close

ప్రధానాంశాలు

Published : 03/12/2020 05:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

వయోజనులైన జంట సహజీవనం చేయొచ్చు

 వారి ప్రశాంత జీవనంలో ఇతరుల జోక్యం తగదు
 అలహాబాద్‌ హైకోర్టు స్పష్టీకరణ

అలహాబాద్‌: పరస్పరం ఇష్టపడిన వయోజనులైన జంటకు సహజీవనం చేసే హక్కు ఉంటుందని అలహాబాద్‌ హైకోర్టు తెలిపింది. వారి ప్రశాంతమైన జీవితాల్లో కుటుంబ సభ్యులు/ఇతరులు జోక్యం చేసుకోజాలరని జస్టిస్‌ అంజనీ కుమార్‌ మిశ్ర, జస్టిస్‌ ప్రకాశ్‌ పాడియాలతో కూడిన ధర్మానం స్పష్టం చేసింది. ‘‘యుక్త వయసుకు వచ్చిన యువతి, యువకుడు అంగీకారంతో కలిసి జీవిస్తున్నట్లయితే, వారి సహజీవన విషయంలో జోక్యం చేసుకొనే హక్కు వారి తల్లిదండ్రులతో సహా ఎవరికీ లేదు’’ అని సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును ధర్మాసనం ఉటంకించింది. ఫరూఖాబాద్‌కు చెందిన కామినీదేవి, అజయ్‌కుమార్‌ సంయుక్తంగా దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా అలహాబాద్‌ హైకోర్టు ధర్మాసనం ఈ విషయాన్ని తెలిపింది. తాము ఆరునెలలుగా ప్రేమించుకుంటున్నట్లు పిటిషనర్లు కోర్టుకు తెలిపారు. మరో వ్యక్తిని వివాహం చేసుకోవాలంటూ తల్లిదండ్రులు వేధిస్తున్నారని, తమకు రక్షణ కల్పించాలని కామినీ దేవీ విన్నవించింది. రాజ్యాంగ అధికరణం 21 ప్రకారం జీవించే హక్కు పౌరుల ప్రాథమిక హక్కుల్లో ఒకటని హైకోర్టు పేర్కొంది. వ్యక్తిగత స్వేచ్ఛను, జీవించే హక్కును ఏ వ్యక్తికీ తిరస్కరించజాలరని తెలిపింది. తల్లిదండ్రుల వేధింపుల నుంచి ఆ జంటకు రక్షణ కల్పించాలని పోలీసుల్ని ధర్మాసనం ఆదేశించింది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన