close

ప్రధానాంశాలు

Published : 03/12/2020 05:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పాత్రికేయుని వెనుక దిగ్భ్రాంతికర వాస్తవాలు

 సుప్రీంకోర్టుకు తెలిపిన యూపీ ప్రభుత్వం

దిల్లీ: కేరళకు చెందిన పాత్రికేయుడు సిద్దికీ కప్పన్‌ వెనుక దిగ్భ్రాంతికర వాస్తవాలు ఉన్నాయని ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఆయన జర్నలిస్టు ముసుగులో పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా కార్యాలయ కార్యదర్శిగా పనిచేస్తున్నారని ఆరోపించింది. హథ్రాస్‌లో దళిత యువతి అత్యాచారానికి గురయిన విషయమై వార్తలు రాయడానికి వెళ్లిన ఆయనను అక్టోబరు 5న ఉత్తర్‌ప్రదేశ్‌ పోలీసులు దారిలోనే అడ్డుకొని అరెస్టు చేశారు. బెయిల్‌ మంజూరు కోసం దాఖలైన వ్యాజాన్ని బుధవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.ఎ.బోబ్డే, జస్టిస్‌ ఎస్‌.ఎ.బోపన్న, జస్టిస్‌ వి.రామసుబ్రమణిన్‌లతో కూడిన ధర్మాసనం విచారణకు చేపట్టింది. యూపీ ప్రభుత్వం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదనలు వినిపిస్తూ ఆయన పనిచేస్తున్నారని చెబుతున్న కేరళ పత్రిక రెండేళ్ల క్రితమే మూతపడిందని అన్నారు. పాత్రికేయుని ముసుగులో హథ్రాస్‌ వెళ్లి అక్కడ అశాంతి సృష్టించడానికి ప్రయత్నించారని తెలిపారు. ఇంతవరకు జరిగిన దర్యాప్తులో ఈ విషయాలు తేలాయని వివరించారు. నిందితుని తరఫున తాను వాదనలు వినిపిస్తానని సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ తెలిపారు.
బాధితురాలి ఫొటో ప్రచురణ విషయమై విచారణకు నిరాకరణ
ఇదే కేసులో బాధితురాలి ఫొటోను ప్రచురించిన వ్యవహారంపై ప్రశ్నిస్తూ దాఖలైన వ్యాజ్యాన్ని విచారించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఇలాంటి విషయాలపై మార్గదర్శకాలు ఇచ్చేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషన్‌దారు కోరారు. అయితే ఈ వ్యవహారంపై తొలుత ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలని న్యాయమూర్తులు జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌లతో కూడిన ధర్మాసనం సూచించింది. ఇప్పటికే దీనిపై చట్టాలు ఉన్నాయని, తాము కొత్తది తీసుకురాలేమని తెలిపింది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన