close

ప్రధానాంశాలు

Published : 03/12/2020 05:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కరోనాపై ‘పంచాయతీ’ సమరం

బూత్‌కు వెయ్యి మందే ఓటర్లు
చివరి గంటలో  కొవిడ్‌ బాధితులకు అవకాశం
కర్ణాటక స్థానిక ఎన్నికల ప్రణాళిక ఇదీ

ఈనాడు డిజిటల్‌, బెంగళూరు: కరోనాను సమర్థంగా ఎదుర్కొనే వ్యూహాలతో... గ్రామ పంచాయతీ ఎన్నికలకు కర్ణాటక అధికారులు సన్నద్ధమవుతున్నారు. పకడ్బందీ జాగ్రత్తలతో ఈ నెల 22, 29న పోలింగ్‌ నిర్వహించనున్నారు. దాదాపు మూడు కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకోబోతున్న తరుణంలో కరోనా నియంత్రణ చర్యల్ని కట్టుదిట్టంగా అమలు చేయడమే తమ లక్ష్యమని రాష్ట్ర ఎన్నికల కమిషనరు బి.బసవరాజు అన్నారు. కరోనా ప్రభావం వల్ల ఓటింగ్‌ శాతం తగ్గకుండా పంచాయతీ స్థాయి ఆరోగ్య కేంద్రాల్లో అవగాహన శిబిరాలు నిర్వహిస్తున్నారు.
బూత్‌కు వెయ్యి మందే: ముందస్తు ప్రణాళికలో భాగంగా.. మొత్తం 5,762 గ్రామ పంచాయతీలకు 45,128 పోలింగ్‌ కేంద్రాల్ని ఏర్పాటు చేశారు. ఒక్కో కేంద్రంలో గరిష్ఠంగా వెయ్యి మందే ఓటు వేసే వీలుంది. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల దాకా సాధారణ ప్రజలు ఓటు వేస్తారు. ఆపై ఓ గంట పాటు కరోనా బాధితులకు అవకాశం కల్పిస్తారు. ఎంత మంది కరోనా బాధితులు ఓటేసేందుకు ఆసక్తి చూపుతున్నారనే వివరాలను జిల్లా రిటర్నింగ్‌ అధికారికి ముందుగానే స్థానిక అధికారులు నివేదించాలి. స్థానిక ఆరోగ్య అధికారి సూచనల మేరకు బాధితుల్ని పోలింగ్‌ కేంద్రానికి తరలిస్తారు. వారికి ప్రత్యేక అంబులెన్సులు ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలోనే ఏర్పాటు చేయనున్నారు. ప్రతి పోలింగ్‌ కేంద్రానికి ఇద్దరు ఆరోగ్య కార్యకర్తలను, ఆరోగ్య శాఖ పర్యవేక్షకుడిని నియమించారు. పోలింగ్‌ కేంద్రం ప్రవేశ ద్వారం దగ్గర థర్మల్‌ స్క్రీనింగ్‌తో శరీర ఉష్ణోగ్రతల్ని పరీక్షిస్తారు. కరోనా వ్యాప్తి చెందకుండా చూసేందుకు ఈ ఎన్నికలను బ్యాలెట్‌ విధానంలోనే నిర్వహిస్తారు.
లక్షణాలుంటే.. పరీక్ష: కరోనా లక్షణాలు కనిపిస్తే ఓటరుకు తక్షణమే యాంటీజెన్‌ పరీక్ష చేస్తారు. ఎన్నికలకు రెండు రోజుల ముందు గ్రామాల్లోకి అధికారులు తప్ప ఇతరుల రాకను నిషేధిస్తారు. గత నెలలో నిర్వహించిన శిర, రాజరాజేశ్వరినగర అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల్లోనూ సరిహద్దుల దగ్గర చెక్‌ పోస్టుల్ని ఏర్పాటు చేశారు. పంచాయతీ ఎన్నికలు ముగిశాక వారం పాటు కరోనా లక్షణాలున్న వారందరికీ ఉచిత యాంటీజెన్‌, ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలు నిర్వహిస్తారు. ఇదే విధానాన్ని ఉప ఎన్నికల సందర్భంలోనూ అమలు చేశారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన