‌సెంటర్‌, వెబ్‌పోర్టల్‌, మొబైల్‌ అప్లికేషన్‌ నిర్వహించాలి.
* వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార వేదికలో సబ్‌ డివిజన్‌ స్థాయి నుంచి ఇద్దరు, ముగ్గరు వినియోగదారులకు ప్రాతినిధ్యం కల్పించాలి. దీనివల్ల ఫిర్యాదుల పరిష్కారం సులభం అవుతుంది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.