
ప్రధానాంశాలు
సీసీటీవీ నిఘాలో పోలీసుస్టేషన్లు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు ఆదేశం
ఈనాడు, దిల్లీ: పోలీస్ స్టేషన్లలో తప్పనిసరిగా సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) లాంటి కార్యాలయాల్లోనూ వీటిని నెలకొల్పాలని నిర్దేశించింది. జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం బుధవారం ఈ మేరకు తీర్పు వెలువరించింది. తీర్పును తు.చ. తప్పకుండా సాధ్యమైనంత త్వరగా ఆచరణలో పెట్టాలని స్పష్టంచేసింది. పోలీస్ స్టేషన్లలో బాధితులు ఇచ్చే వాంగ్మూలాలను రికార్డు చేయడానికి సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరుతూ పరమ్‌వీర్‌సింగ్ సైనీ అనే వ్యక్తి దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ధర్మాసనం విచారించింది. మానవ హక్కుల ఉల్లంఘనను అరికట్టేందుకు అన్ని పోలీస్ స్టేషన్లు, జైళ్లలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని 2018లోనే సుప్రీంకోర్టు నిర్దేశించింది. ఆ ఆదేశాలు అమలు కాకపోవడాన్ని తాజా తీర్పులో ఆక్షేపించింది. ‘‘తీర్పును ఎన్ని రోజుల్లో అమలు చేయబోతున్నదీ తెలిపే ప్రణాళికలతో రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు ప్రమాణపత్రం దాఖలు చేయాలి. ఇది ఆరు వారాల్లోపు పూర్తికావాలి’’ అని ధర్మాసనం తన తీర్పులో నిర్దేశించింది. తదుపరి విచారణను జనవరి 27కి వాయిదా వేసింది.
ఏ భాగాన్నీ విడిచిపెట్టవద్దు
* రాత్రిపూట కూడా ఆడియో, వీడియో స్పష్టంగా రికార్డు కావాలి. విద్యుత్తు, ఇంటర్నెట్ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం ఆ సౌకర్యం కల్పించాలి. అందుబాటులో ఉన్న అత్యుత్తమ పరికరాల గురించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అఫిడవిట్ సమర్పించాలి.
* లాకప్‌లో ఉన్న వ్యక్తులకు పోలీసుల బలప్రయోగం కారణంగా తీవ్ర గాయాలైనట్లు, మరణాలు సంభవించినట్లు ఫిర్యాదు అందినప్పుడు మానవ హక్కుల సంఘాలు, కోర్టులు తక్షణం సీసీటీవీ కెమెరా దృశ్యాల కోసం ఆదేశించవచ్చు. దర్యాప్తు సంస్థలకూ అప్పగించవచ్చు.
* కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేస్తూ వ్యక్తులను అరెస్ట్ చేసే అధికారం ఉన్న ఇతర సంస్థల్లోనూ సీసీటీవీ కెమెరాలు, రికార్డింగ్ పరికరాలు ఏర్పాటు చేయాలి.
* సీసీటీవీల కవరేజి గురించిన సమాచారంతో పోలీస్స్టేషన్లు, దర్యాప్తు సంస్థల కార్యాలయాల్లో అందరికీ కనిపించేలా మూడు భాషల్లో పెద్ద పోస్టర్లు ఏర్పాటు చేయాలి.
ప్రధానాంశాలు
సినిమా
- మూఢత్వమే ప్రాణాలు తీసింది!
- 16 మంది మహిళలను చంపిన సైకో!
- బదిలీల ప్రతిపాదన తిరస్కరించిన ఎస్ఈసీ
- ‘పంత్ వ్యూహం’ కోహ్లీదే
- మదనపల్లె ఘటన:వెలుగులోకి కొత్త విషయాలు
- 12 మందితో లంక ఆట: ఐసీసీ సీరియస్!
- పెళ్లి ముచ్చటపై రష్మి-సుధీర్ ఏమన్నారంటే?
- మరో 30ని. క్రీజులో ఉంటే 3-1గా మారేది: పంత్
- కేదార్‌ను ధోనీ కొనసాగించేవాడు..కానీ: గంభీర్
- సుప్రీం తీర్పు: ఎస్ఈసీకి ఏపీ ప్రభుత్వ సహకారం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
